ఓడితే దేశం విడిచి పారిపోవడమేనా !?

ఒకనాడు తమిళనాడులో ఈ పొలిటికల్ కల్చర్ ఉండేదని అంటారు.

Update: 2024-05-19 23:30 GMT

రాజకీయాలు అంటే ప్రజల కోసం ప్రజల తరఫున గొంతు విప్పి గట్టిగా నిలబడి చేసేవి. కానీ ఏపీ రాజకీయాలు చూస్తే అలా ఏ మాత్రం లేవు అన్న చర్చ వస్తోంది. రాజకీయాల ప్లేస్ లో పగ ప్రతీకారాలు పెరిగిపోతున్నాయి. ఒకనాడు తమిళనాడులో ఈ పొలిటికల్ కల్చర్ ఉండేదని అంటారు. దానిని మించిపోయింది ఏపీ అని చెబుతున్నారు.

తమిళనాడులో గెలిచిన పార్టీ అసెంబ్లీలో ఉంటే ఓడిన పార్టీ అసెంబ్లీకే వచ్చేందుకు ఇష్టపడదు, అలా సభకు ఒక నమస్కారం పెట్టి ఒకసారి జయలలిత గెలిచింది. మరోసారి కరుణానిధి గెలిచారు. జయలలిత తనకు సభలో అవమానం జరిగింది అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ బాయ్ కాట్ చేశారు. ఆనాడు ఆమె అన్న మాట మళ్లీ సీఎం గానే వస్తాను అని.

అలా ఆమె మాట నిలబెట్టుకున్నారు. ఆ తరువాత ఆమె సీఎం అయ్యాక కరుణానిధిని అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. అది దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అప్పటికి ఎనభై పడిలో ఉన్న పెద్దాయన సీఎం గా చేసిన వ్యక్తిని పట్టుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. అలా కరుణానిధి జయలలితల మధ్యన రాజకీయం ఒక రేంజిలో సాగింది.

ఇక ఈ ఇద్దరూ ఇపుడూ లేరు. తమిళనాడులో రాజకీయం నువ్వా నేనా అని సాగుతున్నా అంతటి తీవ్రమైన పోరు మాత్రం లేదు. పగలు ప్రతీకారాలూ కూడా తగ్గాయి. బ్యాడ్ లక్ ఏమిటి అంటే అవి ఏపీకి పాకాయి. ఇక్కడ చూస్తే రెండే కుటుంబాలు రెండే పార్టీలు ఇద్దరి వ్యక్తుల చుట్టూ ఏపీ పాలిటిక్స్ మొత్తం అల్లుకుని పోయింది. వారు వస్తే వీరికి ఇబ్బంది అని వీరు వస్తే వారికి మహా ఇబ్బంది అని అపుడే చర్చ మొదలైంది.

ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తే వైసీపీ నేతలు అంతా విదేశాలకు పారిపోవడమే అని చాలా కాలంగా టీడీపీ నేతలు అంటూ వస్తున్నారు. బడా నేతలు కూడా ఈ విషయంలో ఉన్నారు. ఇక వైసీపీ దుకాణం బంద్ అవుతుందని వారంతా తలదాచుకోవడానికి దేశం విడిచిపోతారు అని టీడీపీ నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నాయి.

ఇక వైసీపీ నేతలు కూడా అంతకు అంత అన్నట్లుగా ఉన్నారు. ఈసారి వైసీపీ గెలిస్తే మాత్రం టీడీపీ ఖేల్ ఖతం దుకాణం బంద్ అంటున్నారు. ఈసారి అంతా వేరే లెవెల్ అని చెబుతున్నారు. మరి ఏమి జరుగుతుంది

అన్న ఉత్కంఠను పెంచేస్తున్నారు. ఏపీలో చూస్తే వైసీపీ నేతలు దేశం విడిచిపోతారు అన్న విమర్శల మీద మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు.

తాము ఎందుకు వెళ్తామని ఆయన ప్రశ్నించారు. తమకు విదేశాల్తో వ్యాపారాలు 2013 నుంచి ఉన్నాయని అన్నారు. అలా ఆఫ్రికాకు తాము వ్యాపారం చేస్తూ ఉంటే తాము దేశం విడిచిపోతామని లోకేష్ దేవినేని ఉమా కామెంట్స్ చేయడాన్ని ఆయన తప్పు పట్టారు.

ఈ మాటలు అన్నీ జూన్ 4 వరకూ దాచుకోండి అపుడు ఎవరు గెలుస్తారో ఎవరు ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారో చూద్దామని సవాల్ చేశారు. తాము మంచి మెజారిటీతో గెలుస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. సరే పెద్దిరెడ్డి చెప్పారని కాదు కానీ ఓడితే నాయకులు దేశం విడిచి పోవాలా అన్నదే ప్రశ్నగా ఉంది.

అది టీడీపీ కావచ్చు లేదా వైసీపీ కావచ్చు ఒకరికి జనాలు అధికారం ఇస్తారు, రెండవ వారిని ప్రతిపక్షంలో ఉండమంటారు. అది కూడా ముఖ్య బాధ్యతనే దానిని చేపట్టి ప్రజల గొంతుకగా నిలవాలి తప్పించి ఓడితే అక్కడితో అయిపోతుంది అని ఎవరూ అనుకోకూడదు, రాజకీయ పార్టీలు కూడా ఆ రకంగా భావించకూడదు, ప్రజాస్వామ్యంలో బ్యూటీ ఏంటి అంటే భిన్న గొంతుకలు వినిపించడమే.

మరి దానిని అంతా గౌరవించాల్సి ఉంది. ఏపీలో పూర్వపు వాతావరణం రావాలి. అధికార పక్షం విపక్షం కలసి పనిచేయాలి. ప్రజా సమస్యల విషయంలో ఒక్కటి కావాలి. దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా విభజన సమస్యలు ఏపీకి ఉన్నాయి. కేంద్రం నుంచి సాధించుకోవాల్సినవి చాలా ఉన్నాయి.

వాటికి అంతా కలిసి మాత్రమే సాధించగలరు. గత పదేళ్ళుగా వైసీపీ టీడీపీ తమ మధ్యన రాజకీయ పోరాటం పెట్టుకుని కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సినవి వదిలేశాయి. ఈసారి అలా చేయకూడదు అన్నది జనం మాట. అందువల్ల ఎవరూ దేశం విడిచి వెళ్లాల్సిన అవసరం లేదు, అలాంటి విమర్శలు కానీ సెటైర్లు కానీ ప్రజాస్వామ్యానికే మచ్చ తెస్తాయని మేధావులు అంటున్నారు.

Tags:    

Similar News