రెండు లక్షల కోట్లు : టీడీపీ వర్సెస్ వైసీపీ క్రెడిట్ వార్
ఇవన్నీ కూడా ఆయన ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్ లోనే వర్చువల్ గా ప్రారంభించనున్నారు.
విశాఖలో ఎన్నడూ లేని విధంగా రెండు లక్షల కోట్ల రూపాయల విలువ చేసే దాదాపు ఎనిమిది నుంచి పది కీలక ప్రాజెక్టులను ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇవన్నీ కూడా ఆయన ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్ లోనే వర్చువల్ గా ప్రారంభించనున్నారు.
అయితే ఈ రెండు లక్షల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను తెచ్చిన ఘనత ఎవరిది అన్న దాని మీద వైసీపీ టీడీపీల మధ్య వార్ స్టార్ట్ అయింది. తామే అన్ని అనుమతులు తీసుకుని ఈ ప్రాజెక్టులను డిజైన్ చేసి తీసుకుని వచ్చామని వైసీపీ నేతలు అంటున్నారు. తాము అలా వడ్డించిన విస్తరిని ముందు ఉంచితే అంతా మా శ్రమ అనుకుంటూ టీడీపీ ప్రచారం చేసుకుంటోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అంటున్నారు.
ఇది జగన్ కష్టం వైసీపీ ఘనత కానీ క్రెడిట్ ని చంద్రబాబు టీడీపీ నేతలు తీసుకుంటున్నారు అని వైసీపీ నేతలు ఆగ్రహిస్తున్నారు. విశాఖ రైల్వే జోన్ విషయానికి వస్తే 2024 జనవరిలోనే తాము భూమి ఇచ్చామని ఆ ఉత్తర్వులను కూడా చూపిస్తున్నారు.
అలాగే విశాఖ రూరల్ జిల్లాలో ఏర్పాటు చేయబోయే బల్క్ పార్క్ కానీ ఎంటీపీసీ ప్రాజెక్ట్ కానీ ఇతర కార్యక్రమాలు కానీ పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ కానీ కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నోడ్, గుంటూరు-బీబీనగర్, గుత్తి-పెండేకల్లు రైల్వే లైన్ల డబులింగ్ వంటివన్నీ తన క్రెడిట్ అని వైసీపీ చెబుతోంది.
అయితే దానికి టీడీపీ నేతలు గట్టిగా తిప్పి కొడుతున్నారు. రైల్వే జోన్ కి భూమిని చూపించలేదని తాము వచ్చిన తరువాతనే ఆ పని చేశామని అంటున్నారు. అంతే కాకుండా అన్ని రకాలైన అనుమతులు తమ హయాంలోనే తెచ్చి వాటికి ఒక రూపం కల్పించి ఈ రోజు ఏపీ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో నిలిచిపోయే విధంగా భారీ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామని అంటున్నారు.
చంద్రబాబు దూర దృష్టితో ఆయన విజనరీతో ఏపీలో లక్షల కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులకు తాము రంగం సిద్ధం చేస్తే వైసీపీ ఈ విధంగా మాట్లాడటం ఏంటని మండిపడుతోంది. మరో వైపు చూస్తే అయిదేళ్ల పాటు వైసీపీ అధికారంలో ఉంది. 2019 మార్చిలో విశాఖ వచ్చిన మోడీ ఆనాడే రైల్వే జోన్ విశాఖకు మంజూరు అయినట్లుగా ప్రకటించారు. ఆ తరువాత వైసీపీ అధికారంలోకి వచ్చింది.
మరి రైల్వే జోన్ విషయంలో నాడే ఎందుకు చొరవ తీసుకోలేదు అని కూడా ప్రశ్నిస్తున్నారు. అలాగే అనేక ఇతర ప్రాజెక్టుల విషయంలో కూడా గత ప్రభుత్వం ఉదాశీన వైఖరి ని అవలంబించిందని తాము ఒక పద్ధతిలో ముందుకు సాగడం వల్లనే అందరిలోనూ నమ్మకం కలిగిందని దాని వల్లనే ఈ ప్రాజెక్టులు అన్నీ మెటీరియలైజ్ అయ్యాయని అంటోంది.
సరే ఈ ప్రాజెక్టుల విషయం లో క్రెడిట్ వార్ రాజకీయంగా సాగుతూనే ఉంటుంది. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఈ రెండు పార్టీల ప్రభుత్వాలూ ఏమి చేస్తున్నాయని అంటున్నారు. లక్షల ప్రాజెక్టులు తేవడం వరకూ ఓకే. కానీ లక్షల కోట్ల విలువచేసే స్టీల్ ప్లాంట్ ని రక్షించుకోవడం అంతకంటే ముఖ్యం కదా అని అంటున్నారు. ఈ విషయంలో ఈ రెండు పార్టీలూ ఒకే మాట మీద నిలబడి ఒకే గొంతుకతో కేంద్రాన్ని నిలదీస్తే ప్రైవేటీకరణ ఆగుతుంది కదా అని అంటున్నారు. మరి ఆ విషయంలో క్రెడిట్ తీసుకునేందుకు ఎందుకు పోటీలు పడడం లేదు అన్న ప్రశ్నలు కూడా ప్రజా సంఘాల నుంచి వామపక్ష నేతల నుంచి వస్తున్నాయి. మరి ఈ లాజిక్ తో కూడిన ప్రశ్నకు జవాబు చెప్పడం కష్టమే సుమా.