మాజీ మంత్రులు ఇద్దరు...ఒకే ఎమ్మెల్సీ పదవి !

అలా చూస్తే కనుక ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో ఇద్దరు మాజీ మంత్రులు ఒక ఎమ్మెల్సీ పదవి కోసం భారీ పోటీని ఎదుర్కొంటున్నారు అని అంటున్నారు.;

Update: 2025-03-02 04:15 GMT

తెలుగుదేశం పార్టీలో ఆశావహులు అమాంతం పెరిగిపోతున్నారు. సీనియర్ల నుంచి జూనియర్ల దాకా అందరికీ పదవుల ఆశ ఉంది. ఇందులో తప్పు కూడా ఏమీ లేదు. రాజకీయాల్లో ఉన్న వారు ఎవరూ ఏ ఆశా లేకుండా ఉండరు. అలా చూస్తే కనుక ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో ఇద్దరు మాజీ మంత్రులు ఒక ఎమ్మెల్సీ పదవి కోసం భారీ పోటీని ఎదుర్కొంటున్నారు అని అంటున్నారు.

ఆ ఇద్దరూ దేవినేని ఉమా మహేశ్వరరావు, నెట్టెం రఘురాం. ఇద్దరూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే. ఇద్దరూ సీనియర్లే. ఇద్దరూ అనేక సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచినవారే. కీలక శాఖలకు మంత్రులుగా పనిచేసిన వారే. ఇక ఈ ఇద్దరూ పెద్దల సభలో అయినా అడుగుపెట్టాలని చూస్తున్నారు.

ఏపీలో అయిదు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయ్యాయి. అందులో ఒకటి జనసేనకు పోతుంది. నాలుగు ఉన్నాయి. ఇందులో టీడీపీ నుంచి గట్టి పోటీ ఉంది అని అంటున్నారు. దేవినేని ఉమా 2024లో మైలవరం సీటు త్యాగం చేశారు వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణ ప్రసాద్ కి ఆయన సహకారం అందించారు. దానికి గానూ ఆయనకు అప్పట్లో ఒక హామీ దక్కింది. అయితే ఇపుడు అది తీరుస్తారా అన్న చర్చ సాగుతోంది.

మరో వైపు చూస్తే నెట్టెం రఘురాం అన్న ఆయన ఎన్టీయర్ హయాం నుంచి ఎమ్మెల్యేగా ఉంటూ చంద్రబాబు జమానాలో ఉమ్మడి ఏపీలో ఎక్సైజ్ శాఖ వంటి కీలక శాఖలకు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన ప్లేస్ లో సీటుని శ్రీరాం తాతయ్యకు ఇచ్చేశారు. దాంతో ఆయన మరో త్యాగమూర్తి అవతారం ఎత్తారు.

ఇపుడు ఈ ఇద్దరూ ఎలాగైనా ఎమ్మెల్సీ అయితే పెద్ద మనిషిగా మారవచ్చు అని చూస్తున్నారు అయితే ఇదే ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో మరో ఇద్దరు నేతలకు ఎమ్మెల్సీ పదవుల మీద ఆశ ఉంది. వారికి అధినాయకత్వం నుంచి హామీ ఉంది అని అంటున్నారు. వారిలో ఒకరు విజయవాడ పశ్చిమకు చెందిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అని అంటున్నారు.

ఆయన చంద్రబాబుకు వీరభక్తుడు. దాంతో పాటు బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు. దాంతో ఆయన తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా 2019లో టీడీపీలో చేరి పార్టీ కోసం కష్టపడుతున్న వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ పదవి ప్రామిస్ ఏకంగా లోకేష్ చంద్రబాబు చేశారని అంటున్నారు. కీలకమైన కాపు సామాజిక వర్గానికి చెందిన రాధాను పక్కన పెట్టడం సాధ్యమయ్యేది కానే కాని అంటున్నారు.

దాంతో ఈ సీనియర్ నేతలు మాజీ మంత్రులకు ఎమ్మెల్సీ పదవి అందని పండు అవుతుందా అన్న చర్చ ఉంది. పైగా క్రిష్ణా జిల్లాలో కమ్మ సామాజిక వర్గం నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఉన్న నేపథ్యంలో సామాజిక సమీకరణలే వీరి అవకాశాలను దెబ్బ తీస్తాయా అన్నది కూడా మరో చర్చగా ఉందిట. మొత్తానికి ఉమాకు రఘురాం కి పెద్దల సభలో చోటుందా అంటే చూడాల్సిందే.

Tags:    

Similar News