జగన్ కోర్టులోనే బంతి...జనాలు చూస్తున్నారు !
దీంతో అసెంబ్లీకి రాకుండా వైసీపీ ఎమ్మెల్యేలు దూరం పాటిస్తున్నారు.;
ఏపీలో టీడీపీ కూటమి ముందు వైసీపీ వ్యూహాలు తుత్తునియలు అవుతున్నాయి. ఎవరు చెప్పారో ఏమో కానీ వైసీపీ అధినాయకత్వం ప్రతిపక్ష హోదా మాకు కావాలి అని ఒక్కటే పట్టు బట్టి కూర్చుంది. ఈ హోదా ఉంటేనే సభలో మైకు దక్కుతుందని తాము ప్రజా సమస్యలు చర్చించగలుగుతామని అంటోంది. దీంతో అసెంబ్లీకి రాకుండా వైసీపీ ఎమ్మెల్యేలు దూరం పాటిస్తున్నారు.
ఇదంతా వైసీపీ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయంతో వచ్చిన పర్యవసానంగా ఉంది. నిజానికి ఈ హోదాలు వాదాలు ఇవన్నీ సామాన్యుడికి ఎక్కేవి కావు. పైగా అసెంబ్లీ రూల్స్ రెగ్యులేషన్స్ లో చూస్తే కనుక సభ్యులు అందరూ గౌరవనీయులే. అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. అయితే ప్రభుత్వాన్ని నడుపుతున్న వారు ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు జవాబులు చెబుతారు.
ప్రశ్నకు జవాబు చెప్పడం ఎక్కువ సమయమే తీసుకుంటుంది అలాగే ప్రభుత్వానికి కొన్ని ప్రివిలేజేస్ ఉంటాయి. ఇక విపక్షాలకు హోదా అంటే సభా నాయకుడి తరువాత మాట్లాడే చాన్స్ ఇస్తారు. ఒకవేళ అలా విపక్ష హోదా లేకపోయినా అపొజిషన్ బెంచెస్ కి మైక్ ఇస్తారు. వారి మాటలను వారి ప్రశ్నలను సభలో చర్చకు ఉంచుతారు. అడిగే ప్రశ్నలో విలువ ఉండాలి కానీ చర్చకు అది అర్హమే అవుతుంది అని చెప్పవచ్చు.
ఇంకో వైపు చూస్తే కనుక వైసీపీ సభలో ఏకైక విపక్షంగా ఉంది. కచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ఉంటుంది. అవకాశం కోరవచ్చు, స్పీకర్ ఇవ్వవచ్చు. ఒకవేళ ఇవ్వకపోతే కనుక అపుడు వైసీపీ దానిని జనంలో పెట్టి పోరాడవచ్చు. ఆదికి ముందే హోదా కావాలని అడగడం వల్ల లాజిక్ ఏమిటి అన్నది జనాలకు అర్థం కావడం లేదు అంటున్నారు.
ఇక తొమ్మిది నెలల నుంచి సాగుతున్న ఈ వ్యవహారానికి స్పీకర్ హోదాలో అయ్యన్నపాత్రుడు ఒక రూలింగ్ ఇచ్చి ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఆనవాయితీ సంప్రదాయలను దేశంలో పార్లమెంట్ లో ఉన్న పద్ధతులను ఆయన ఉటంకిస్తూ మొత్తం అసెంబ్లీ సంఖ్యలో పది శాతం ఉంటేనే విపక్ష హోదా అని స్పష్టం చేశారు. అంటే 18 మంది ఉండాలన్నది స్పీకర్ ఆదేశంగా రూలింగ్ గా కూడా తీసుకోవచ్చు.
అందువల్ల వైసీపీకి 11 మంది మాత్రమే ఉన్నారు కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని తేల్చేశారు. ఇక మీదట ఈ అంశం మీద బయట వైసీపీ నేతలు చేసే విమర్శలు కానీ ఆరోపణలు కానీ సభా హక్కుల ఉల్లంఘన కిందకే వస్తాయని చెబుతూ ఒక స్పష్టమైన ఆదేశాలనే ఇచ్చేశారు.
ప్రజలు ఆయా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలను ఎన్నుకున్నారని వైసీపీ ఎమ్మెల్యేలు సభలో తమ సమస్యలను ప్రస్తావించకుండా ఉండడం తగదని అయ్యన్న అంటున్నారు. అంటే సభలో వైసీపీ సభ్యులు రావాలని చర్చలో పాలుపంచుకోవాలని ఆయన మరోసారి కోరారు అన్న మాట. అంతే కాదు న్యాయస్థానంలో వైసీపీ తమకు ప్రతిపక్ష హోదా మీద కోరుతూ వేసిన పిటిషన్ ఇంకా విచారార్హత దశలోనే ఉందని స్పీకర్ చెప్పడం మరో విశేషం.
అంటే న్యాయ స్థానం ఒకవేళ ఈ పిటిషన్ స్వీకరించినా ఏమి జరుగుతుంది అన్నది ఎప్పటికి జరుగుతుంది అన్నది కూడా తేలే వ్యవహారం కాదని అంటున్నారు. సో అక్షరాలా నాలుగేళ్ళ విలువైన కాలం ఉంది. దాంతో వైసీపీ ఎమంలెయేలు జగన్ నాయకత్వంలో సభలోకి వచ్చి ప్రజా సమస్యలు ప్రస్తావిస్తారా లేదా అన్నది ఇపుడు వైసీపీ అధినాయకత్వం చేతులలోనే ఉంది అని అంటున్నారు.
ఈ విషయంలో ప్రజలు కూడా అన్నీ గమనిస్తున్నారు అని అంటున్నారు. అందువల్ల వైసీపీ ఎమ్మెల్యేలు సభలోకి వస్తే వారిని విపక్ష కూటమిగా గుర్తించవచ్చు. ఆ విధంగా వారు సభలో తమదైన శైలిలో ప్రతిపక్ష పాత్ర పోషించవచ్చు. అలా కాదు అనుకుంటే మాత్రం వైసీపీ భవిష్యత్తు ఆలోచనలు ఏమిటి అన్నది చూడాల్సి ఉంది. స్పీకర్ వైపు నుంచి అయితే హోదా ఇవ్వమని కచ్చితంగా తేల్చేశారు అని అంటున్నారు.