వైఎస్సార్‌ పై పుస్తకం.. కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరినీ పిలవలేదే!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.

Update: 2023-09-03 09:27 GMT

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఫీజు రీయింబర్స్‌ మెంట్, ఆరోగ్యశ్రీ, 108, 104, రైతులకు ఉచిత విద్యుత్‌ ఇలా ఎన్నో పథకాల ద్వారా ఆయన గొప్ప సీఎంల్లో ఒకరిగా నిలిచిపోయారు. ఆయన కన్నుమూసి 14 ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఆయనను కాంగ్రెస్‌ తలచుకుంటూనే ఉంది.

ఇక వైసీపీ అయితే వైఎస్సార్‌ లక్ష్యాల సాధనకే తమ పార్టీని ఏర్పాటు చేశామని.. రాజన్న రాజ్యం తెస్తామని చెబుతోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ 2న వైఎస్సార్‌ వర్ధంతిని పురస్కరించుకుని అటు కాంగ్రెస్, ఇటు వైసీపీ భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాయి. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ కుమారుడే కాబట్టి ఆ పార్టీ కార్యక్రమాలను పెద్దగా పట్టించుకోకున్నా కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాన్ని మాత్రం పట్టించుకోవాల్సిందే.

అందులోనూ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం చాలా దగ్గరలో ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌ కు ప్రజల్లో ఉన్న మాస్‌ ఇమేజ్‌ ను క్యాష్‌ చేసుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ పలు కార్యక్రమాలు నిర్వహించింది.

ఇందులో భాగంగా తెలంగాణలో వైఎస్సార్‌ వర్ధంతిని పురస్కరించుకుని పలువురు కాంగ్రెస్‌ నేతలు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్సార్‌ సేవలను తలచుకున్నారు. మరోవైపు ‘రైతే రాజైతే’ పుస్తకాన్ని మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ ఆవిష్కరించారు. వైఎస్సార్‌ కు అత్యంత సన్నిహితులైన కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి నేతృత్వంలో ఈ పుస్తకం రూపుదిద్దుకుంది.

హైదరాబాద్‌ లో జరిగిన పుస్తక ఆవిష్కరణకు ఏపీ, తెలంగాణ పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, రేవంత్‌ రెడ్డి సైతం హాజరయ్యారు. అలాగే ప్రముఖ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్, సీఐపీ జాతీయ కార్యదర్శి నారాయణ వంటి వారిని కూడా పిలిచారు.

అయితే ఇంతమందిని పిలిచీ వైఎస్సార్‌ కుటుంబ సభ్యుల్లో ఒక్కరినీ పిలవకపోవడం హాట్‌ టాపిక్‌ గా మారింది. వైఎస్‌ జగన్‌ అంటే వైసీపీ పార్టీ పెట్టుకున్నారు. ఆయన్నీ పిలవకపోయినా వైఎస్సార్‌ సతీమణి విజయమ్మ ప్రస్తుతం హైదరాబాద్‌ లోనే తన కుమార్తె షర్మిల వద్దే ఉంటున్నారు. కనీసం ఆమెను కూడా పిలవలేదు.

ఇక వైఎస్సార్‌ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసిన షర్మిల తెలంగాణలోనే రాజకీయం చేస్తున్నారు. తన పార్టీని విలీనం చేయడానికి కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీతోనూ సంప్రదింపులు జరిపి వచ్చారు. రేపో మారో ఆమె పార్టీ విలీనం ఉండొచ్చని అంటున్నారు. అలాంటిది కనీసం షర్మిలనూ పుస్తక ఆవిష్కరణకు పిలవలేదు. ఇప్పుడీ వ్యవహారం హాట్‌ టాపిక్‌ గా మారింది.

Tags:    

Similar News