ప్రతిపక్ష పాత్ర కాదు అని ప్రేక్షక పాత్ర ?

ఈలోగా టీడీపీ కూటమి పెర్ఫార్మెన్స్ మీద జనాలకు ఒక అంచనా కలుగుతుందని వారి అభిప్రాయం ఏమిటో కూడా ఎంతో కొంత అర్ధం అవుతుందని వైసీపీ హై కమాండ్ భావిస్తోందిట.

Update: 2024-06-17 23:30 GMT

ఏపీ రాజకీయాల్లో వైసీపీ పాత్ర ఏంటి అంటే చాలా రకాలైన చర్చలు సాగుతున్నాయి. జగన్ మళ్లీ జనంలోకి వస్తారు అని అంటున్నారు. అలాగే పార్టీ నేతలు యాక్టివ్ అవుతారు అని కూడా చెబుతున్నారు. అంతా కలసి తమదైన పంధాలో పోరాటాలు చేసి అధికార కూటమికి చుక్కలు చూపిస్తారు అని కూడా ప్రచారంలో ఉంది.

అయితే వైసీపీ అధినాయకత్వం తీరు చూస్తే మాత్రం ఫుల్ సైలెంట్ గానే ఉండాలని ఆలోచిస్తోంది అని అంటున్నారు. జగన్ అయితే టీడీపీ కూటమికి హానీమూన్ పీరియడ్ అని అన్నారు. అంటే వారు మంచి ఆధిక్యతతో గెలిచి ఫుల్ జోష్ మీద ఉన్నారు అని పార్టీ నేతల సమావేశంలో జగన్ చెప్పారు. ఆ ఆనందం అలా ఉండనీయాలని ఆయన భావిస్తున్నారుట.

అంతే కాదు ప్రజలు కూడా కొత్త ప్రభుత్వం మీద ఆశలు పెంచుకుని ఉన్నారని ఇపుడు వారు ఎంత కాదనుకున్నా అటే చూస్తారు అని వైసీపీ పెద్దలు భావిస్తున్నారుట. తాము భారీగా సీట్లు ఇచ్చి అధికారంలోకి తెచ్చిన ప్రభుత్వం ఏమి చేస్తుంది అన్నది ప్రజలకు ఆసక్తితో పాటు ఆతృత కూడా ఉంటుందని అంటున్నారు.

అందువల్ల ఈ టైం లో పోరాటాలు చేసినా అధికార పార్టీ మీద ఎంత విమర్శలు చేసినా పెద్దగా ఎక్కదు సరికదా జనాలు సైతం పట్టించుకోరు అని అంటున్నారు. అందుకే వీలైనంత ఎక్కువగా టైం ఇవ్వాలని వైసీపీ అధినాయకత్వం భావిస్తోందిట. కనీసంగా ఆరు నెలల నుంచి ఏడాది పాటు కూటమికి హానీమూన్ పీరియడ్ గా టైం ఇవ్వడానికి వైసీపీ చూస్తోందిట.

ఈలోగా టీడీపీ కూటమి పెర్ఫార్మెన్స్ మీద జనాలకు ఒక అంచనా కలుగుతుందని వారి అభిప్రాయం ఏమిటో కూడా ఎంతో కొంత అర్ధం అవుతుందని వైసీపీ హై కమాండ్ భావిస్తోందిట. జనాలు కూటమి ఇచ్చిన హామీలు సరిగ్గా అమలు చేయలేకపోయినా లేదా తాము కోరుకున్నట్లుగా పాలన సాగకపోయినా అసంతృప్తి వ్యక్తం చేస్తారని సరిగ్గా జనాల మూడ్ పట్టుకుని ఫీల్డ్ లోకి దిగితే ఏటవాలుగా రాజకీయం సాగిపోతుందని వైసీపీ అంచనా కడుతోందిట.

అందుకే టీడీపీ కూటమి పనితీరుని మౌనంగా గమనించడం వారి పైన ఎలాంటి విమర్శలు చేయకుండా ఉండాలని వైసీపీ ఒక నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు. మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ కూడా ఇదే మాట మీడియా ముందు చెప్పారు. మేము కొన్నాళ్ళ పాటు మౌనంగా ఉండాలని అనుకున్నామని అందువల్ల మమ్మల్ని మీరు కూడా ఏమీ అనొద్దు, మీకు ప్రజలు అధికారాన్ని ఇచ్చారు. ప్రజలకు మీరు ఏమి చేయాలో చేసి చూపించండి అని కూటమి నేతలకు సూచనలు ఇచ్చారు.

మరో వైపు చూస్తే జగన్ ఎపుడు బయటకు వస్తారు అంటే దాని మీద రకరకాలైన ప్రచారం సాగుతోంది. వైసీపీ కార్యకర్తల మీద టీడీపీ వారి దాడులు ఏపీవ్యాప్తంగా సాగుతున్న వేళ వారిని ఓదార్చి వారి వైపు తాను ఉన్నాను అన్న మేసేజ్ ని ఇవ్వాలని జగన్ అనుకుంటున్నారు అని తెలుస్తోంది. దానికి ఓదార్పు యాత్ర అంటారో లేదా వేరే ఏ పేరు పెడతారో తెలియదు కానీ జగన్ మాత్రం మంచి రోజు చూసుకుని జనంలోకి వచ్చి క్యాడర్ కి భరోసా ఇస్తారని అంటున్నారు.

అయితే జగన్ అధికార కూటమి మీద ఎలాంటి రాజకీయ విమర్శలు చేయబోరని అంటున్నారు. ఎందుకంటే కూటమికి కొంతకాలం టైం ఇవ్వాలన్న ఉద్దేశ్యంతోనే అని అంటున్నారు. మొత్తానికి వైసీపీకి అయితే ప్రస్తుతానికి ప్రతిపక్ష పాత్ర కాదు అని ప్రేక్షక పాత్ర అని అంటున్నారు. మరి అసెంబ్లీకి వైసీపీ తరఫున ఎమ్మెల్యేలు హాజరవుతారా జగన్ వెళ్తారా అంటే అది కూడా డౌట్ అని అంటున్నారు.

వైసీపీ వరకూ చూస్తే అసెంబ్లీ కంటే శాసనమండలి మీదనే ఫోకస్ పెట్టింది. అధికార పార్టీ ప్రవేశపెట్టే బిల్లులను అక్కడ అడ్డుకోవాలని చూస్తుంది అని అంటున్నారు. మొత్తానికి వైసీపీ యాక్షన్ స్టార్ట్ అయ్యేది ఎపుడు అంటే క్యాలెండర్ లో ఇయర్ తిరగాల్సిందే అని అంటున్నారు. చూడాలి మరి వైసీపీ స్ట్రాటజీ మంచిదేనా అది వర్కౌట్ అవుతుందా లేక వైసీపీ మౌనాన్ని భగ్నం చేసే విధంగా కూటమి రాజకీయ దూకుడు ఉంటుందా అన్నది.

Tags:    

Similar News