పోలవరం వేదికగా జగన్ వర్సెస్ చంద్రబాబు

పోలవరం ప్రాజెక్ట్ తన బిడ్డ అని ఈ మధ్యనే టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.

Update: 2023-08-07 00:30 GMT

పోలవరం ప్రాజెక్ట్ తన బిడ్డ అని ఈ మధ్యనే టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. దానికి జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వెంటనే కౌంటర్ ఇచ్చెశారు. నీవు కన్న కల కాదుగా పోలవరం అని రిటార్ట్ వేశారు. పోలవరం వైఎస్సార్ మానస పుత్రిక అని ఎలుగెత్తి చాటారు.

అయితే 2014 నుంచి 2019 మధ్యలో పోలవరం ప్రాజెక్ట్ పనులు తన హయాంలో ఊపందుకున్నాయని చంద్రబాబు క్లెయిం చేసుకుంటున్నారు. తాను ఉండగా వేగంగా సాగిన పనులను వైసీపీ నాలుగేళ్ల పాలనలో పక్కన పడేసింది అని కూడా ఆయన ఆరోపించారు. ప్రతీ సోమవారం పోలవరం అంటూ చంద్రబాబు హయాంలో ప్రాజెక్ట్ సందర్శన ఉండేది.

ఇంచుమించుగా డెబ్బై శాతం పైగా పనులు తమ హయాంలో చేపట్టామని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే ప్రాజెక్టుల సందర్శన పేరిట చంద్రబాబు ఈ నెల 1 నుంచి చేపట్టిన కార్యక్రమం ఇపుడు కోస్తా జిల్లాలను దాటుకుని ఉభయ గోదావరి జిల్లాల వైపుగా సాగనుంది. పోలవరం ప్రాజెక్ట్ ని చంద్రబాబు సందర్శించాలని భావిస్తున్నారు

మిగిలిన ప్రాజెక్టులను ఆయన స్వయంగా చూసినా అక్కడ మాట్లాడినా ఓకే కానీ పోలవరం ప్రాజెక్ట్ విషయంలో మాత్రం అలా కుదిరే అవకాశం అయితే కనిపించడంలేదు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ ని సందర్శించాలంటే ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది.

అందుకోసం టీడీపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. చంద్రబాబు సందర్శన కోసం అనుమతులు ఇవ్వాలని కోరింది. అయితే చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన తరువాత టోన్ పెంచేశారు. ఆయన భాషలో దూకుడు పెరిగింది. ఆయన కడప జిల్లా పులివెందులలో రాజకీయంగా బిగ్ సౌండ్ చేశారు.

ఆ మీదట పుంగనూరు ఘర్షణ ఉండనే ఉంది. అది ఎంతటి రాజకీయ రచ్చకు దారి తీసిందో చెప్పాల్సిన పని లేదు. ఒక వైపు ప్రభుత్వాన్ని చెడుగుడు ఆడుతూ చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన చేస్తున్నారు. ఆ విధంగా ఆయన రైతాంగానికి చేరువ కావాలని చూస్తున్నారు. ఒక విధంగా ఇది రాజకీయ దండ యాత్రగానే వైసీపీ చూస్తోంది.

అలంటపుడు వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు పోలవరం సందర్శనకు అనుమతి ఇస్తుందా అన్నది ఇపుడు పెద్ద ఎత్తున చర్చకు తావిస్తోంది. చంద్రబాబు పోలవరం సందర్శనకు అనుమతులు ఇవ్వకపోతే ఏమి చేస్తారు అన్నది కూడా ఆసక్తికరంగా ఉంది. ఈ విషయంలో టీడీపీ వెనక్కి తగ్గేది లేదు అన్నట్లుగా ఉంది.

ఆ మధ్యన మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సారధ్యంలో టీడీపీ నేతలు పోలవరం ప్రాజెక్ట్ చూస్తామంటే కూడా అనుమతిని ఇవ్వలేదు. అలాగే వామపక్షాలకు కూడా అవకాశం దక్కలేదు. పోలవరం విషయంలో ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం వ్యవహరిస్తోంది అని వైసీపీ నేతలు అంటున్నారు దాన్ని రాజకీయ వేదికగా మార్చుకుంటామంటే కుదిరేది లేదని అంటున్నారు.

మరి ఇపుడు చూస్తే చంద్రబాబు పోలవరం వెళ్తాను అని గట్టిగా పట్టుదల మీద ఉన్నారు. ఆయనకు అనుమతులు ఇవ్వకపోతే తంటానే అని అంటున్నారు. అది రాజకీయ మంటను కూడా పెట్టే అవకాశం ఉంది. తెలుగుదేశానికి ఎటూ ప్రభుత్వం అనుమతి ఇవ్వదు అని అంటున్నారు. దాని మీద న్యాయ పోరాటం చేసి అయినా పోలవరం ప్రాజెక్టుని చంద్రబాబు చూసి తీరుతారు అని అంటున్నాయి పార్టీ వర్గాలు.

మొత్తానికి చూస్తే పోలవరం వేదికగా చంద్రబాబు జగన్ ల మధ్య మరో మారు రాజకీయ సమరం సాగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. పోలవరం ప్రాజెక్టుకు ప్రభుత్వం అనుమతించినా లేకపోయినా ఇది రాజకీయ యుధ్దానికే దారి తీస్తుందని అంటున్నారు. రానున్న కొద్ది రోజులలోనే ఇది ఏపీ రాజకీయాలను వేడెక్కించనుంది అంటున్నారు.

Tags:    

Similar News