ముందస్తుకు వైసీపీ తథాస్తు ?
అప్పట్లో కూడా జమిలి ఎన్నికల ప్రస్తావన రావడంతో కేంద్రంతో పాటు ఏపీకి ఒకేసారి ఎన్నికలు తప్పని నాలుగేళ్ల పాలనతో వైసీపీ సర్కార్ ఇంటికి పోతుంది అని ఎలుగెత్తి చాటారు.
ఎన్నికలు రాకూడదు అని అధికార పక్షం కోరుకుంటుంది. ఎన్నికలు రావాలని ప్రతిపక్షం ఆశిస్తుంది. ఎందుకంటే జవాబు వెరీ సింపుల్. ఎన్నికలు జరిగితే మళ్లీ చాన్స్ వస్తుంది. పవర్ చేతిలో పడవచ్చు అన్నది కూడా ఉంటుంది. ఇలా అపొజిషన్ అధికారంలోకి వచ్చిన పార్టీని ప్రతీ రోజూ దిగిపోమనే కోరుకుంటుందని అంటున్నారు నోటి వెంట ఎన్నికల మాటే వస్తుంది అని కూడా చెబుతూంటారు.
గడచిన అయిదేళ్ళ వైసీపీ ఏలుబడిలో తెలుగుదేశం కూడా దాదాపుగా ప్రతీ రోజూ ఎన్నికల పాటే పాడేది. ముందస్తు అంటూ వైసీపీ అధికారం చేపట్టిన ఆరు నెలల నుంచే రాగం తీసింది. ఆ తరువాత మధ్యంతరం అని కొన్నాళ్ళు ప్రచారం చేసింది. అప్పట్లో కూడా జమిలి ఎన్నికల ప్రస్తావన రావడంతో కేంద్రంతో పాటు ఏపీకి ఒకేసారి ఎన్నికలు తప్పని నాలుగేళ్ల పాలనతో వైసీపీ సర్కార్ ఇంటికి పోతుంది అని ఎలుగెత్తి చాటారు.
అయితే అది జరగలేదు. ఇక తెలంగాణా ఎన్నికలతో ముడి పెట్టి గత ఏడాది వైసీపీ ముందస్తుకు వెళ్తుంది అని కూడా ప్రచారం చేశారు. కానీ అవేమీ జరలేదు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగాయి. ఇక్కడ టీడీపీ ప్రచారం తప్పు కాదు, అది రాజకీయ వ్యూహం. తన పార్టీని కాపాడుకునే ఎత్తుగడ. దానితో పాటు ప్రభుత్వం ముందుగా ఎన్నికలకు వెళ్తుందేమో అని ఆశ.
అయితే ఇపుడు వైసీపీ ఆ ప్లేస్ లోకి వచ్చింది. ఆనాడు చూచాయగా వినిపించిన జమిలి ఎన్నికల ప్రచారం ఇపుడు అధికారికం అయింది. ఏకంగా కేంద్రం జమిలి ఎన్నికల మీద మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ చేసిన సిఫార్సులను ఆమోదించింది.
దాంతో పాటు రానున్న శీతాకాల సమావేశాల్లో దీనిని సంబంధించిన బిల్లుని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ పరిణామాలను చూసినపుడు జమిలి ఎన్నికల విషయంలో బీజేపీకి ఉన్న పట్టుదల అందరికీ అర్ధం అవుతోంది. ఆరు నూరు అయినా తాను అనుకున్న పంతాన్ని నెరవేర్చుకోవడం బీజేపీకి అలవాటు అయిన ప్రక్రియ. అందువల్ల జమిలి ఎన్నికల విషయంలో బీజేపీ ఎక్కడా రాజీపడదనే అంటున్నారు.
దీంతో వస్తే ముందస్తు లేకపోతే మధ్యంతరం దేశంలో ఖాయం అని అంటున్నారు. ముందస్తు అంటే రెండేళ్ళ లోపు వస్తే అదే మధ్యంతరం అంటే మూడేళ్ల పాలన ముగిసాక వస్తాయి. మరి ఈ రెండింటిలో ఏది వచ్చినా తమకే లాభమని వైసీపీ లెక్కలు వేసుకుంటోంది.అయిదేళ్ళ పాటు పార్టీని ప్రతిపక్షంలో ఉంచుతూ పోరాటం చేయడం కష్టం.
అదే ముందుగా ఎన్నికలు వస్తే మరో లక్కీ చాన్స్ దక్కి తమకే పగ్గాలు అందుతాయని విశ్వసిస్తోంది. తక్కువ టైం ఉంటే కనుక కూటమి ఏ కార్యక్రమాలు చేయలేదని సంక్షేమం విషయంలో ఇప్పటికీ తామే చాంపియన్స్ గా ఉన్నామని వైసీపీ అంచనా వేసుకుంటోంది.
అయితే వైసీపీ అధికారికంగా బయటకు చెప్పకపోయినా ప్రతిపక్షంగా జమిలి ఎన్నికలు వస్తే వైసీపీకే లాభమని ప్రచారం సాగుతోంది. దాంతో వైసీపీ ముందస్తుకు తథాస్తు అంటుందని కూడా అంటున్నారు. మరో వైపు పార్టీ నుంచి నేతలు వెళ్ళిపోతున్న క్రమంలో పార్టీని పటిష్టం చేసుకోవడం, ఉన్న నేతలకే టికెట్లు అని పార్టీ చెప్పుకునేందుకు వీలు కలుగుతోంది అని అంటున్నారు. డీ లిమిటేషన్ లో అసెంబ్లీ సీట్లు పెరగకపోతే కూటమిలో మూడు పార్టీలు మళ్లీ పోటీ చేస్తే కనుక వైసీపీ నుంచి వెళ్ళి జనసేన టీడీపీలో చేరినా టికెట్లు దక్కవని కూడా అంటున్నారు.
జమిలి వస్తే కనుక అసెంబ్లీ సీట్లు కూడా ఈసారికి పెరిగే వీలు ఉండదని అంటున్నారు. దాంతో వైసీపీలో ఉన్న నాయకులను నిలబెట్టుకోవడానికి వైసీపీకి జమిలి ఎన్నికల ప్రచారం మంచి అవకాశం అని అంటున్నారు. మొత్తానికి బయటపడకపోయినా తెలంగాణాలో బీఆర్ఎస్ కి ఏపీలో వైసీపీకి ముందస్తు ఎన్నికలు రావాలనే ఉంది అన్న ప్రచారం అయితే సాగుతోంది. చూడాలి మరి జమిలి ఎన్నికల మీద వైసీపీ ఏ విధంగా అఫీషియల్ గా రియాక్ట్ అవుతుందో.