సీమ బెల్టులో వైసీపీ జోరు.. కూటమికి బేజారు!
రాష్ట్ర వ్యాప్తంగా తమకు అనుకూల పవనాలు వీస్తున్నాయని.. కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ లు చెబుతున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా తమకు అనుకూల పవనాలు వీస్తున్నాయని.. కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ లు చెబుతున్నాయి. అయితే.. క్షేత్రస్థాయిలో ఒకింత పర్యటించి చూస్తే.. వాస్తవాల వెలుగు రేఖలు ప్రస రించేలా చేస్తే.. వాస్తవం ఏంటనేది తెలుస్తుంది. కోస్తా, ఉత్తరాంధ్ర పరిస్థితి ఎలా ఉన్నా.. రాయలసీమ బెల్ట్‌లో మాత్రం కూటమి జోరు పెద్దగా కనిపించకపోగా.. నాయకుల మధ్య సమన్వయ లోపం.. పార్టీలో లుకలుకలు.. ప్రాధాన్యం సహా టికెట్లు దక్కలేదన్న అసంతృప్తి వంటివి.. కూటమిని బేజారయ్యేలా చేస్తున్నాయి.
ఇదేసమయంలో వైసీపీ దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. ఉమ్మడి జిల్లాల్లో సీట్లను పరిశీలిస్తే.. ఒక్క గ్రేటర్ సీమలోనే 64 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో గత ఎన్నికల్లో టీడీపీ 3 స్థానాలు మాత్రమే దక్కించుకుంది. మిగిలిన 61 సీట్లు కూడా.. వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు పరిస్థితిని గమనిస్తే.. కూటమి పార్టీల మధ్య సమన్వయం ఉండి ఉంటే.. ఈ 64 లో కనీసం 40 సీట్లు దక్కించుకునే అవకాశం ఉంటుంది. కానీ, అలాంటి పరిస్థితి ఊహించేందుకు కూడా లేదు.
ఎందుకంటే.. అన్ని నియోజకవర్గాల్లోనూ అసంతృప్తులు కనిపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి ఆశిం చారు.కానీ, వారికి అనుకున్నట్టుగా జరగలేదు. దీంతో ఎక్కడికక్కడ నాయకులు రెబల్స్‌గా మారిపోయారు. పైకి మౌనంగా ఉన్నారు. లోలోన మథన పడుతున్నారు. అనంతపురం ఎంపీ స్థానంలో జేసీ కుటుంబ సహకారం మచ్చుకు కూడా కనిపించడం లేదు. అనంతపురం అర్బన్‌లో వైకుంఠం పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఇక, కుప్పంలో పరిస్థితి నానా గందరగోళంగా ఉంది. అనేక సర్వేలు కూడా.. ఇక్కట ఫైట్ అత్యంత టఫ్ అనే తేల్చేశాయి.
ఉమ్మడి అనంతపురంలో ఒక్క హిందూపురంలో తప్ప.. ఎక్కడా టీడీపీ పరిస్థితి బాగోలేదనే సంకేతాలు వస్తున్నాయి. కర్నూలులో నాయకుల మధ్య సఖ్యత లేకపోగా.. నంద్యాల, పాణ్యం, శ్రీశైలం, ఎమ్మిగనూ రులో టీడీపీరెబల్స్ నామినేషన్లు వేసేందుకు రెడీ అవుతున్నారు. చిత్తూరులో నగరి నియోజకవర్గం గెలుస్తారని అంటున్నా.. గాలి భాను ప్రకాశ్ గ్రాఫ్ మాత్రం పడిపోతోంది. ఇది మరింత మైనస్ అయింది. అదేవిధంగా తిరుపతిలో కూటమి గెలిచే అవకాశమే లేదు. చిత్తూరులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సత్యవేడులో గెలుపు కంటే.. కనీసం డిపాజిట్ దక్కించుకుంటే బెటర్ అంటున్నారు. ఇలా.. మొత్తంగా సీమలో కూటమి బేజారయ్యే పరిస్థితిలో ఉండడం గమనార్హం.