హాట్ టాపిక్... సినీనటుడు ఆలీని జగన్ ఢిల్లీకి పంపుతున్నారా?
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న సమయంలో రాజ్యసభ సభ్యుల టాపిక్ తెరపైకి వచ్చింది
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న సమయంలో రాజ్యసభ సభ్యుల టాపిక్ తెరపైకి వచ్చింది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జ్ లను మారుస్తున్న జగన్... ఎమ్మెల్యే టిక్కెట్ దక్కనివారికి ఎమ్మెల్సీ, రాజ్యసభ మొదలైన హామీలు ఇస్తున్నారని అంటున్నారు. వైనాట్ 175 లక్ష్యంగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో గెలుపు గుర్రాలకు టిక్కెట్లు ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్చిలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి.
అవును... వచ్చే ఏడాది మార్చిలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో అధికార వైసీపీకి మూడు సీట్లు దక్కనున్నాయి! ఈ సమయంలో జగన్ ఎవరిని ఎంపిక చేయబోతున్నారనేది ఆసక్తిగా మారింది. వాస్తవానికి వచ్చే ఏప్రిల్ లో 55 మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో వారిలో ముగ్గురు ఏపీకి చెందిన సభ్యులు ఉన్నారు.
ఇందులో భాగంగా... వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నుంచి కనకమేడల రవీంద్ర బాబు, బీజేపీ నుంచి సీఎం రమేష్ ల పదవీ కాలం ముగియనుంది. ఈ సమయంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయడం కన్ ఫాం అని అంటున్నారు. ఇదే సమయంలో ఇప్పటికే నెల్లూరు జిల్లాకు చెందిన విజయ సాయిరెడ్డి, బీదా మస్తాన రావు వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు.
అయితే... వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్థానంలో అదే సామాజికవర్గానికి చెందిన వైవీ సుబ్బారెడ్డిని ఎంపిక చేస్తారని అంటున్నారు. ప్రస్తుతం వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న వైవీ సుబ్బారెడ్డికి ఈ మేరకు జగన్ నుంచి హామీ దక్కిందని అంటున్నారు. ఇక మరో ఇద్దరు అభ్యర్దులను వైసీపీ ఖరారు చేయాల్సి ఉంది. వీటిలో ఒక స్థానం మైనార్టీ వర్గానికి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగా... మైనార్టీ కోటాలో సినీ నటుడు ఆలీకి ఈసారి రాజ్యసభ సీటు ఖాయమని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఇలా ఒక సీటు రెడ్డి సామాజికవర్గానికి, మరో టిక్కెట్ ను మైనారిటీకి కేటాయించిన అనంతరం మూడో సభ్యుడిగా ప్రస్తుత పోలవరం ఎమ్మెల్యే బాలరాజును ఎంపిక చేసే అవకాశాలున్నాయని తెలుస్తుంది. అంటే... మూడో సీటు ఎస్టీ స్థానానికి జగన్ ఇవ్వబోతున్నారన్నమాట.
అయితే ప్రస్తుతం ప్రచారం జరుగుతున్నట్లు వీరి ముగ్గిరికే ఫైనల్ అయ్యే అవకాశం ఉందా.. లేక, మారుతున్న సమీకరణాల నేపథ్యంలో జగన్ మరో ఆలోచన చేసే అవకాశం ఉందా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. దీంతో... రాజ్యసభలో వైసీపీ బలం 11కి చేరబోతుంది!!
కాగా ఇప్పటికే విజయసాయిరెడ్డి, ఆర్ కృష్ణయ్య, ఎస్ నిరంజన్ రెడ్డి, బీద మస్తాన్ రావు, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పరిమల్ నత్వానీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలో వస్తున్న ఊహాగాణాల నేపథ్యలో సినీనటుడు ఆలీ, పోలవరం ఎమ్మెల్యే బాలరాజు ఎంపికయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.