గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల లెక్క తేలనుందా ?

అయితే కూటమి అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు పూర్తి అయినా సచివాలయ ఉద్యోగుల విషయంలో చర్యలు అయితే పెద్దగా తీసుకోలేకపోయింది.

Update: 2025-02-17 04:05 GMT

వైసీపీ అధికారంలో ఉన్నపుడు లక్షా పాతిక వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు అని ఇచ్చారు. అయితే వారు కాంట్రాక్టు ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది కంటే ఒక మెట్టు పైన ఉన్నారేమో కానీ ప్రభుత్వంలో నేరుగా ప్రవేశించలేకపోయారు. అసలు వారి హోదా ఏమిటి వారి భవిష్యత్తు ఏమిటి అన్నదే అయిదేళ్ళుగా అంతర్మధనం గా సాగింది.

ఒక వ్యవస్థగా సచివాలయ ఉద్యోగులను తీర్చిదిద్దలేకపోయారు అన్న విమర్శలు ఉన్నాయి. సిబ్బంది కూడా అవసరాన్ని మించి తీసుకున్నారు. అదే విధంగా వారిని కేవలం పథకల కోసమే వాడుకున్నారు. ఎదుగూ బొదుగూ లేని ఉద్యోగాలు అని వారే విసిగి వేసారి తమకు ఉద్యోగాలు ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం మీదనే ఆగ్రహం చెంది 2024 ఎన్నికల్లో కూటమిని గెలిపించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమకు ఒక దారీ తెన్నూ చూపిస్తుందని వారు ఆశపడ్డారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు పూర్తి అయినా సచివాలయ ఉద్యోగుల విషయంలో చర్యలు అయితే పెద్దగా తీసుకోలేకపోయింది.

అయితే ఈ మధ్యనే సచివాలయాల సిబ్బందిని మూడు కేటగిరీలుగా చేసి వారిని ఆయా చోట్ల నియమించాలని నిర్ణయించింది. ఆ మీదట అదనంగా మిగిలిన నలభై వేల మంది సిబ్బందిని ఏమి చేయాలన్న దాని మీద కూడా చర్చ ఉంది.

ఈ నేపథ్యంలో గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగులపైన కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. సోమవారం గుర్తింపు పొందిన సంఘాలతో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి కీలక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాత సచివాలయ ఉద్యోగుల విషయంలో ఏమి చేయాలన్న దాని మీద రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు. నివేదిక ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది.

ఇక ఈ నివేదికను ఆసరాగా చేసుకుని ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో వైపు చూస్తే సచివాలయ ఉద్యోగులు తమను మల్టీ పర్పస్ సెక్రటరీలుగా నియమించవద్దని కోరుతున్నారు. దాని వల్ల తమ మీద అదనపు భారాలు పడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తమను ప్రభుత్వ సర్వీసులో కలిపి వారికి వచ్చినట్లుగా జీత భత్యాలు ఇవ్వాలని కోరుతున్నారు. కానీ ప్రభుత్వం ప్రస్తుతం ఆర్ధికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అందువల్ల సచివాలయ ఉద్యోగులు ఎక్కువ మంది మిగులు సిబ్బంది ఉన్నారు కాబట్టి వారి సేవలను ఖాళీగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో వాడుకోవాలని చూస్తోంది అని అంటున్నారు.

అంతే కాదు లక్షా పాతిక వేల మందికి 75 వేలకు తగ్గించి గ్రామ వార్డు సచివాలయాలలో సర్దుతున్న ప్రభుత్వం రానున్న రోజులలో వారి ప్రతిభ పనితీరు ఆధారంగా గ్రేడింగ్స్ ఇచ్చి ఆ మీదట వారికి ఏమైనా మేలు చేసే వీలు ఉందని అంటున్నారు. మరి మంత్రి వద్దకు పెద్ద డిమాండ్ల చిట్టాతోనే ఉద్యోగ సంఘాలు వెళ్తున్నాయి. దాని మీద మంత్రి ఏ విధంగా రియాక్ట్ అవుతారో ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ మీద ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుందో కొద్ది రోజూల్లో తేలనుంది అని అంటున్నారు.

Tags:    

Similar News