ఏపీ అసెంబ్లీకి వివేకా కుమార్తె సునీత... ఎందుకో తెలుసా?
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత రెడ్డి ఏపీ అసెంబ్లీకి వెళ్లారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత రెడ్డి ఏపీ అసెంబ్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా... హోంమంత్రి వంగలపూడి అనితతో ఆమె భేటీ అయ్యారని తెలుస్తోంది. ఈ భేటీలో వివేకానందరెడ్డి హత్య కేసుపై చర్చించారని తెలుస్తోంది. ఇదే సమయంలో అమె సీఎంవో అధికారులతోనూ భేటీ అయారు. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
అవును... తాజాగా ఏపీ అసెంబ్లీకి వెళ్లారు సునీత. ఈ సందర్భంగా.. సీఎం కార్యాలయానికి వచ్చిన ఆమె.. సీఎంవో అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తన తండ్రి హత్య కేసులో పురోగతిపై చర్చించారని సమాచారం. ఇదే క్రమంలో.. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి.. జైలు అధికారులకు రాసిన లేఖలపై ప్రభుత్వం స్పందించాలని కోరారని అంటున్నారు.
అదేవిధంగా... సుప్రీంకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అఫిడవిట్ వేయడంతోపాటు.. ఈ కేసు దర్యాప్తులో పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారని తెలుస్తోంది. ఈ సందర్భంగా... తన తండ్రి హత్యకేసులో నిజమైన దోషులను శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినట్లు చెబుతున్నారు.
ఈ విధంగా వైఎస్ వివేకా హత్యకేసుకు సంబంధించి మరికొన్ని కీలక పరిణామాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా.. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది! మరోపక్క వివేకా పీఏ కృష్ణారెడ్డి దాఖలు చేసిన ఫిర్యాదుతో సునీత, రాజశేఖర్ రెడ్డి, సీబీఐ ఎస్పీ రాంసింగ్ పై నమోదైన కేసులో కూడా విచారణ వేగవంతం అయ్యింది.
ఈ మేరకు ఈ కేసు తదుపరి విచారణను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఫిబ్రవరి 24కి వాయిదా వేసింది. ఈ విధంగా... వైఎస్ వివేకా హత్య కేసులో వరుసగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి!