ఎవరి టెక్నిక్ వారిది.. తప్పించుకున్న వైసీపీ ఎమ్మెల్యేలు

సభకు వరుసగా 60 రోజులు రాకపోతే అనర్హత వేటు వేస్తామనే టెక్నికల్ పాయింటుతో ప్రతిపక్షాన్ని బెదిరిస్తున్న కూటమి ప్రభుత్వ వ్యూహాన్ని.. అదే టెక్నికుతో ప్రతిపక్ష వైసీపీ తిప్పికొట్టింది.

Update: 2025-02-24 08:38 GMT

దేనికైనా టెక్నిక్ అవసరం.. రాజకీయాల్లోనూ టెక్నిక్ ఉండాలని తాజాగా ఏపీ అసెంబ్లీ నిరూపించింది. సభకు వరుసగా 60 రోజులు రాకపోతే అనర్హత వేటు వేస్తామనే టెక్నికల్ పాయింటుతో ప్రతిపక్షాన్ని బెదిరిస్తున్న కూటమి ప్రభుత్వ వ్యూహాన్ని.. అదే టెక్నికుతో ప్రతిపక్ష వైసీపీ తిప్పికొట్టింది. ఎవరికీ అంతుబట్టని విధంగా ఈ టెక్నికల్ పొలిటికల్ ఫైట్ ఆసక్తి పుట్టిస్తోంది.

ఏపీ బడ్జెట్ సమావేశాలకు హాజరుకావాలా? వద్దా? అనే ఊగిసలాట మధ్య సభకు హాజరవ్వాలని షాకింగ్ డిసిషన్ తీసుకున్న వైసీపీ అధినేత జగన్.. అధికార కూటమికి అంతే షాక్ ఇచ్చారు. జగన్ ను బలవంతంగా సభకు రప్పించి.. అసెంబ్లీలో ఓ ఆట ఆడుకోవాలని చూసిన అధికార పార్టీ ఎమ్మెల్యేలకు తనదైన రాజకీయ వ్యూహంతో చెక్ చెప్పారంటున్నారు. సభకు వచ్చినట్లే వచ్చి.. వాకౌట్ చేయడం ద్వారా తన ముందు అధికార పార్టీ పాచికలు పారవని జగన్ నిరూపించారని అంటున్నారు.

ప్రతిపక్ష పార్టీ హాజరుపై కొద్దికాలంగా డైలాగ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. స్పీకర్ చైరులో డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఉండగా, వైసీపీ నేత జగన్ ను సభలో కూర్చొబెట్టాలని అధికార పార్టీ ఉబలాటపడుతోంది. అయితే తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేగాని సభకు రానంటూ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి భీష్మించుకున్నారు. ఈ పరిస్థితుల్లో జగన్ ను సభకు రప్పించేందుకు టెక్నికల్ అంశాన్ని డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు అస్త్రంగా తీశారు. 60 రోజులు సభకు రాకపోతే చట్టప్రకారం అనర్హత వేటు వేస్తామని హెచ్చరించారు. వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు అనర్హత ప్రమాదాన్ని ఎదుర్కొకుండా ఉండాలంటే సభకు వచ్చితీరాల్సిందేనని రూలింగ్ ఇచ్చారు. ఇక తన డిప్యూటీ మాటలకు స్పీకర్ కూడా ఎస్.. రఘురామ చెప్పిందే నిజం అన్నట్లు తలూపడంతో రాజకీయం రసకందాయంగా మారింది.

అయితే సభకు వెళ్లకుండా అనర్హత వేయించుకుని ఉప ఎన్నికలకు వెళితే నష్టమనే భావన వైసీపీలో కనిపించిందని చెబుతున్నారు. అందుకే ఏ టెక్నికుతో అయితే ప్రభుత్వం ఇబ్బంది పెట్టాలని చూసిందో.. అదే టెక్నిక్ వాడి ప్రభుత్వానికి చెక్ చెప్పాలని వైసీపీ నేతలు నిర్ణయించారు. దీంతో బడ్జెట్ సెషన్సులో ప్రారంభ కార్యక్రమం అయిన గవర్నర్ ప్రసంగానికి హాజరయ్యారు. అంటే టెక్నికల్ గా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చినట్లే.. దీంతో 60 రోజుల బెదిరింపులకు బ్రేక్ వేసినట్లైంది. అదే సమయంలో ప్రభుత్వ బెదిరింపులకు లొంగిపోయామనే భావన వ్యక్తం కాకుండా.. గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన కాసేపటికే వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా వాకౌట్ చేశారు. దీంతో పొలిటికల్ టెక్నికుతో వైసీపీ తప్పించుకుందని కూటమి ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు. ఏదైనా ఏపీలో తాజా టెక్నిక్ పాలిటిక్స్ ఇంట్రస్టింగ్ గా మారాయంటున్నారు.

Tags:    

Similar News