బీజేపీకి బీపీ పెంచుతున్న ఎస్పీ...యూపీలో డైరెక్ట్ వార్ !

బీజేపీ ఆశలకు ఒక ప్రాంతీయ పార్టీ గండి పెడుతోంది అని అంటున్నారు.

Update: 2024-11-11 04:30 GMT

బీజేపీ ఆశలకు ఒక ప్రాంతీయ పార్టీ గండి పెడుతోంది అని అంటున్నారు. బీజేపీ పంచ ప్రాణాలు ఉత్తర ప్రదేశ్ అనే చెప్పాలి. ఆ మాటకు వస్తే కేంద్రంలో అధికారంలోకి రావాలని చూసే ప్రతీ రాజకీయ పార్టీకి గుండె కాయ లాంటిది యూపీ. దేశంలో 80 లోక్ సభ సీట్లు అక్కడే ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 272ని చేరుకోవాలంటే అందులో నాలుగవ వంతు సీట్లు ఒక్క యూపీ నుంచే తీసుకోవడం ద్వారా అధికారానికి దగ్గర దారులు వెతుక్కోవచ్చు.

బీజేపీ విషయం తీసుకుంటే 2014, 2019లలో అలాగే నూటికి ఎనభై శాతం ఎంపీ సీట్లు యూపీ నుంచి తీసుకుంది. కానీ 2024లో మాత్రం సీన్ రివర్స్ అయింది. మొత్తం 80 సీట్లలో బీజేపీకి 33 మాత్రమే దక్కాయి. అంతకు ముందు వచ్చిన 62 సీట్లలో సగానికి సగం అయ్యాయి. అదే 2019లో కేవలం 5 సీట్లు మాత్రమే వచ్చిన ఎస్పీ సీట్లు 37కి ఎగబాకాయి. కాంగ్రెస్ కి ఆరు ఎంపీ సీట్లు వచ్చాయి. ఇక ఓటు షేర్ తీసుకుంటే బీజేపీకి 41.37 శాతం వచ్చింది. ఎస్పీకి 33.59 ఓటు షేర్ దక్కింది. కాంగ్రెస్ కి 9.46 శాతం వచ్చింది. ఇండియా కూటమిగా తీసుకుంటే ఎన్డీయే కూటమితో పోటా పోటీగా ముందుకు వచ్చేశారు.

దాంతో బీజేపీకి కేంద్రంలో మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సరిపడా సీట్లు దక్కలేదు. ఏకంగా ముప్పయి ఎంపీ సీట్లలో కోత పడింది. మిత్రులతో కలసి మోడీ మూడవసారి ప్రధాని కావడానికి యూపీలో పడిన గండి ప్రధాన కారణం. అక్కడ ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కి నానాటికీ ఆదరణ పెరుగుతోంది. రెండు సార్లు అధికారంలోకి వచ్చిన యోగీ ఆదిత్యనాధ్ ప్రభుత్వం మీద యాంటీ ఇంకెంబెన్సీ కూడా ఎస్పీ ఘన విజయానికి కారణం అయింది అని అంటున్నారు.

దీంతో 2026లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా ఎస్పీ అధికారంలోకి వచ్చి అఖిలేష్ యాదవ్ సీఎం అవుతారని అంటున్నారు. ఆయన కనుక సీఎం అయితే 2029లో షెడ్యూల్ ప్రకారం జరిగే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి యూపీ నుంచి మరింత దెబ్బ పడుతుందని లెక్కలు ఉన్నాయి. దాంతో యూపీ అసెంబ్లీ ఎన్నికలను ముందే జరపకుండా జమిలి ఎన్నికల ప్రతిపాదనను తీసుకుని రావడం వెనక మాస్టర్ ప్లాన్ ఉందని అంటున్నారు.

అంటే 2027 మొదట్లో దేశంలో జమిలి ఎన్నికలకు తెర తీయడం ద్వారా యూపీలో కూడా అదే ఊపులో మరోసారి అధికారం దక్కించుకుని కేంద్రంలో నాలుగవ సారి గెలవాలన్నది బీజేపీ ఆలోచన అని అంటున్నారు. ఇక చూస్తే కనుక యూపీలో ఎస్పీని ఎలా కట్టడి చేయాలన్న ఒకే ఒక పొలిటికల్ మిషన్ తో బీజెపీ అక్కడ పనిచేస్తోంది.

గత నాలుగైదు నెలలుగా యూపీలో బీజేపీ ప్రభుత్వం ఎస్పీ విషయంలో చాలా గట్టిగానే టార్గెట్ చేస్తోంది అని అంటున్నారు. ఇదిలా ఉండగా లేటెస్ట్ గా యూపీ సీఎం ఆదిత్యనాధ్ అయితే ఎస్పీ మీద అఖిలేష్ యాదవ్ మీద గట్టిగా విరుచుకుని పడ్డారు.

ప్రతీ నేరస్తుడు ఎస్పీలోనే పుడుతున్నారని ఆయన తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు. నేరగాళ్లకు రేపిస్టులకు అఖిలేష్ యాదవ్ సీఈవో అని కూడా సంచలన కామెంట్స్ చేశారు. అంతే కాదు అఖిలేష్ యాదవ్ తరచూ చెప్పే పీడీపీ అంటే వెనకబడిన దళిత, అల్పసంఖాయ వర్గాలు కానే కాదని పీడీపీ అంటే ప్రోడక్షన్ హౌస్ ఆఫ్ దంగై ఆపరాధీ అని వ్యాఖ్యనించారు. అంటే నేరగాళ్ళు అపరాధులను తయారు చేసేది ఎస్పీ అని ఆయన దుయ్యబెట్టారు అన్న మాట.

యూపీలో కతేహరీ అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన ముఖ్యమంత్రి యోగి ఎస్పీ నేతలు నేరస్తులకు మద్దతుగా ఉంటున్నారు అని విమర్శించారు. ఆడపిల్లలు ఎస్పీ నేతలను చూస్తే భయపడుతున్నారని కూడా ఘాటు వ్యాఖ్యలే చేశారు. కేంద్రంలో యూపీలో ఉన్న బీజేపీ డబుల్ ఇంజర్ సర్కార్ నేరస్తుల ఆటకట్టిస్తుందని ఆయన స్పష్టం చేశారు. మొత్తానికి యూపీలో ఎస్పీని కట్టడి చేయడానికి బీజేపీ గట్టి పట్టుదలతో పనిచేస్తోంది అని అర్ధం అవుతోంది అంటున్నారు. మరి ఎస్పీ దీనికి పవర్ ఫుల్ రిటార్ట్ ని రెడీ చేసే ఉంటుంది. చూడాలి మరి యూపీ పాలిటిక్స్ ఏ మలుపు తిరుగుతుందో.

Tags:    

Similar News