వైసీపీని చూసి అలెర్ట్ అవుతున్న టీడీపీ!
ఒక రాజకీయ పార్టీగా వైసీపీ 2019 నుంచి 2024 మధ్యలో వ్యవహరించిన తీరుని కూడా చూసి జాగ్రత్త పడాలి అని కూడా అంటారు.
వైసీపీది ఒక చరిత్ర. ఎలా అంటే ఆకాశమంత విజయం. అలాగే పాతాళమంతా పరాజయం. ఈ రెండింటి మధ్యన వైసీపీ చరిత్ర ఉంది. వైసీపీ అయిదేళ్ళ పాలన కేసు స్టడీ అని టీడీపీ నేతలు అంటారు. ఒక రాజకీయ పార్టీగా వైసీపీ 2019 నుంచి 2024 మధ్యలో వ్యవహరించిన తీరుని కూడా చూసి జాగ్రత్త పడాలి అని కూడా అంటారు.
వైసీపీ విషయానికి వస్తే 2019లో దక్కిన విజయాన్ని సరిగ్గా అర్ధం చేసుకోలేకపోయింది. విజయం ఎపుడూ బరువైనది. దానిని మోయడం చాలా కష్టం. అంతటి విజయం ఎటువంటి గండర గండలకు దక్కినా నిజంగా భరించలేనిదే. మోయలేనిదే.
అది జగన్ కి చిన్న వయసులో రావడంతోనే ఆయన దాన్ని మోయలేక పోయారా అన్న చర్చ కూడా సాగుతోంది. వైసీపీకి 151 సీట్లు 2019 ఎన్నికల్లో రావడానికి అనేక ఫ్యాక్టర్లు పనిచేసాయి. అందులో వైఎస్ జగన్ పాదయాత్ర, ఆయన చరిష్మా ఇమేజ్ కూడా ఉండొచ్చు. కానీ ఆ ఒక్క దానికే అంతటి విజయం దక్కిందని అర్ధం చేసుకోవడం వల్లనే వైసీపీ అయిదేళ్ళూ తనదైన శైలిలో పాలన చేసిందని జనాలకు అది నచ్చలేదని ఓడించారని అంతా విశ్లేషించుకునే పరిస్థితి ఏర్పడింది.
వైసీపీ భారీ విజయం వెనక టీడీపీ చేసిన తప్పులు కూడా ఉన్నాయి. వాటిని ఆ పార్టీ సరిచేసుకుంటే మళ్ళీ జనాలు ఆదరిస్తారు అన్న సత్యాన్ని వైసీపీ మరచిపోయింది. దాంతోనే వైసీపీ అన్ని విధాలుగా దెబ్బ తిన్నది. ఈ నేపధ్యంలో వైసీపీని మించి విజయాన్ని టీడీపీ కూటమికి కట్టబెట్టారు ఏపీ జనాలు. దాంతో టీడీపీ ఆ విజయాన్ని ఎలా మోస్తుంది అన్న చర్చ కూడా మొదలైంది.
మరో వైపు చూసుకుంటే చంద్రబాబు టోటల్ పొలిటికల్ కెరీర్ లో అద్భుతమైన విజయం ఇది. ఇంకా లోతులకు వెళ్ళి చెప్పాలీ అంటే టీడీపీ పుట్టాక అంతటి విజయం దక్కలేదు అన్నది కూడా ఉంది. ఇలా ఎన్నో రకాలుగా ఈ విజయాన్ని చెప్పుకోవచ్చు. మరి ఆ విజయాన్ని ఎలా ఆస్వాదించాలి, ఆ భారాన్ని ఎలా మోయాలి అన్నది కనుక చర్చకు వస్తే చంద్రబాబు తన అర్ధ శతాబ్ద రాజకీయ అనుభవాన్ని ఇక్కడే చూపిస్తున్నారు అని అంటున్నారు.
అధికారంలోకి వచ్చేశామని అధికులమని భావించవద్దు అని బాబు ఒకటికి పదిమార్లు తన పార్టీ నేతలకు ఉద్బోధిస్తున్నారు. అంతే కాదు ఈ గెలుపుతో ఇక చాలు అని అలసత్వం కూడా పెట్టుకోవద్దు అని హితబోధ చేస్తున్నారు. పార్టీ బాధ్యతగా మెలగాలి. ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరుతున్నారు.
అదే విధంగా ప్రజల నుంచి వినతులు తీసుకోవడానికి ప్రత్యేక వ్యవస్థను కమిటీలను ఏర్పాటు చేస్తామని కూడ బాబు చెబుతున్నారు. ఇక టీడీపీ నేతలు ఎవరూ కక్ష సాధింపు చర్యలకు దిగవద్దు పరుషంగా మీడియా ముందు మాట్లాడవద్దు, ప్రత్యర్ధులను రెచ్చగొట్టవద్దు అని కూడా బాబు సూచిస్తున్నారు.
వైసీపీ ఏ తప్పులు చేసిందో అవే తప్పులు చేయాలని అనుకోవద్దు. ఆ తప్పులే టీడీపీ కూడా చేస్తే ఇక టీడీపీకి వైసీపీకి మధ్య తేడా ఏమి ఉంటుందని ఆయన నేతలతో అంటున్నారు. టీడీపీ క్యాడర్ మీద గత ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టినా దాని నుంచి చట్టపరంగానే విముక్తి కలిగిద్దాం తప్ప మరో విధంగా చేయవద్దని బాబు కోరుతున్నారు. పార్టీ ముఖ్య నేతలకు బాబు ఈ విధంగా సూచిస్తున్నారు.
మరో వైపు ప్రజల్తో కానీ పార్టీ నేతలతో కానీ టీడీపీ మంత్రులు అందుబాటులో ఉండాలని కూడా బాబు కోరుతున్నారు. నిరంతరం ప్రజలతో కనెక్టివిటీ పెంచుకోవాలని కూడా సూచిస్తున్నారు. మొత్తం మీద చూస్తూంటే వైసీపీ చేసిన తప్పులు టీడీపీని అలెర్ట్ చేస్తున్నాయని అంటున్నారు. పార్టీ నేతలకు బాబు ఎలా ఉండకూడదో వైసీపీని ఒక గుణపాఠంగా చూపిస్తూ చెబుతున్నారు.
నిజంగా వైసీపీ టీడీపీకి ఒక కేసు స్టడీగా మారింది అని అంటున్నారు. ప్రజలకు దూరం అయితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో వైసీపీ కళ్ళకు కట్టినట్లుగా చూపించింది అంటున్నారు. అలాగే నేతల దురుసు మాటలు కస్ఖ సాధింపు చర్యలను ప్రజలు ఇష్టపడరని ఇటీవల ఎన్నికల ఫలితాలు నిరూపించిన నేపథ్యంలో టీడీపీ తన నాలుగు దశాబ్దాల అనుభవాన్ని రంగరించి మరీ వైసీపీ తీరుని గమనిస్తూ అలెర్ట్ అవుతోంది అని అంటున్నారు.