ఎన్టీఆర్ సీఎం...వైఎస్సార్ విపక్ష నేత !

వైఎస్సార్ చిన్న వయసులోనే పీసీసీ చీఫ్ అయ్యారు. అలాగే ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గా వ్యవహరించారు

Update: 2024-07-08 03:51 GMT

వైఎస్సార్ చిన్న వయసులోనే పీసీసీ చీఫ్ అయ్యారు. అలాగే ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గా వ్యవహరించారు. అవి ఎన్టీఆర్ ప్రభంజనం సాగుతున్న రోజులు. సీనియర్లు అంతా వెనక్కి తగ్గిన నేపథ్యంలో కేవలం 33 ఏళ్లకే పీసీసీ చీఫ్ పదవి వైఎస్సార్ ని వరించింది. అలా ఆయన ఎన్టీఆర్ టీడీపీ మీద తనదైన శైలిలో పోరాటాలు చేశారు. ఉమ్మడి ఏపీకి మధ్యంతర ఎన్నికలు 1985లో వచ్చాయి. ఆ సమయంలో వైఎస్సార్ మూడవసారి పులివెందుల నుంచి గెలిచి వచ్చారు. దాంతో ఆయనను ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ హై కమాండ్ చేసింది.

ఆ సమయంలో ఎన్టీఆర్ పాలన మీద వైఎస్సార్ దూకుడుగా ఉద్యమాలు చేశారు. రాయలసీమ కరవు మీద అలాగే తాగు సాగు నీటి కోసం ఆయన చేసిన పోరాటాలు సంచలనంగా మారాయి. ఒక సందర్భంలో సచివాలయానికి నాటి సీఎం ఎన్టీఆర్ వెళ్లకుండా బైఠాయిస్తూ వైఎస్సార్ నాయకత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన ఆందోళన ఒక హైలెట్ గా నిలిచింది.

అయితే ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూడా ఆ సందర్భంలో ఎక్కడా తగ్గలేదు. ఆయన తనను సచివాలయానికి వెళ్లనీయకుంటే రోడ్డు మీదనే కూర్చుంటాను అని అక్కడే కాంగ్రెస్ ఆందోళనకు ఎదురుగా కూర్చుని సంచలనం రేపారు. అలా ఎన్టీఆర్ సీఎం గా వైఎస్సార్ ప్రతిపక్ష నాయకుడిగా ఎవరూ తగ్గేవారు కాదు.

అసెంబ్లీలో సైతం చర్చలు ఆనాడు వేడెక్కేలా సాగేవి. వైఎస్సార్ ఎన్టీఆర్ ఇద్దరూ ముక్కుసూటి కలిగిన వారే. అలాగే పట్టుదలకు పేరు గడించిన వారే కావడంతో ఇద్దరి రాజకీయమూ ఆ రోజులలో ఒక ఆసక్తికరమైన చర్చకు దారి తీసేది. ఆరు పదులు దాటిన ఎన్టీఆర్ తో మూడున్నర పదుల వైఎస్సార్ చేసిన రాజకీయ పోరాటంలో ప్రతీ రోజూ రసవత్తరంగా ఉండేది.

ప్రజా పోరాటాలతో అలా కాంగ్రెస్ కి వైఎస్సార్ కొత్త ఊపిరులూదారు. కాంగ్రెస్ కి నాడు బలమైన యువ నాయకత్వాన్ని అందించి టీడీపీ ప్రభంజనంలో ఎన్టీఆర్ సమ్మోహన శక్తి ముందు ఏమీ కాదనుకున్న కాంగ్రెస్ కి కొత్త జవసత్వాలు అందించారు. అలా 1989లో కాంగ్రెస్ అఖండ విజయం సాధించడం వెనక వైఎస్సార్ కృషి ఎంతో ఉంది అని అంతా ఒప్పుకుంటారు.

అయితే వైఎస్సార్ హవా అంతా రాజీవ్ గాంధీ కేంద్రంలో ఉండగా బాగా సాగింది. ఆయన మరణానంతరం మాత్రం కొన్నాళ్ళ పాటు ఆయన రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వచ్చింది. అయితే మళ్లీ ఆయన సోనియా గాంధీ ప్రోత్సాహంతో తనదైన దూకుడు సాగించారు. అలా చివరికి సీఎం అయి తన కోరికను తీర్చుకున్నారు .

Tags:    

Similar News