కేంద్రంతో బంధం తెగిందా.. వైసీపీ టాక్ ఏంటి..?
కేంద్రంలోని బీజేపీ పెద్దలతో వైసీపీకి నాయకులకు, పార్టీకి కూడా.. ఎనలేని అనుబంధం ఉన్న విషయం తెలిసిందే.;

కేంద్రంలోని బీజేపీ పెద్దలతో వైసీపీకి నాయకులకు, పార్టీకి కూడా.. ఎనలేని అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. ''మోడీకి జగన్ దత్తపుత్రుడు లెక్క'' అని గతంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యా నించిన విషయం తెలిసిందే. అంతేకాదు.. ఆయన ఎప్పుడు కోరుకుంటే.. అప్పుడు.. అప్పులు ఇచ్చారు. కేసులపై కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. చీపురు పుల్లలతో లాఠీ చార్జీ చేసినట్టుగా ఉందని.. జగన్ వ్యవహారంలో కేంద్రం అనుసరించిన వైఖరిని న్యాయ నిపుణులు సైతం ఎద్దేవా చేశారు.
ఇలా.. అన్ని విషయాల్లోనూ..జగన్‌ను కేంద్రం కాపాడిందనే చర్చ అప్పట్లో జోరుగా సాగింది. అయితే.. దీనిపై ఎవరూ నోరు మెదపలేదు. అటు కేంద్రంలోని బీజేపీ పెద్దలు కానీ.. ఇటు వైసీపీ నాయకులు కానీ.. ఎవరూ దీనిపై పెద్దగా మాట్లాడలేదు. అంతేకాదు.. ఏపీలో గత ఏడాది వైసీపీ పొత్తును విస్మరించిన తర్వాత.. కూడా.. బీజేపీ పెద్దలకు ఆయన సన్నిహితంగానే ఉన్నారన్న చర్చ ఉంది. తెలంగాణ బీజేపీ నాయకులు చంద్రబాబును కార్నర్ చేసినట్టుగా .. జగన్‌పై పన్నెత్తు మాట అనరు.
దీనికి కారణం.. వైసీపీ-బీజేపీల మధ్య ఉన్న అవినాభావ సంబంధమేనని చెబుతారు. అయితే.. ఇప్పుడు ఈ బంధానికి బీటలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మైనారిటీ ముస్లింలకు సంబంధించిన వక్ప్ బోర్డు సవరణ బిల్లు-24కు వైసీపీ మద్దతు ప్రకటించలేదు. ఈ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని పార్లమెం టు వేదికగా.. ఎంపీ మిథున్‌రెడ్డి చెప్పుకొచ్చారు. అన్నట్టుగానే బిల్లుపై జరిగిన చర్చల సమయంలో నూ వ్యతిరేకించారు. వ్యతిరేకంగానే ఓటు కూడా వేశారు.
వాస్తవానికి వైసీపీ ఎంపీలు .. నలుగురు కూడా.. లోక్ సభలో వక్ఫ్ బోర్డు బిల్లుపై ఓటింగ్ జరిగినప్పుడు వాకౌ ట్ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. అయినప్పటికీ.. బిల్లు పాసైంది. కానీ, వైసీపీ వ్యవహరించిన తీరుపై మాత్రం.. బీజేపీ ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. కీలకమైన బిల్లు విషయంలో వైసీపీ తమకు సహకరించలేదని.. పార్టీలో అగ్రనేతలు చెబుతున్నారు. ఇది.. మున్ముందు వైసీపీతో బీజేపీ వ్యవహరించే విధానాన్ని స్పష్టం చేస్తోంది. ఒకవేళ వైసీపీని పక్కన పెట్టాల్సి వస్తే.. అప్పుడు .. జగన్‌పై బీజేపీ ప్రతీకార రాజకీయాలకు దిగే అవకాశం మెండుగా ఉంటుందన్న చర్చసాగుతోంది.