టీడీపీ లిక్కర్... వైసీపీ నేతలకు మజా !

దాంతో దరఖాస్తు చేసుకున్న వైసీపీ వారికి కూడా ఇతోధికంగా మద్యం దుకాణాలు దక్కినట్లు అయింది.

Update: 2024-10-15 07:34 GMT

తెలుగుదేశం లిక్కర్ పాలసీ కాదు కానీ మధ్యలో వైసీపీ నేతలు బాగుపడ్డారని అంటున్నారు. ఓపెన్ గా ఆన్ లైన్ లో దరఖాస్తులు తీసుకున్నారు. అదే విధంగా లాటరీ సిస్టం ద్వారా పక్కా పారదర్శకతతో మద్యం దుకాణాలను కేటాయించే కార్యక్రమం చేపట్టారు. దాంతో దరఖాస్తు చేసుకున్న వైసీపీ వారికి కూడా ఇతోధికంగా మద్యం దుకాణాలు దక్కినట్లు అయింది.

శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా చూస్తే వైసీపీ వారికి కూడా మద్యం దుకాణాలు వీలైనన్ని దక్కడంతో ఫ్యాన్ పార్టీ నేతలు ఖుషీ అవుతున్నారు. దరఖాస్తుల విషయంలో టీడీపీ కూటమి నేతలు దందా చేసినట్లుగా వార్తలు వచ్చాయి కానీ లాటరీ విధానంలో మద్యం దుకాణాల కేటాయింపులో మాత్రం అధికార పార్టీ ఎక్కడ తలదూర్చలేదు.

ఆ విధంగా చేయవద్దని ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు కచ్చితంగా రావడంతో టీడీపీ కూటమిలో మంత్రుల స్థాయి నుంచి ఎమ్మెల్యేల వరకూ అంతా గమ్మున ఉండిపోయారు. దాంతో కొన్ని చోట్ల తమ వారికి మద్యం దుకాణాలు దక్కించుకోలేకపోయారు కూడా.

అదే సమయంలో వైసీపీని చెందిన వారికి కూడా దుకాణాలు దక్కడంతో టీడీపీ లిక్కర్ పాలసీ భేష్ అని ఫ్యాన్ పార్టీ నేతలు బాహాటంగానే అంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 158 మద్యం దుకాణాలలో టీడీపీతో సమానంగా వైసీపీ వారు కూడా మద్యం దుకాణాలు సొంతం చేసుకోవడం విశేషం. అదే విధంగా చూస్తే కనుక బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం పరిధిలో ఉన్న 20 మద్యం దుకాణాలలో తొమ్మిది వైసీపీ వైసీపీ నేతలకు దక్కాయి. అంటే సగానికి సగం అన్న మాట. ఇదే పరిస్థితి అనేక జిల్లాలలో ఉంది.

దాంతో వైసీపీ నేతలలో ఒకరకమైన సంతోషం వెల్లి విరుస్తోంది. తమకు ఒక ఉపాధి దొరికిందని వారు భావిస్తున్నారు. వైసీపీ హయాం కంటే ముందు కూడా మద్యం వ్యాపారం చేసిన వైసీపీ నేతలకు ఫ్యాన్ పార్టీ అధికారంలోకి వస్తూనే పాలసీని మార్చడంతో పాటు ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించడం అది కూడా తాము ఎంచుకున్న కొంతమంది పెద్దల చేతిలో పెట్టడంతో వివిధ జిల్లాలలో వైసీపీ నేతలు అయిదేళ్ల పాటు మద్యం బిజినెస్ వైపే చూడలేదు. వారికి ఆ ఆశలు కూడా లేకుండా పోయాయి.

తమ ప్రభుత్వం వచ్చింది కదా మంచిగా మరింత జోరుగా బిజినెస్ చేసుకోవచ్చు అని ఆశించిన వారు కాస్తా అయిదేళ్ల పాటు తీవ్ర నైరాశ్యంలో గడిపారు. ఇపుడు టీడీపీ కూటమి ప్రభుత్వం వస్తూనే పాత పాలసీనే కొనసాగించడంతో ఉత్సాహంగా దరకాస్తు చేసుకున్న వారికి మద్యం దుకాణాలు దక్కాయి. దాంతో అయిదేళ్ల పాటు తమకు ఢోకా లేదన్న హుషార్ తో వారంతా ఉన్నారు.

తమ ప్రభుత్వం కంటే లిక్కర్ పాలసీ విషయంలో టీడెపీ కూటమి ప్రభుత్వమే బెటర్ అని కూడా అంటున్నారు. అదే టైం లో లాటరీ సిస్టం లో దుకాణాల కేటాయింపు చేయడం అంతా ఒక పద్ధతి ప్రకారమే చేయడం ద్వారా టీడీపీ కూటమి పెద్దలు పారదర్శకతతో వ్యవహరించారు అని పేరు తెచ్చుకున్నారు. అదే టైం లో మంత్రులను ఇతర ప్రభుత్వ ప్రతినిధులను లాటరీ విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పడంతో చాలా చోట్ల మంత్రులు ఎమ్మెల్యేలు కూడా తమ వారికి మందు షాపులు ఇప్పించుకోలేకపోయారు అని అంటున్నారు.

దాంతో టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలలో అసంతృప్తి అయితే కొన్ని చోట్ల కనిపిస్తోందని అంటున్నారు. దరఖాస్తుల ద్వారా దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలు దక్కించుకున్న ప్రభుత్వం లాటరీలో జోక్యం వద్దు అని స్పష్టంగా మంత్రులకు తేల్చి చెప్పడంతో తమ్ముళ్ళకు మాత్రం అనుకున్న స్థాయిలో మద్యం దుకాణాలు దక్కలేదని అంటున్నారు. ఇక బీజేపీ వారితో పాటు ఏ పార్టీకి చెందని వారికి కూడా మద్యం దుకాణాలు దక్కాయీ అంటే కూటమి ప్రభుత్వం పారదర్శకంగా ఈ విషయంలో వ్యవహరించినట్లే అని అంటున్నారు అంతా.

Tags:    

Similar News