జగన్ పంతం.. మేజర్ ఓటు బ్యాంకు కొలాప్స్..!
రాజకీయాల్లో పంతం పనికిరాదు. అవకాశం.. అవసరం.. రెండు పట్టాలపైనే నాయకులు అయినా.. పార్టీలై నా పరుగులు పెట్టాలి.;

రాజకీయాల్లో పంతం పనికిరాదు. అవకాశం.. అవసరం.. రెండు పట్టాలపైనే నాయకులు అయినా.. పార్టీలై నా పరుగులు పెట్టాలి. అప్పుడే విజయం దక్కించుకునే అవకాశం ఉంటుంది. అలా కాదని పంతానికి పోతే.. ఉన్న ఓటు బ్యాంకు.. అభిమానించే సామాజిక వర్గాలు కూడా పక్కకు తప్పుకొనే పరిస్థితి ఏర్పడు తుంది. ఇప్పుడు వైసీపీ విషయంలోనూ అచ్చం ఇదే జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ చట్టం విషయంలో జగన్ చేస్తున్న వ్యవహారం.. చర్చకు దారితీసింది.
రాష్ట్రంలో ఎంత ఎక్కువగా ఉన్నారని అనుకున్నా.. ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంకు కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. పైగా 12-15 శాతానికి మధ్యే ఉందన్న లెక్క కూడా ఉంది. ఇక, మెజారిటీ ఓటు బ్యాంకుగా.. హిందూ సమాజం ఉంది. ఇది 80 శాతానికిపైగా ఓటు బ్యాంకు ఉంది. అందుకే.. ఇతర పార్టీలు.. ఈ విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నాయి. తెగే దాకా లాగే ప్రయత్నాలు కూడా చేయడం లేదు. అలాగని మైనారిటీ వర్గాలను నొప్పించడం కూడా లేదు.
వారికి ఇచ్చే ప్రాధాన్యం ఇస్తూనే తెగే దాకా లాగకుండా.. ప్రయత్నాలు చేస్తున్నారు. వక్ఫ్‌ను వ్యతిరేకిస్తున్నా.. అనుకూలిస్తున్నా.. మైనారిటీ సమాజాన్ని దూరం చేసుకోకుండా.. జాగ్రత్తలు పాటిస్తున్న తీరు కళ్లకు కడుతోంది. అందుకే.. ఎవరినీ నొప్పించకుండా.. రాష్ట్ర స్తాయిలో మైనారిటీ వర్గాలకు ఏం చేయగలరో అది చేసేందుకు ఇతర పార్టీలు సిద్దమయ్యాయి. అయితే.. ఈ విషయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరు.. మెజారిటీ ఓటు బ్యాంకు ప్రభావితమయ్యే పరిస్థితి నెలకొందన్న చర్చ సాగుతోంది.
తాజాగా వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. వైసీపీ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసినట్టు ఆ పార్టీ ప్రకటించింది. మైనారిటీలకు అన్యాయం జరుగుతుంటే.. చూస్తూ ఊరుకోబోమని కూడా స్పష్టం చేసింది. ఇది మంచిదే కావొచ్చు. మైనారిటీలను తనవైపు తిప్పుకోనే ప్రయత్నం కూడా కావొచ్చు. కానీ, ఇదే సమయంలో మెజారిటీ ఓటు బ్యాంకు, ఓటర్లు.. ఈ విషయంలో వైసీపీ మైనారిటీ పార్టీగా ప్రచారం చేస్తేనో.. లేక భావిస్తేనే అప్పుడు ఏం చేస్తారన్నది ప్రశ్న. సో.. ఏది కూడా.. తెగేదాకా.. లాగడం సరికాదు. అలా కాకుండా.. ప్రత్యేక హోదా వంటి కీలక అంశాలపై జగన్ పోరాటం చేస్తే.. అప్పుడు అన్ని వర్గాలు ఆయన వెంటే ఉండే అవకాశం ఉంటుంది.