వారంతా ప్రవాసాంధ్రులు... ఈ స్లోగన్ హిట్టవుతుందా...?
ఇలా విపక్ష నేతలు అంతా హైదరాబాద్ లో ఉంటూ రాజకీయాలు చేస్తున్నారు అన్నది వైసీపీ కొత్త స్లోగన్.
ఏపీలో ఎవరు నివాసం ఉంటున్నారు అన్నది ఇపుడు చర్చకు వస్తున్న విషయం. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబుకు హైదరాబాద్ లో వందల కోట్ల రూపాయల విలువ చేసే భారీ భవంతి ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి హైదరాబాద్ లోనే శాశ్వత నివాసం ఉంది. ఇలా విపక్ష నేతలు అంతా హైదరాబాద్ లో ఉంటూ రాజకీయాలు చేస్తున్నారు అన్నది వైసీపీ కొత్త స్లోగన్. ఒక విధంగా వారికి ఏపీతో ఏమిటి పని అన్నది కూడా సూటి ప్రశ్న.
ఏపీలో ఉన్న ప్రజల గురించి వారికి ఆలోచనలు లేవు రావు, కేవలం రాజకీయాల కోసమే ఏపీలో ల్యాండ్ అయి మళ్ళీ తమ గూటికి అంటే హైదరాబాద్ కి వెళ్ళిపోతూంటారు. ఏపీలో విపక్షాల రాజకీయం ఎందుకోసమో ముఖ్యమంత్రి జగన్ ఓపెన్ గానే చెప్పేశారు. వారంతా ఏపీలో దోచుకోవడానికి అలా దోచుకున్నది హైదరాబాద్ వెళ్లి పంచుకోవడానికి అని ఆయన అంటున్నారు.
సామర్లకోటలో జరిగిన సభలో జగన్ విపక్షాలను ప్రవాసాంధ్రులుగా డిక్లేర్ చేసి పారేశారు. చంద్రబాబు పట్టుమని పది రోజులు ఏపీలో గత నాలుగున్నరేళ్లలో ఎపుడైనా ఉన్నారా అని ఆయన సూటిగానే ప్రశ్నిస్తున్నారు. ఆయన రాజమండ్రి జైలులో మాత్రం గత నెల రోజులకు పైగా ఉన్నారంటే ఆ రీజన్ వేరు కాబట్టే అని సెటైర్లు వేశారు. అంతే తప్ప ఏపీలో కనీసం కాపురం చేయని సొంత ఇల్లు లేని బాబు ఏపీని ఏమి ఉద్ధరిస్తారు అని జగన్ గట్టిగానే అటాక్ చేస్తున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ ఏపీ రాక అన్నది షూటింగ్ కి షూటింగ్ కి మధ్య విరామంలో తప్ప ఆయన ఉండేది గడిపేది అంతా హైదరాబాద్ లోనే అని జగన్ హాట్ హాట్ విమర్శలు చేశారు. ఈ ఇద్దరే కాదు లోకేష్ కానీ బాలయ్య కానీ ఏపీలో ఉండడంలేదు అని ఎత్తి చూపారు. ఏపీ మీద ప్రేమ లేని వారు ఏపీకి ఏ మాత్రం సంబంధం లేని వారు ఏపీకి మేలు చేస్తామని జనం ముందుకు వస్తే ఆలోచించుకోవాల్సింది ప్రజలే అని కూడా జగన్ అంటున్నారు.
ఇదిలా ఉంటే ప్రవాసాంధ్రులు ఏపీలో ఉండని విపక్షాలు అంటూ వైసీపీ సరిగ్గా ఎన్నికల వేళ ఎక్కుపెట్టిన ఈ అస్త్రం ఆ పార్టీకి బ్రహ్మాస్త్రం అవుతుందా అన్న చర్చ అయితే మొదలైంది. జగన్ అయితే విపక్షంలో ఉండగానే తాడేపల్లిలో నివాసం కట్టుకున్నారు అని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.
అయితే పవన్ నివాసం ఏది బాబు ఇల్లు ఏది అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఏపీలో రాజకీయం చేయాలంటే విపక్షాలు ఏపీలోనే ఉండాలి. కానీ కరోనా టైం లో కూడా ప్రతిపక్ష నేతలు అంతా ఏపీలో లేరు అన్నవి వైసీపీ మరో విమర్శ. అయితే పదునైన ఈ విమర్శను జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్న దాని మీదనే చూడాల్సి ఉంది.
ఇంకో వైపు నుంచి చూస్తే ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ తన వారు ఎవరో పరవారు ఎవరో చూడమని జగన్ పిలుపు ఇస్తున్నారు. నిరంతరం ప్రజల మధ్యన ఉండేవారు కావాలా లేక అధికారం కోసం అర్రులు చాచే వారు కావాలా అని ఆయన ప్రశ్నిస్తున్నారు.
ప్రవాసాంధ్రులు అన్న ఆలోచన కనుక జనంలోకి జొప్పించగలిగితే అదే తమ రాజకీయానికి సూపర్ హిట్ అవుతుంది అని వైసీపీ భావిస్తోంది. అందుకే గతానికి భిన్నంగా ఈసారి సభలో జగన్ ఈ కొత్త పాయింట్ ని జనం ముందు ఉంచారు. మరి ప్రతిపక్షాలు దీని మీద ఎలా రెస్పాండ్ అవుతాయో కూడా చూడాల్సి ఉంది.