అతడు లేని ఐప్యాక్‌ ప్యాకప్పేనా?

ప్రశాంత్‌ కిశోర్‌ ఎన్నికల వ్యూహాలకు 2019లో వైసీపీ చరిత్రాత్మక విజయాన్ని సాధించింది.

Update: 2024-08-26 06:47 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో 2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ను ముఖ్యమంత్రిని చేయడంలో, వైసీపీ 151 స్థానాలతో తిరుగులేని విజయం సాధించడంలో ప్రశాంత్‌ కిశోర్‌ నేతృత్వంలోని ఐప్యాక్‌ దే ప్రధాన పాత్ర అనే విషయం తెలిసిందే.

ప్రశాంత్‌ కిశోర్‌ ఎన్నికల వ్యూహాలకు 2019లో వైసీపీ చరిత్రాత్మక విజయాన్ని సాధించింది. అయితే సొంత పార్టీ ఏర్పాటుతో ఆయన ఐప్యాక్‌ నుంచి వైదొలిగారు. దీంతో రిషిరాజ్‌ ఐప్యాక్‌ ను నడిపించాడు. ఆయన ఆధ్వర్యంలోనే వైసీపీ ఐప్యాక్‌ సేవలను పొందింది.

2019లో తనకు ఘనవిజయాన్ని కట్టబెట్టేలా చేయడంతో అధికారంలోకి వచ్చాక కూడా వైఎస్‌ జగన్‌ ఐప్యాక్‌ ను కొనసాగించారు. అంతేకాకుండా 2024 ఎన్నికలకు కూడా ఐప్యాక్‌ సేవలనే పొందారు.

అయితే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలవుతుందని.. ఫలితాలను ముందుగానే ప్రశాంత్‌ కిశోర్‌ కుండబద్దలు కొట్టారు. కేవలం సంక్షేమ పథకాల వల్లే ఓట్లు రావని.. ప్రజలు సంక్షేమంతో కూడిన అభివృద్ధిని కోరుకుంటున్నారని ఆయన చెప్పారు.

ప్రశాంత్‌ కిశోర్‌ మాటలను ఎన్నికల ముందు వైసీపీ నేతలు ఖండించారు. ఆయనపై పోటీలు పడి తీవ్ర విమర్శలు చేశారు. పీకే ఔట్‌ డేటెడ్‌ అని, ఆయన వల్ల ఎవరికీ ఎలాంటి ప్రయోజనం లేదని, తాము రిషి ఆధ్వర్యంలో ఐప్యాక్‌ తో నడుస్తున్నామని చెప్పారు.

అయితే.. ప్రశాంత్‌ కిశోర్‌ చెప్పినట్టే ఎన్నికల ఫలితాలు వచ్చాయి. వైసీపీ దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మంత్రులు (ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా), మహామహులు అంతా ఘోరంగా ఓడారు. ఎంపీగా పోటీ చేసిన విజయసాయిరెడ్డి వంటివారు సైతం కూటమి సునామీలో కొట్టుకుపోయారు. ఇక జగన్‌ మెజారిటీ 2019తో పోలిస్తే పులివెందులలో దాదాపు 30 వేలు తగ్గిపోయింది.

వాస్తవానికి రిషి ఆధ్వర్యంలోని ఐప్యాక్‌ మళ్లీ జగన్‌ దే అధికారమని బల్లగుద్ది చెప్పింది. ఈ మేరకు ‘మా నమ్మకం నువ్వే జగన్‌’, ‘జగనన్నే మా భవిష్యత్‌’ వంటి నినాదాలకు తోడు ‘సిద్ధం’ పేరుతో ప్రాంతాలవారీగా నిర్వహించిన భారీ బహిరంగ సభలు ఇవన్నీ ఐప్యాక్‌ ప్లానే.

ఈ కార్యక్రమాలు, సిద్ధం సభలు విజయవంతం కావడంతో 151 సీట్లకు మించి జగన్‌ విజయం సాధించడం ఖాయమని ఐప్యాక్‌ ఆయనకు నివేదిక ఇచ్చింది. జగన్‌ తో సహా వైసీపీ నేతలంతా ఐప్యాక్‌ మాటల వలలో పడ్డారు. చివరకు కళ్లు బైర్లు కమ్మి దిమ్మతిరిగే స్థాయిలో ఫలితాలు వచ్చాయి.

ప్రశాంత్‌ కిశోర్‌ ఐప్యాక్‌ లో లేకపోయినా అంతా ఆయన చెప్పినట్టే జరిగింది. ఇప్పుడు ఐప్యాక్‌ ఆంధ్రప్రదేశ్‌ నుంచి బిచాణా ఎత్తేసిందని సమాచారం. మహారాష్ట్ర, హరియాణా తదితర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుండటం అక్కడ ఆయా పార్టీలకు ఐప్యాక్‌ సేవలు అందిస్తోందని తెలుస్తోంది. అయితే ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్‌ కిశోర్‌ లేని ఐప్యాక్‌ కు అంత సీన్‌ లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ అసెంబ్లీ ఫలితాలే ఇందుకు నిదర్శనమంటున్నారు.

Tags:    

Similar News