జగన్ గోదావరి మంత్రాంగం...!

గోదావరి జిల్లాలలో రాజకీయంగా ఇబ్బందులు ఏర్పడకుండా జగన్ సరికొత్త మంత్రాంగాన్ని రచిస్తున్నారు

Update: 2023-12-21 17:20 GMT

గోదావరి జిల్లాలలో రాజకీయంగా ఇబ్బందులు ఏర్పడకుండా జగన్ సరికొత్త మంత్రాంగాన్ని రచిస్తున్నారు. గోదావరి జిల్లాలలో కాపుల ప్రభావం ఎలా ఉంటుంది అన్నది బయటకు తెలియడంలేదు. టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నాయి. దాంతో కాపులు 2014 మాదిరిగా ఈ కూటమి వైపు మొగ్గు చూపుతారా అన్నది ఒక కీలకమైన చర్చగా ఉంది.

పవన్ కళ్యాణ్ పదేళ్ళ తరువాత అయినా సీఎం అభ్యర్ధిగా రావడంలేదు. ఇది ఒక మెయిన్ పాయింట్. అదే సమయంలో ఎక్కువ సీట్లకు జనసేన పోటీ చేయకపోతే జూనియర్ పార్టనర్ గా టీడీపీ జమ కట్టడం కాదు జనాలే అనుకుంటారు. అపుడు బలమైన సామాజిక వర్గం రియాక్షన్ ఎలా ఉంటుంది అన్నది కూడా చూడాల్సి ఉంది.

ఇవన్నీ పక్కన పెడితే జనసేన టీడీపీ పొత్తుని మాత్రం సీరియస్ గానే వైసీపీ చూస్తోంది. అటు నుంచి ఇటు అయినా కూడా ఏ మాత్రం పొలిటికల్ ట్రబుల్ ఇవ్వకుండా చూసుకునేందుకు వైసీపీ అధినాయకత్వం గోదావరి జిల్లాలను గట్టిగానే టార్గెట్ చేసింది. ఈ జిల్లాలలో కాపులతో పాటు బీసీలు, ఎస్సీ ఎస్టీలు ఎక్కువే. దాంతో ఈ వర్గాలను తమ వైపునకు తిప్పుకోవడం ద్వారా 2019 నాటి మ్యాజిక్ ని రిపీట్ చేయాలని జగన్ భావిస్తున్నారు.

అందుకే మంత్రులుగా ఉన్న వారిని ఎంపీలుగా పంపుతున్నారు. అలాగే ఎంపీలుగా ఉన్న వారిని ఎమ్మెల్యేలను చేస్తున్నారు. కొందరు మంత్రులను తీసుకుని వచ్చి కీలకమైన నియోజకవర్గాలలో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలా చూస్తే కనుక రామచంద్రాపురం నుంచి మంత్రిగా ఉన్న వేణు గోపాల క్రిష్ణని రాజమండ్రి రూరల్ కి పంపుతున్నట్లుగా తెలుస్తోంది.

ఇదే విషయం నిన్నటిదాకా ప్రచారంగా ఉండగా మంత్రి వేణు మాత్రం అదే నిజం అని అంటున్నారు. తనను జగన్ రాజమండ్రి రూరల్ కి వెళ్లమన్నారు అని అంటున్నారు. ఆయన ఆదేశం మేరకు అక్కడ నుంచి 2024 ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లుగా ప్రకటించారు.

ఇక రామచంద్రాపురంలో మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కి మంత్రి వేణుకు మధ్య విభేదాలు ఉన్నాయని అంటారు. ఆ మధ్య దీని మీద రచ్చ సాగింది. దాంతో జగన్ అపుడు సర్దుబాటు చేశారు. ఇపుడు ఆ సీటుని పిల్లి ఫ్యామిలీకే ఇస్తున్నారు. మంత్రి వేణు రాజమండ్రికి వెళ్తున్నారు. ఇక రాజమండ్రి అర్బన్ నుంచి ఎంపీ భరత్ పోటీ చేయనున్నారు. అంటే ఇద్దరు బీసీలు రెండు సీట్లలో పోటీ పడతారు అన్న మాట.

అలాగే కాపులలో బలంగా ఉన్న నేతలను కూడా అటూ ఇటూ మార్చడం ద్వారా గెలుపు సొంతం చేసుకునే ప్రయత్నం వైసీపీ చేస్తోంది. అదే విధంగా పిఠాపురం నుంచి కాకినాడ ఎంపీ వంగా గీత పోటీ చేయనున్నారు అని అంటున్నారు. దాంతో పాటుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి కురసాల కన్నబాబుని కాకినాడ ఎంపీ సీటుకు పోటీ చేయమని కోరుతారు అని అంటున్నారు.

ఇక ఎమ్మెల్యేలుగా బాగా ఫ్యామస్ అయిన వారిని ఎంపీలుగా పంపుతోంది. అలా రాజోలు ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ ని అమలాపురం ఎంపీగా పంపాలని చూస్తోంది. మొత్తం మీద చాలా సీట్లలో బీసీలకు ఇతర వర్గాలకు పెద్ద పీట వేయడం ద్వారా గోదావరిలో ఫ్యాన్ గిర్రున తిరిగేలా వైసీపీ తన రాజకీయ చాకచక్యం ప్రదర్శిస్తోంది అని అంటున్నారు.

Tags:    

Similar News