పెద్దల సభలో వైసీపీ నంబర్ తగ్గిపోతోందా ?
ఆ విధంగా చూస్తే వైసీపీ నుంచి కొంతమంది వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా ఓటు చేశారు అని అంటున్నారు.;

వైసీపీకి 2024 ఎన్నికల సమయం దాకా రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉండేవారు. అంటే టోటల్ గా ఏపీ కోటా నుంచి ఉన్న 11 మంది కూడా ఒకే పార్టీకి చెందిన వారే అన్న మాట. అంత క్లీన్ స్వీప్ చేసిన వైసీపీకి ఎన్నికల్లో ఘోర పరాజయం కాగానే సీన్ రివర్స్ అయింది. అందులో నుంచి ఒక్కో ఎంపీ జారిపోతూ వచ్చారు. అలా చూస్తే కనుక ఇప్పటికి నలుగురు ఎంపీలు వైసీపీకి గుడ్ బై కొట్టారు.
వారిలో మోపిదేవి వెంకటరమణ పార్టీకి దూరం కావడమే ఒక షాక్ అనుకుంటే పార్టీకి పునాది లాంటి విజయసాయిరెడ్డి కూడా ఫ్యాన్ నీడను వీడి బయటకు వెళ్ళారు. ఇది వైసీపీకి కోలుకోలేని దెబ్బగా మారింది. ఇక నంబర్ పరంగా చూస్తే 7కి వైసీపీ చేరుకుంది. అయితే తాజాగా వక్ఫ్ సవరణ బిల్లు ఓటింగుకు వచ్చినపుడు వైసీపీ విప్ జారీ చేయలేదని టీడీపీ ఆరోపిస్తోంది.
ఆ విధంగా చూస్తే వైసీపీ నుంచి కొంతమంది వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా ఓటు చేశారు అని అంటున్నారు. దానికి లెక్కలు కూడా చూపిస్తున్నారు. రాజ్యసభలో ఎన్డీయే 125 మంది సభ్యుల బలం మాత్రమే ఉంటే 128 ఓట్లు ఎలా వస్తాయని లాజిక్ పాయింట్ ని లేవనెత్తుతున్నారు.
మరి మూడు ఓట్లు ఎక్కడివి అన్నదే ఒక చర్చగా ఉంది అయితే వైసీపీ సభ్యులు అందరికీ విప్ జారీ చేశామని అంటున్నారు. కానీ అది ఓటింగ్ తరువాతనే వైసీపీ విప్ జారీ చేసింది అని టీడీపీ అంటోంది. ఇక కూటమిలో కీలకంగా ఉన్న బీజేపీ అయితే దీని మీద మరో ఆరోపణ చేసింది. వైసీపీకి చెందిన ఎంపీ పరిమళ్ నత్వానీ వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా ఓటు చేశారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు
అంటే వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగింది అని ఆమె చెబుతున్నారు. దాంతో ఆయన ఒక్కరేనా ఇంకా ఎవరైనానా అన్న చర్చ కూడా ఉంది. పరిమళ్ నత్వానీ గుజరాత్ కి చెందిన వారు అంబానీ దోస్త్. ఇక బీజేపీ పెద్దలకు కూడా సన్నిహితులు అని చెబుతారు ఆయన అయితే కచ్చితంగా వ్యతిరేకంగా ఓటు వేయరని అంటున్నారు. అలా చూస్తే ఉన్న ఏడుగురు ఎంపీలలో వైసీపీ బలం ఆరు అయిందా లేక ఇంకా తగ్గిందా అన్న చర్చ కూడా వస్తోంది.
బీజేపీ మరిన్ని బిల్లులు అయితే రానున్న రోజులలో ప్రవేశపెడుతుంది. వాటిని రాజ్యసభలో వైసీపీ వ్యతిరేకిస్తే అందులోని ఎంపీలు క్రాస్ చేస్తారా అంతటితో ఆగకుండా పార్టీనే వీడుతారా అన్న చర్చ కూడా ఉంది. అయితే పార్లమెంటరీ పార్టీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి మాత్రం ఒక ఓపెన్ చాలెంజ్ నే విసిరారు. తమ పార్టీ ఎంపీలు అంతా వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగానే ఓటు చేశారు అని ఆయన అంటున్నారు. మొత్తం మీద చూస్తే వైసీపీకి వ్రతం చెడిందా లేక ఫలితం దక్కిందా లేదా అన్నదే చర్చగా ఉంది. ఎందుచేతనంటే ఏపీలో ముస్లిములు ఈ వాదనలలో దేనిని నమ్ముతారో తెలియదు కాబట్టి అంటున్నారు.