వివేకా కేసుపై మళ్లీ కోర్టుకు.. : వైఎస్ సునీత సెన్సేషన్
తన తండ్రి హత్య కేసుపై ఆరు నెలలులోగా విచారణ పూర్తి చేయాలని సీబీఐ కోర్టును ఆదేశించాలని కోరుతూ సునీత పిటిషన్ దాఖలు చేశారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో విచారణ జాప్యంపై వైఎస్ సునీత మరోమారు కోర్టును ఆశ్రయించారు. విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందని, ఈ కేసుపై సీబీఐ కోర్టుకు సమర్పించిన హార్డ్ డిస్కులో దాదాపు 13 లక్షల ఫైళ్లు ఉంటే ఇప్పటివరకు కేవలం 13 వేల ఫైళ్లు మాత్రమే ఓపెన్ చేశారని ఆమె కోర్టుకు విన్నవించారు. వివేకా కేసును త్వరతగతిన విచారణ జరగాలని సీబీఐ కోర్టును ఆదేశించాలని కోరుతూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు.
తన తండ్రి హత్య కేసుపై ఆరు నెలలులోగా విచారణ పూర్తి చేయాలని సీబీఐ కోర్టును ఆదేశించాలని కోరుతూ సునీత పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషనులో అనేక విషయాలను ఆమె ప్రస్తావించారు. కేసు విచారణలో చోటుచేసుకుంటున్న పరిణామాలను కోర్టుకు నివేదించారు. ఈ పిటిషనుకు సీబీఐతోపాటు నిందితులను ప్రతివాదులుగా గుర్తించి నోటీసులు జారీ చేయాలని కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కేసు హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ అయి రెండేళ్లు దాటినా ఇంకా సీఆర్పీసీ 207 దశలోనే ఉందని తెలిపారు.
అంతేకాకుండా కేసులో సాక్షిగా ఉన్న వైఎస్ అభిషేక్ రెడ్డి మరణించిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. కాగా, సునీత తరపు లాయర్ వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. కేసులో నిందితులకు నోటీసులిస్తే ఏం ప్రయోజనమని ప్రశ్నించింది. నిందితులు ట్రయల్ కు సహకరిస్తున్నామని చెబుతారని పేర్కొంది. దీంతో ఈ పిటీషన్ పై తుది విచారణను ఫిబ్రవరి 4వ తేదీకి వాయిదా వేసింది.