బీజేపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే.. అక్కడి నుంచి పోటీ!

తాజాగా నెల్లూరు జిల్లా గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్‌ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

Update: 2024-03-24 09:50 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో అధికార వైసీపీకి మరో షాక్‌ తగిలింది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి వేరే పార్టీల్లో చేరిపోయారు. ఈ క్రమంలో వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా నెల్లూరు జిల్లా గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్‌ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్‌ థావడే సమక్షంలో వరప్రసాద్‌ బీజేపీలో చేరారు. కాగా వచ్చే ఎన్నికల్లో వరప్రసాద్‌ కు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ టికెట్‌ నిరాకరించారు. ఆయనకు బదులుగా ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న మేరిగ మురళీధర్‌ కు గూడూరు సీటిచ్చారు.

ఈ నేపథ్యంలో వెలగపల్లి వరప్రసాద్‌ బీజేపీలో చేరారు. మాజీ ఐఏఎస్‌ అధికారి అయిన వరప్రసాద్‌ 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో తిరుపతి నుంచి లోక్‌ సభకు పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2014 ఎన్నికలకు ముందు వరప్రసాద్‌ వైసీపీలో చేరారు. వైసీపీ తరఫున తిరుపతి నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2019లో వైసీపీ తరఫున గూడూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి వైఎస్‌ జగన్‌.. వరప్రసాద్‌ కు టికెట్‌ ఇవ్వలేదు. గూడూరు నియోజకవర్గంలో సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉందని ఆయనను పక్కనపెట్టారు. తన కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా టికెట్‌ ఇవ్వాలని వరప్రసాద్‌ కోరినా జగన్‌ పట్టించుకోలేదు.

దీంతో వరప్రసాద్‌ బీజేపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో ఆయన బీజేపీ తరఫున తిరుపతి నుంచి లోక్‌ సభకు పోటీ చేయొచ్చని ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో బీజేపీలో చేరాక వరప్రసాద్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం ప్రధాని నరేంద్రమోదీకే సాధ్యమన్నారు. ఆయన సారథ్యంలో పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. మరోసారి తిరుపతి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించారంటూ కృతజ్ఞతలు తెలిపారు. దీంతో ఈ ఎన్నికల్లో ఆయన తిరుపతి నుంచి పోటీ చేయడం ఖాయమైనట్టేనని అంటున్నారు.

కాగా ఇంతకుముందు వరప్రసాద్‌ మంగళగిరి వచ్చి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ను కూడా కలిశారు. వివిధ రాజకీయ అంశాలపై ఆయనతో చర్చించారు. జనసేన పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తనకు తిరుపతి ఎంపీ సీటు ఇవ్వాలని పవన్‌ కళ్యాణ్‌ ను కోరారు.

అయితే వరప్రసాద్‌ కు పవన్‌ ఎలాంటి హామీ ఇవ్వలేదు. దీనిపై పార్టీలో చర్చించిన తర్వాత తన నిర్ణయం చెబుతానని వరప్రసాద్‌ కు వెల్లడించారు. టీడీపీ, బీజేపీతో పొత్తులో ఉండటంతో ఆ పార్టీ నేతలతోపాటు తిరుపతి జనసేన పార్టీ నేతలతో పవన్‌ దీనిపై చర్చించి చెబుతామన్నారు. దీంతో వరప్రసాద్‌ బీజేపీలో చేరి అక్కడ నుంచి పోటీ చేయనున్నారు.

Tags:    

Similar News