లడ్డూపై వివాదంలో హైకోర్టుకు వైసీపీ!!
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని.. జంతువుల కొవ్వు వాడారంటూ విమర్శలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని.. జంతువుల కొవ్వు వాడారంటూ విమర్శలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. సాక్ష్యాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విషయంపై బహిరంగంగా స్పందించడంతో వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. బాధ్యులపై కఠిన చర్యలకు సిద్ధం అని అటు చంద్రబాబు, ఇటు పవన్ కల్యాణ్ లు ప్రకటించారు.
మరోపక్క ఈ ఆరోపణలపై వైసీపీ నేతలు సీరియస్ గా స్పందిస్తున్నారు. ఈ సమయంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ల పర్వం నడుస్తుంది. దీనిపై స్పందించిన టీటీడీ మాజీ చైర్మన్ భూమ కరుణాకర్ రెడ్డి... స్వామివారి లడ్డూని వాడుకుని రాజకీయం చేద్దామనుకున్న చంద్రబాబు ప్రయత్నం బెడిసి కొట్టిందని అన్నారు.
ఇదే సమయంలో తమపై వేసిన ఈ అపవాదు విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమని భూమన ప్రకటించారు. టీటీడీ ఈవో శ్యామల రావు.. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఎడిడబుల్ ఆయిల్ ఉందని జూలై 17న స్పష్టంగ చెప్పారని.. అయినప్పటికీ ప్రత్యర్థి పార్టీని దెబ్బ తీయాలనే ఉద్దేశ్యంతో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
ఈ సందర్భంగా... చంద్రబాబు సర్కార్ కు తాము ఛాలెంజ్ చేస్తున్నామని.. తమ మీద పడిన అపవాదుపై విచారణకు సిద్ధంగా ఉన్నామని.. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని.. అవసరమైతే సుప్రీంకోర్టు జడితో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమయంలో వైసీపీ కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.
అవును... గత రెండు మూడు రోజులుగా గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ అపవిత్రమైందని.. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి, జంతువుల కొవ్వు వాడారంటూ జరుగుతున్న ప్రచారంపై వైసీపీ సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. ఈ మేరకు హైకోర్టును ఆశ్రయించనుందని అంటున్నారు.
తిరుమల స్వామివారి లడ్డూపై జరుగుతున్న వివాదంపై హైకోర్టును ఆశ్రయించనుందని తెలుస్తోంది. లడ్డూ విషయంలో కావాలనే తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ లం మోషన్ పిటిషన్ దాఖలు చేయనుందని అంటున్నారు. దీంతో... లడ్డూపై ఆరోపణల విషయాన్ని వైసీపీ చాలా తీవ్రంగానే పరిగణిస్తుందని అంటున్నారు పరిశీలకులు.