Begin typing your search above and press return to search.

ప్రకాశం బ్యారేజ్ ని ఢీకొట్టిన బోట్లు లోకేష్ సన్నిహితుడివే - వైసీపీ

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్ర కోణం ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   9 Sep 2024 11:34 AM GMT
ప్రకాశం బ్యారేజ్ ని ఢీకొట్టిన బోట్లు లోకేష్ సన్నిహితుడివే - వైసీపీ
X

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్ర కోణం ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కావాలనే ఆ బోట్లతో బ్యారేజీని ధ్వంసం చేయాలని కుట్ర జరిగిందని ఆరోపిస్తున్నారు. ఆ బోట్లకు లంగర్లు వేయకుండా కేవలం ప్లాస్టిక్ తాడు కట్టి నిర్లక్ష్యంగా వ్యవహరించారని, కావాలని ఇలా చేశారని అంటున్నారు. ఆ బోట్లు వైసీపీ కార్యకర్తలకు చెందినవని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారంపై మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు. ఆ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేశారని, ఢీకొట్టిన 3 బోట్ల యజమాని వైసీపీ నేత అని చెప్పారు.

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్సీ తలశిల రఘురాంలకు బోట్ల యజమాని ఉషాద్రి రామ్మోహన్ సన్నిహితుడని ఆరోపించారు. బోట్లకు వైసీపీ రంగులు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. రూ. కోటిన్నర విలువ చేసే బోట్ల పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా? అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే నిమ్మలతోపాటు టీడీపీ నేతల ఆరోపణలకు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. ఆ బోట్ల యజమాని...మంత్రి నారా లోకేష్ సన్నిహితుడని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ కేసులో నిందితుడు కోమటి రామ్మోహన్, ఉషాద్రిలను పోలీసులు అరెస్ట్ చేశారని, అందులో రామ్మోహన్...టీడీపీ ఎన్నారై అధ్యక్షుడు కోమటి జయరాం బంధువు అని ఆరోపిస్తోంది.

గతంలో లోకేశ్ తో కలిసి ఉషాద్రి దిగిన ఫొటోలను వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నిందితులకు లోకేష్ తో సంబంధాలున్నాయనేందుకు ఈ పొటోలే సాక్ష్యమని చెబుతోంది. వరద బాధితులంతా టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, దానిని డైవర్ట్ చేసేందుకే టీడీపీ ప్రయత్నిస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.