వేడుకల్లో జగన్.. వీధుల్లో వైసీపీ నేతలు.. విషయం ఏంటంటే!
వైసీపీ అధినేత జగన్.. పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు. కానీ, ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలు మాత్రం వీధులకెక్కారు. చిత్రమైన ఈ ఘటన ఈ రోజే(శుక్రవారం) చోటు చేసుకుంది.
వైసీపీ అధినేత జగన్.. పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు. కానీ, ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలు మాత్రం వీధులకెక్కారు. చిత్రమైన ఈ ఘటన ఈ రోజే(శుక్రవారం) చోటు చేసుకుంది. పులివెందుల పర్యటనలో ఉన్న జగన్.. తన సతీమణితో కలిసి ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. దాదాపు రెండు గంటల పాటు అక్కడే ఉన్నారు. వధూవరులను ఆశీర్వదించారు. ఇతర వివాహాలకు వెళ్లినప్పుడు ఎలాంటి ఆహార పదార్థాలూ పుచ్చుకోని జగన్ దంపతులు ఈ వేడుకలో మాత్రం కొంత పుచ్చుకున్నారు.
ఇదిలా వుంటే, మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు మాత్రం రోడ్డెక్కారు. అన్ని జిల్లాల్లోనూ కాకపోయినా.. కొన్ని కొన్ని జిల్లాల్లో మాత్రం కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, రాస్తారోకోలకు పిలుపునిచ్చారు. ఆ మేరకు నాయకులు తమ తమ కార్యకర్తలతో కలిసి రోడ్డెక్కారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. విద్యుత్ చార్జీలను పెంచారని.. దీంతో ప్రజలు భారాలు మోయలేక పోతున్నారని ఆరోపిస్తూ ఈ నెల ప్రారంభంలోనే జగన్ ఈ ధర్నాలు, నిరసనలకు పిలుపునిచ్చారు.
దీంతో రాష్ట్రంలోని బలమైన ప్రాతినిధ్యం ఉన్న చోట్ల మాత్రమే ప్రస్తుతం నిరసనలు జరుగుతున్నాయి. పలువురు మాజీ మంత్రులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే.. నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చిన జగన్ మాత్రం.. వివాహ వేడుకలకు హాజరు కావడం మైనస్ అయింది. ఆయన నాయకత్వం వహించి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది. కానీ, జగన్ వేడుకలకు హాజరు అయినట్టు తెలియడంతో చాలా మంది నాయకులు ఏదో తూతూ.. మంత్రం అన్నట్టుగానే ఈ నిరసనలు నిర్వహించి ఇంటికి పోయారు.
ఈ నెలలో 21వ తేదీ నిర్వహించిన రైతు నిరసన సమయంలోనూ జగన్ ఇలానే చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను ధర్నాలు చేయాలని పిలుపునిచ్చిన ఆయన.. ఆ వెంటనే బెంగళూరుకు వెళ్లిపోయారు. ఇక, ఇప్పుడు కూడా వివాహ వేడుక అనంతరం.. బెంగళూరుకు వెళ్లేందుకు హెలికాప్టర్‌ను రెడీ చేసుకున్నారు. దీంతో చిత్తశుద్ధి లేని శివ పూజ మాదిరిగా జగన్ వ్యవహారం ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.