జగన్ ఏం తప్పు చేశారు.. కాపుల మాట...!
అయితే.. ఇప్పుడు ఈ ఓటు బ్యాంకును జనసేన ఒడిసి పట్టుకుని.. తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తోంది
రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం చుట్టూ ఇప్పుడు రాజకీయాలు వేడెక్కాయి. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా.. కాపుల ఓటు ఎటు? ఎవరికి పడుతుంది? అనే మాటే చర్చిస్తున్నారు. ఈ క్రమంలో వారి ఓటు బ్యాంకు.. తదితర విషయాలు కూడా ఆసక్తిగా మారాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 15 శాతం కాపుల ఓటు బ్యాంకు ఉంద ని ఒక అంచనా. అయితే.. ఇది పెరగొచ్చు. లేదా స్వల్పంగా తరగనూ వచ్చు. గత ఎన్నికల్లో వైసీపికి అనుకూలంగా కాపులు నిలబడ్డారనేది ప్రధాన చర్చ.
అయితే.. ఇప్పుడు ఈ ఓటు బ్యాంకును జనసేన ఒడిసి పట్టుకుని.. తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. కానీ, నేరుగా ఎక్కడా కూడా పేరు చెప్పి మాత్రం ఓట్లు కోరడం లేదు. వైసీపీ ప్రభుత్వం కాపులకు అన్యాయం చేసిందని.. పెద్ద ఎత్తున అంతర్గత చర్చల్లో దుయ్యబడుతున్నారు. కాపులు సంఘటితం కావాలని.. గ్రామ స్థాయిలో వైసీపీని తిరిగి ఇంటికి పంపించాలని చర్చిస్తున్నారు. అయితే.. వాస్తవానికి వైసీపీని దోషిగా చూడలేమని అంటున్నారు కాపు మేధావులు.
2019 ఎన్నికలకు ముందు.. కాపుల రిజర్వేషన్ విషయం రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. ఈ క్రమంలో ఆనాటి రిజర్వేషన్ కల్పించే డిమాండ్‌పై ఇతర పార్టీల మాట ఎలా ఉన్నా.. వైసీపీ అధినేత జగన్ కుండబద్దలు కొట్టి మరీ చెప్పారని.. తాము చేయలేమన్నారని.. కేంద్రం పరిధిలోని విషయంలో తాను జోక్యం చేసుకునేది లేదని చెప్పారని మేధావులు గుర్తు చేస్తున్నారు. అయితే.. కాపులకు ఉపశమనంగా .. కాపు కార్పొరేషన్‌కు రూ.100 కోట్లు కేటాయిస్తానని చెప్పిన మాటను నిలబెట్టుకున్నారని కూడా చెబుతున్నారు.
కాబట్టి.. వైసీపీని తప్పుబట్టాల్సిన అవసరం లేదని అంటున్నారు. అదేసమయంలో మంత్రి వర్గంలోనూ కాపులకు ప్రాధాన్యం ఇచ్చిన విషయాన్ని కాపులు గుర్తు చేస్తున్నారు. ''జగన్ ఏం తప్పు చేశారు. మాకు ఇస్తామన్నదే ఇచ్చారు. ఇవ్వలేని దాన్ని.. ఆయన చేతుల్లో లేని దాన్ని ఇవ్వలేమనే చెప్పారు. మాయ మాటలు చెప్పి.. మాతో ఓట్లు వేయించుకోలేదు కదా! ఇతరులకు అందుతున్న వాటిలో ఎన్నో పథకాలు మా వోళ్లకు కూడా అందుతున్నాయి. ఇది చాలదా!'' అని తూర్పు గోదావరికి చెందిన ఒక మేధావి వ్యాఖ్యానించడం గమనార్హం.