వైసీపీకి కొత్త చిక్కులు.. యాక్టివేట్ అవుతున్న టైంలో..!
దీనికితోడు ఒకప్పుడు.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న వారు కూడా కనుమరుగయ్యారు.;

ఏపీ ప్రతిపక్షం వైసీపీ గత ఏడాది కాలంగా ఇన్ యాక్టివ్‌లో ఉన్న విషయం తెలిసిందే. 2024 ఎన్నికల తర్వాత.. పార్టీ పూర్తిగా స్తబ్దుగా మారిపోయింది. ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన తర్వాత.. ఇక, పార్టీ పరిస్థితి వెంటిలేటర్‌పైకి వెళ్లిపోయింది. కేవలం 11 స్థానాలకు పరిమితం కావడంతోపాటు.. కీలక నాయకులపై కేసులు నమోదు కావడం.. నాయకులు జైళ్ళ చుట్టూ తిరుగుతన్న విషయం తెలిసిందే. దీనికితోడు ఒకప్పుడు.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న వారు కూడా కనుమరుగయ్యారు.
సోషల్ మీడియాపై కూటమిప్రభుత్వం ఉక్కుపాదంమోపడంతో ఎక్కడికక్కడ నాయకులు మౌనం పాటి స్తున్నారు. ఏం మాట్లాడితే.. ఏం జరుగుతుందో..ఎలాంటి కేసులు ఎదుర్కొనాల్సి ఉంటుందో అన్న కారణం గా నాయకులు మౌనం పాటిస్తున్నారు. దీంతో పార్టీ తరఫున నిరసనలు, ధర్నాలకు పిలుపునిచ్చి కూడా.. వెనక్కి తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే.. వైసీపీ పరిస్థితి ఎలా ఉన్నా.. ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై నెమ్మదిగా పెరుగుతున్న అసంతృప్తి.. వైసీపీ వైపు ప్రజలను చూసేలా చేసింది.
దీంతో క్షేత్రస్తాయిలో ఒకింత వైసీపీకి సానుకూలత ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతోంది. దీనిని ఒడిసి పట్టుకుని పార్టీని పుంజుకునేలా చేసేందుకు నాయకులు ప్రయత్నిస్తారని అందరూ అనుకున్నారు. కానీ, అనూహ్యంగా దీనికి వ్యతిరేకంగా పరిస్థితి మారుతోంది. దీనికి కారణం.. నాయకులు అధికారులపై నోరు చేసుకుని బండ బూతులతో విరుచుకుపడుతుండడమే. టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. విద్యుత్ శాఖ అధికారిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తన ఇంటికి కరెంటు కట్ చేయడాన్ని నిరసిస్తూ.. దువ్వాడ నిప్పులు చెరిగారు. ఇది పెద్ద ఎత్తున వివాదం గా మారి.. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీపై వేలెత్తి చూపించే పరిస్థితి వచ్చింది. మరోవైపు.. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి కూడా.. పోలీసులపై నిప్పులు చెరిగారు.. నాకొ.. క.. అంటూ.. ఆయన ఓ పోలీసుపై చేసిన వ్యాఖ్యలు మరో వివాదంగా మారాయి. దీంతో ఇప్పుడిప్పుడే పెరుగుతున్న సానుకూలత వైసీపీకి దూరమవుతోందన్న భావన కలుగుతుండడం గమనార్హం. ఇలా అయితే.. కష్టమేనని.. ప్రజల్లో మార్పును గమనించి నాయకులు మసులు కోవాలని పరిశీలకులు చెబుతున్నారు.