డియర్ కామ్రేడ్...వైసీపీ కొత్త రూట్ ?

సజావుగా ఎన్నికలు జరగవన్న అనుమానంతోనే పోటీ నుంచి వైసీపీ దూరంగా ఉంటోందని కూడా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

Update: 2025-02-16 15:30 GMT

ఏపీలో మూడు స్థానాలలో ఎమ్మెల్యే ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో రెండు పట్టభద్రులకు ఒకటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కి సంబంధించి ఉన్నాయి. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ ఎక్కడా పోటీకి దిగలేదు. గుంటూరు క్రిష్ణా పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి మొదట వైసీపీ టేడ్ యూనియన్ నేత గౌతం రెడ్డిని అనుకున్నా ఆ తరువాత ఎందుకో వెనక్కి తగ్గారు. సజావుగా ఎన్నికలు జరగవన్న అనుమానంతోనే పోటీ నుంచి వైసీపీ దూరంగా ఉంటోందని కూడా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

మరో వైపు చూస్తే కూటమి తరఫున పట్టభద్రుల నియోజకవర్గాలకే పోటీ చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీని వదిలేసారు. ఇక కూటమి రెండు ఎమ్మెల్సీ సీట్లను కైవశం చేసుకోవడానికి చూస్తోంది. అదే సమయంలో మొదటి నుంచి ఇక్కడ తమ పట్టుని నిలుపుకుంటున్న కామ్రేడ్స్ కూడా పోటీలో తమ అభ్యర్ధులను నిలబెట్టాయి.

మరీ ముఖ్యంగా క్రిష్ణా గుంటూరు పట్టభద్రుల స్థానం కోసం వామపక్షాల నుంచి అభ్యర్ధిగా ఏ ఎస్ లక్ష్మణరావు పోటీలో ఉన్నారు. ఆయనకు ఉపాధ్యాయ సంఘాలతోనూ మంచి పరిచయాలు ఉన్నాయి. అదే విధంగా చూస్తే వామపక్షాలకు కార్మిక సంఘాలతో కూడా మంచి పట్టు ఉంటుంది.

ఈ విధంగా చూస్తే గట్టి ఓటు బ్యాంక్ నే వామపక్షాలు సిద్ధం చేసుకుని మరీ బరిలోకి దిగాయి. ఈ క్రమంలో వైసీపీ నుంచి కూడా కామ్రేడ్స్ కి మద్దతు లభిస్తోందని అంటున్నారు. ఏపీలో కూటమి అభ్యర్ధిని ఓడించాలన్నది వైసీపీ మార్క్ పొలిటికల్ స్టాండ్.

దాంతో వామపక్షాలకు మద్దతుగా నిలిచి అక్కడ టీడీపీ బిగ్ షాట్ మాజీ మంత్రి ఆలపాటి రాజాని దెబ్బ తీస్తే ఆ కిక్కే వేరబ్బా అన్నదే వైసీపీ ఆలోచన అని అంటున్నారు. వైసీపీ పోటీ చేయాలనుకుని తమ వైపు గట్టిగానే పట్టభద్రుల ఓట్లు నమోదు చేయించింది అని అంటున్నారు. అయితే ఇపుడు వైసీపీ పోటీలో లేకపోవడంతో ఆ ఓట్లను వామపక్షాలకు బదిలీ చేయడం ద్వారా అక్కడ కొత్త మిత్రుడిగా మారవచ్చు అని అదే సమయంలో కూటమికి భారీ షాక్ ఇవ్వవచ్చు అని రాజకీయ వ్యూహరచన చేస్తోంది అని అంటున్నారు.

ఈ పరిణామంతోనే గుంటూరు క్రిష్ణా పట్టభద్రుల ఎన్నికలు ఆసక్తికరంగా మారాయని అంటున్నారు. ఇప్పటికే మన్యం బంద్ లో కామ్రేడ్స్ వైసీపీ కలసి పాల్గొన్నాయి. దానితో పాటు ఇపుడు మద్దతుగా నిలిస్తే ఫ్యూచర్ లో ఎర్రన్నలతో ఫ్యాన్ పార్టీ స్నేహం మరింత బలపడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఇక గోదావరి జిల్లాలో కూడా కూటమి అభ్యర్ధికి కొంతమంది వైసీపీ నేతలు మద్దతు ఇస్తున్నా మరి కొంతమంది మాత్రం కూటమి వ్యతిరేక అభ్యర్థిగా ఉన్న వామపక్షానికి మద్దతు అంటున్నారు. ఉత్తారాంధ్రాలో అయితే కూటమి పోటీలో లేదు. పోటీలో ఉన్న అభ్యర్ధులలో అఫీషియల్ గా ఎవరికీ మద్దతు ఇవ్వలేదు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘు వర్మ వైసీపీని విమర్శిస్తూ కూటమి నేతల మద్దతు కోరుతున్నారు. దాంతో వైసీపీ అక్కడ ఆయనకు వ్యతిరేక స్టాండ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Tags:    

Similar News