టీడీపీ హ్యాట్రిక్ ఎమ్మెల్యే నెత్తిన పాలు పోస్తున్న వైసీపీ...!?

అందులో తూర్పు సీటులో పాతిక వేల భారీ ఓట్ల మెజారిటీతో మూడవసారి వెలగపూడి రామక్రిష్ణ బాబు టీడీపీ నుంచి గెలిచారు.

Update: 2023-12-26 23:30 GMT

విశాఖ జిల్లా అంటేనే టీడీపీకి బలమైన స్థావరం అని అర్ధం జగన్ వేవ్ బలంగా వీచిన 2019 ఎన్నికల్లోనే విశాఖలోని నాలుగు సీట్లూ టీడీపీ పరం అయ్యాయి. అందులో తూర్పు సీటులో పాతిక వేల భారీ ఓట్ల మెజారిటీతో మూడవసారి వెలగపూడి రామక్రిష్ణ బాబు టీడీపీ నుంచి గెలిచారు. ఆయనకే మరోసారి 2024లో టికెట్ ని టీడీపీ అధినాయకత్వం ఇస్తోంది.

ఇదిలా ఉంటే విశాఖ తూర్పులో రెండు ఎన్నికల్లోనూ వైసీపీ పరాజయం పాలు అయింది. ఈసారి అయినా గెలుపు దిశగా పార్టీని నడిపించాలీ అంటే అంతా ఒకే త్రాటి మీదకు రావాలి. నిజానికి తూర్పు లో వైసీపీకి బలం ఉంది. కానీ వర్గ పోరు వల్లనే పరాజయం పాలు అవుతోంది. 2019 ఎన్నికల్లో అక్రమాని విజయనిర్మలకు టికెట్ ఇస్తే సొంత పార్టీలోనే ఆమెకు సహాయ నిరాకరణ ఎదురై ఓటమి పాలు అయ్యారు.

వైసీపీలో ఎమ్మెల్సీ వంశీ క్రిష్ణది ఒక వర్గం అయితే మేయర్ హరి వెంకటకుమారిది మరో వర్గం. ఇక వీఎమ్మార్డీయే చైర్ పర్సన్ అక్రమాని విజయనిర్మలది ఇంకో వర్గం. ఇలా మూడు వర్గాలు ఉండగా ఇపుడు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను తీసుకుని వచ్చి తూర్పు ఇంచార్జిని చేశారు. దాంతో ఆయనకు ఈ వర్గాలు సహకరించడంలేదు.

బీసీలు ఎక్కువగా ఉన్న ఈ సీట్లో తొలి నుంచి తెలుగుదేశం పార్టీ ఓసీకే టికెట్ ఇస్తూ గెలుస్తోంది. వైసీపీ రెండు సార్లు బీసీలకు టికెట్ ఇచ్చినా గెలవకపోవడంతో ఈసారి రూట్ మార్చింది. వెలగపూడి సామాజికవర్గానికే చెందిన ఎంవీవీని బరిలోకి దింపుతోంది. అంగబలం అర్ధబలం రెండూ ఉన్న ఎంవీవీ అయితే తట్టుకోగలరని పార్టీ భావిస్తోంది.

ఇక ఎంవీవీకి ఇటీవల బాధ్యతలు అప్పగించిన తరువాత ఆయన జనంలో ఉంటున్నారు. అదే సమయంలో ఎమ్మెల్సీ వంశీక్రిష్ణ వర్గం మాత్రం మౌనంగా ఉంటోంది. లేటెస్ట్ గా సాగుతున్న పరిణామాలు చూస్తే వైసీపీ ఎమ్మెల్సీ వంశీక్రిష్ణ జనసేన పార్టీలోకి చేరేందుకు సిద్ధం అవుతున్నారని ప్రచారం సాగుతోంది.

ఆయన విశాఖ సిటీ నుంచి వైసీపీలో చేరిన తొలి నేతగా గుర్తింపు పొందారు. అంతే కాదు ఆయన వైసీపీకి జిల్లా ప్రెసిడెంట్ గా కూడా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆయనకు 2024 ఎన్నికల్లో పోటీ చేయాలని ఉంది. అయితే ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు కాబట్టి ఎంవీకి సహకరించాలని అధినాయకత్వం కోరుతోందని అంటున్నారు. దీంతో ఆయన జనసేన వైపుగా చూస్తున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో జనసేన నుంచి ఆయన పోటీ చేస్తారా అంటే కూడా డౌటే.

ఎందుకంటే తూర్పు నుంచి వెలగపూడికి టీడీపీ తరఫున కంఫర్మ్ అయింది. ఈ సీటు జనసేనకు ఇవ్వరు. మరి ఎందుకు వంశీ జనసేన వైపు వెళ్తున్నారు అన్నదే చర్చగా ఉంది. ఏది ఏమైనా వైసీపీలో అక్రమాని వర్గం సైలెంట్ గా ఉండడం వంశీ పార్టీని వీడిపోయినట్లు అయితే 2024 ఎన్నికల్లో వైసీపీకి విశాఖ తూర్పులో ఇబ్బందులు తప్పవని అంటున్నారు.

ఆ విధంగా చూస్తే కనుక హ్యాట్రిక్ ఎమ్మెల్యే వెలగపూడికి నెత్తిన పాలు పోసేందుకు వైసీపీ సిద్ధంగా ఉందా అన్న చర్చ సాగుతోంది. మొత్తానికి వెలగపూడి నాలుగవసారి కూడా గెలిస్తే అందులో వైసీపీ క్రెడిట్ ఎక్కువగా ఉంటుందని అంతా అంటున్నారు.

Tags:    

Similar News