ఇకపై సీఎం క్యాంప్ ఆఫీసే వైసీపీ హెడ్ ఆఫీస్?
ఈ సమయంలో వైసీపీ ప్రధాన కార్యాలయం మూత పడనుందని తెలుస్తుంది.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసాయి. రికార్డ్ స్థాయిలో ఏపీలో కూటమి గెలిచింది. అన్నీ అనుకూలంగా జరిగితే ఈ నెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు! మరోపక్క వైసీపీలో తీవ్ర అంతర్మథనం నెలకొందని అంటున్నారు. ఈ ఘోర ఓటమిపై తీవ్రస్థాయిలో పార్టీలో చర్చలు నడుస్తున్నాయని చెబుతున్నారు. ఈ సమయంలో వైసీపీ ప్రధాన కార్యాలయం మూత పడనుందని తెలుస్తుంది.
అవును... ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్... నర్మగర్భ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో గురువారం వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, పలువురు ఎమ్మెల్సీలు, పలువురు అభ్యర్థులతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఫలితాలపై ఒక్కొక్కరూ తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఆ సంగతి అలా ఉంటే... వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సమయంలో తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయం నిత్యం ప్రజలు, పార్టీ కార్యకర్తలతో సందడిగా ఉండేది. నిత్యం అక్కడ భారీగా జనం కనిపిస్తూ ఉండేవారు. అయితే... తాజాగా జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో... తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యలయాన్ని మూసివేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.
వాస్తవానికి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో అధికారిక అవసరాలకు వినియోగించిన క్యాంపు కార్యాలయం సంగతి తెలిసిందే. అయితే... ఇప్పుడు ఈ క్యాంపు కార్యాలయాన్నే వైసీపీ హెడ్ ఆఫీస్ గా మార్చాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. అందువల్ల... మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయం ఇకపై మూసివేయబడవచ్చని అంటున్నారు.