పవన్ చుట్టూ పద్మవ్యూహం...ఈసారి కూడా...!?

అయితే పవన్ ప్రతీ కదలికను అధికార వైసీపీ నిశితంగా గమనిస్తోంది. ఆయన ఎక్కడ పోటీ చేసినా మళ్లీ ఓడించాలని ఈసారి కూడా చట్ట సభలో అడుగుపెట్టకుండా నిలువరించాలని కంకణం కట్టుకుంది.

Update: 2024-03-08 00:30 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ పాలిటిక్స్ లో స్పెషల్ క్యారెక్టర్. ఆయన కంప్లీట్ పొలిటీషియన్ నా అంటే కాదు. ఆయన సినీ హీరో. అలాగే ఎమోషన్స్ ఎక్కువగా ఉన్న వారు. రాజకీయంగా ఉన్న కొన్ని ట్రెడిషన్స్ ని ఆయన వంటబట్టించుకోవడంలేదు. ఆయన ఒక్కోసారి మాట్లాడుతూంటే సామాన్యుడి వేదన రోదన ఆయన గొంతులో వినిపిస్తాయి.

సగటు మనిషి కూడా ఒక్కసారిగా సిస్టం ని మార్చేయాలను అనుకుంటాడు. ఆవేశపడతారు. తన చుట్టూ ఉన్న వారితో కలసి మీటింగ్స్ పెడతారు. కానీ ఏమీ జరగవు అని తెలుసుకుని నిట్టూరుస్తాడు. పవన్ కూడా రాజకీయంగా ఏదో సాధించాలనే వచ్చారు. ఈ పొలిటికల్ గేం లో ఆయన నెమ్మదిగా అడ్జస్ట్ అవుతున్నారు. అందుకే ధనం లేనిదే రాజకీయం సాగదు అని ఆయన అర్థం చేసుకున్నారు.

అలాగే అనేక సమీకరణలు కూడా చూసుకుంటున్నారు. 2019లో రెండు చోట్ల లభించిన ఓటమి చేదుని దిగమింగుకుని ఆ గుణపాఠాన్ని ఆయన బట్టీ పట్టారు. దాంతో ఈసారి ఆచీ తూచీ అడుగులు వేస్తున్నారు. గాజువాక నుంచి భీమవరం ఆ మీదట పిఠాపురం, ఇపుడు తిరుపతి ఇలా తాను ఎక్కడ నుంచి పోటీ చేస్తాను అన్న సంగతిని ఆయన బయటపెట్టనీయడం లేదు.

అయితే పవన్ ప్రతీ కదలికను అధికార వైసీపీ నిశితంగా గమనిస్తోంది. ఆయన ఎక్కడ పోటీ చేసినా మళ్లీ ఓడించాలని ఈసారి కూడా చట్ట సభలో అడుగుపెట్టకుండా నిలువరించాలని కంకణం కట్టుకుంది. జగన్ నిన్ను ఓడిస్తాను అని పవన్ శపధం చేస్తే అసెంబ్లీ గేటుని కూడా తాకనివ్వమని వైసీపీ అంటోంది.

ఇక పవన్ ఎక్కడ పోటీ చేసినా అక్కడికక్కడ ఆయన సామాజిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా రాజకీయం చేయాలని సరికొత్త వ్యూహాలకు వైసీపీ తెరలేపుతోంది. భీమవరంలో పవన్ పోటీ చేస్తే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఉన్నారు. ఆయన పక్కా లోకల్. స్ట్రాంగ్ క్యాండిడేట్. ఆయనకు మరింత మందీ మార్బలం సమకూర్చడానికి వైసీపీ పూర్తి ప్రిపరేషన్ తో ఉంది.

అలా కాదు పిఠాపురం అనుకుంటే అక్కడ కాపు నేత ముద్రగడ పద్మనాభాన్ని రెడీ చేస్తున్నారు. ఆయనతో చర్చలు పూర్తి చేశారు. పవన్ సై అంటే ఇటు నుంచు ముద్రగడ సమ ఉజ్జీగా బరిలోకి దిగుతారు అని అంటున్నారు. ఈ రెండూ కాకుండా పవన్ తిరుపతి నుంచి పోటీ చేస్తే ఎలా అంటే దానికి కూడా వైసీపీ పకడ్బంధీ ప్లాన్ తో సిద్ధంగా ఉంది.

ప్రస్తుతం తిరుపతిలో సిట్టింగ్ ఎమ్మెలెయ కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అని ఫిక్స్ అయిన విషయం. కానీ పవన్ కనుక అక్కడికి వస్తే ఆయన్ని ఢీ కొట్టేల మహిళా బీసీ అభ్యర్ధిని వైసీపీ సిద్ధం చేసి ఉంచింది అని అంటున్నారు. ఆమె ఎవరో కాదు డాక్టర్ శిరీష. ఆమె తిరుపతి కార్పోరేషన్ మేయర్ గా ఉన్నారు.

తిరుపతిలో బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు. బీసీ మహిళా నేత. విద్యాధికురాలు. తిరుపతిలో బలిజ ఓటర్లు ఎక్కువ కాబట్టి అక్కడ నుంచి పోటీకి పవన్ చూస్తున్నారు. అయితే బలిజలతో ధీటుగా బీసీలు కూడా ఉన్నారు. దాంతో బీసీ ఓటు బ్యాంక్ ని అండగా చేసుకుని పవన్ మీద సమరం సాగించడానికి వైసీపీ సర్వ ఏర్పాట్లు చేసుకుని ఉంది.

అపుడు అభినయ్ రెడ్డిని తిరుపతి కార్పోరేషన్ మేయర్ ని చేస్తారు అని అలా కరుణారెడ్డి బలం వ్యూహాలు బీసీల సామాజిక అండదండలు అధికార పార్టీగా కలసి వచ్చే అన్ని రకాల అడ్వాంటేజీలను వాడుకుంటూ పవన్ ని ఓడించాలని వైసీపీ భావిస్తోందిట. మొత్తానికి పవన్ చుట్టూ పద్మవ్యూహాన్నే రచించి ఆయనను ఈసారి కూడా ఓడించాలన్నది వైసీపీ పంతం. మరి పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్నది మాత్రం ఈ రోజుకీ సస్పెన్స్.

Tags:    

Similar News