తల్లి చెల్లి కలసి వైసీపీ కొంప ముంచేశారు...సీనియర్ల అంతర్మధనం !

వైఎస్సార్ ఫ్యామిలీ అంటే ప్రాణం ఇచ్చే క్యాడర్ ఈ విధంగా అన్యాయం అయిపోయిందని అంటున్నారు

Update: 2024-07-16 03:44 GMT

వైసీపీ ఓటమిలో సవాలక్ష కారణాలు ఉన్నా కుటుంబంలో గొడవలతో పాటు కీలక వ్యక్తులు వైసీపీకి వ్యతిరేకంగా మారి కోరి పార్టీని దారుణంగా ఓడగొట్టారు అని వైసీపీ నేతలు కుమిలిపోతున్నారు. వైఎస్సార్ ఫ్యామిలీ అంటే ప్రాణం ఇచ్చే క్యాడర్ ఈ విధంగా అన్యాయం అయిపోయిందని అంటున్నారు. వైసీపీలో సీనియర్లు అంతా ఇదే విశ్లేషణ చేస్తున్నారు.

జగన్ కి అత్యంత సన్నిహితుడుగా ఉన్న వారిలో మాజీ మంత్రి పేర్ని నాని ఒకరు. ఆయన మూడేళ్ల పాటు జగన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆయన తాజాగా ఒక యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వైసీపీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని అన్నారు. అయితే సీఎం ఓ ని సరిగ్గా నడపడంలో ఎమ్మెల్యేలకు అనుకూలంగా నడపడంలో మాత్రం జగన్ సరిగ్గా చేయలేదని స్పష్టం చేశారు. దాంతోనే ఎమ్మెల్యేలకు సీఎం కి మధ్య గ్యాప్ వచ్చిందని అన్న్నారు.

అలాగే క్యాడర్ ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగిందని అన్నారు. వాలంటీర్లను పెట్టి ప్రజలకు మేలు చేశారు కానీ పార్టీలో గుర్తింపు కోరుకున్న కార్యకర్తలకు ఏమీ గౌరవం తమ అయిదేళ్ల పాలనలో దక్కలేదని అన్నారు. పార్టీ కోసం అన్నీ వదులుకుని వచ్చిన వారు కానీ ఉన్న దాన్ని పెట్టి బలి అయిన వారు కానీ ఆర్ధికంగా కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది అన్నది తెలియదని అన్నారు. ఇవన్నీ పార్టీలో జరిగిన పొరపాట్లే అన్నారు.

జగన్ కి ఈ విషయాలు తెలుసా ఆయన అర్ధం చేసుకుంటారా అనన్ యాంకర్ ప్రశ్నకు జగన్ కి కూడా ఆలోచనలు ఉన్నాయి కదా ఎందుకు అర్ధం చేసుకోరని తప్పులు దిద్దుకుని తాము ముందుకు వెళ్తామని అన్నారు జగన్ కొత్త రకంగా పాలించాలని ప్రజలకు మేలు చేయాలని భావించి తెచ్చిన సంస్కరణలు తమ పార్టీనే ఇబ్బంది పెట్టాయని పేర్ని నాని అన్నారు.

అదే సమయంలో విజయమ్మ, షర్మిల మీద కూడా ఆయన హాట్ కామెంట్స్ చేసారు. జగన్ తో పాటు తల్లి చెల్లెలు ఇద్దరూ పార్టీలోకి రమ్మని పిలిస్తే తాము వెళ్ళామని చెప్పారు. వైఎస్సార్ కుటుంబం అంటే ఒక్కటే అనుకున్నామని మధ్యలో వారికి గొడవలు వచ్చి చీలిపోయి లక్షలాది మంది క్యాడర్ ని బలి చేశారు అని పేర్ని నాని మండిపడ్డారు.

ఆస్తి తగదాలు ఉంటే కోర్టులలో కేసులు వేసుకోవాలనీ రాజకీయాల్లో ఇలా చేయడం ఏ మాత్రం తగదని షర్మిల మీద కూడా ఆయన కామెంట్స్ చేశారు. ఇదే విషయం మీద ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కూడా తమ పార్టీ ఓటమిలో వైఎస్ విజయమ్మ షర్మిల పాత్ర కూడా చాలా ఉందని అన్నారు. అది రాష్ట్ర వ్యాప్తంగా ఎఫెక్ట్ చూపించింది అని అన్నారు.

తాము మొదట్లో అంతలా ఉంటుందని అనుకోలేదని కానీ చివరికి ఫలితాలు చూశాక మాత్రం ఈ ప్రభావం ఎంతో ఉందని అర్ధం అయింది అన్నారు. క్యాడర్ ని చూసి అయినా వైఎస్సార్ ఫ్యామిలీ ఒక్కటిగా ఉంటే బాగుండేది అని అన్నారు. మొత్తానికి వైసీపీ ఓటమిలో వైఎస్ ఫ్యామిలీలో విభేదాలు కీలక పాత్ర పోషించాయని కేతిరెడ్డి అన్నారు.

చంద్రబాబు చేతిలో పావుగా మారారని అనుకోవడం కంటే బాబుకు అవకాశం ఇచ్చారు అనుకోవడమే సబబు అని ఆయన అన్నారు. బాబుని ఈ విషయంలో తప్పు పట్టడం కంటే కూడా వైఎస్సార్ ఫ్యామిలీలో చీలికలు రాకుండా చూసుకుంటే బాగుండేది అని ఆయన అన్నారు. మొత్తానికి తల్లి చెల్లి కలసి వైసీపీ కొంప ముంచేశారు అని సీనియర్లు ఇపుడు తీవ్రంగా మధన పడుతున్నారు.

Tags:    

Similar News