ఎరుపు పార్టీల వైపు వైసీపీ మొగ్గు ?
ఏపీలో ఏ కూటమిలో చేరకుండా ఒంటరిగా ఉన్న వైసీపీకి ఇపుడు ఆ ఒంటరి తనం ఎంతటి భయంకరమో అర్ధం అవుతోంది.
ఏపీలో ఏ కూటమిలో చేరకుండా ఒంటరిగా ఉన్న వైసీపీకి ఇపుడు ఆ ఒంటరి తనం ఎంతటి భయంకరమో అర్ధం అవుతోంది. అన్నీ బాగా ఉన్నపుడు సోలోగా ఉన్నా ఓకే. కానీ ఇబ్బందులు వచ్చినపుడే ఆసరాగా ఎవరో ఒకరు ఉండాలని ఆర్ధం అవుతుంది. గ్రాస్ రూట్ లెవెల్ లో బూత్ దాకా విస్తరించి ఉన్న తెలుగుదేశం పార్టీకి కూడా పొత్తులు అవసరం అయినపుడు వైసీపీ ఇంకా మొగ్గ దశలోనే ఉంది కదా ఎందుకు పొత్తులు అవసరం లేదూ అన్న ప్రశ్నలు ఉండనే ఉన్నాయి.
అయితే గడచిన కాలం అంతా అలా వైసీపీకి సరిపోయింది. అందుకే హుషార్ చేసింది. 2012లో పార్టీ పుట్టినపుడు వైఎస్సార్ మీద వచ్చిన సానుభూతి ఆ పార్టీకి ఆక్సిజన్ అయింది. ఇక జగన్ ని జైలు పాలు చేసినపుడు మరింతగా వచ్చిన సానుభూతి 2014 ఎన్నికల్లో ఆ పార్టీకి పెట్టుబడి అయింది. అదే ఇంధనంగా చేసుకుని పాదయాత్ర చేసి 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది.
ఇక అధికారంలో ఉన్నపుడు ఎవరి మద్దతు అసలు అవసరం లేదు. మళ్లీ మేమే 175 సీట్లూ మావే అని అధికార దర్పంతో 2024 ఎన్నికల్లో పోటీ చేసినపుడూ పొత్తుల ఆలోచనలు రాలేదు. ఇపుడు 11 సీట్లకే పరిమితం అయి రాజకీయ రాదారి కానరాక అన్నింటా ముళ్ల దారిగా మారుతున్న వేళ ఒక్కండు నీ మొర ఆలకించడు అన్న తీరున వ్యవహారం సాగుతున్న వేళ వైసీపీకి తోడు ఒకరు ఉంటే బాగుంటుంది అని రాజకీయాల్లో ఇన్నాళ్ళకు అనిపిస్తోంది అని అంటున్నారు.
అయితే ఎవరితో తోడు చేసుకోవాలి. ఎవరితో జట్టు కట్టాలీ అంటే అందులోనూ కొంత సందిగ్దం ఉంది. కేంద్రంలో బీజేపీ జనసేన టీడీపీ జట్టుగా ఉన్నాయి. ఆ వైపు వెళ్లడం కష్టం. ఇక కాంగ్రెస్ వైపు వెళ్లాలీ అంటే మనసు అందుకు ఒప్పుకోవడం లేదుట.
అందుకే వయా మీడియాగా కమ్యూనిస్టులతో దోస్తీ చేస్తే ఎలా ఉంటుంది అన్న కొత్త ఆలోచనలు వైసీపీలో వస్తున్నాయట. కమ్యూనిస్టులు అయితే పోరాటాలకు పెట్టింది పేరు. వారు ప్రజా సమస్యల మీద గట్టిగా నోరు పెట్టి మాట్లాడుతారు. వారితో జట్టు కడితే బలమైన పార్టీగా ఉన్న వైసీపీకి మరింత ఊపు వస్తుందని భావిస్తున్నారుట. అంతే కాదు బూత్ ల వద్ద కూడా ఈ పొత్తులు పనికి వస్తాయని టీడీపీ కూటమి బలాన్ని అక్కడే ఎదిరించి పోల్ మేనేజ్మెంట్ అన్నది గట్టిగా చేసుకోవచ్చు అని కూడా భావిస్తున్నారుట.
అయితే వామపక్షాల నుంచి ఏమైనా సంకేతాలు వస్తేనే పొత్తు ప్రతిపాదనలకు సిద్ధం కావాలని చూస్తున్నారుట. తమ వైపు నుంచి అయితే ప్రస్తుతానికి ఏ ప్రయత్నం చేయరని అంటున్నారు. మొత్తానికి పొత్తులు అంటూ తోటి పార్టీల వైపు చూడడం అంటే వైసీపీలో గుణాత్మకమైన మార్పులు వస్తున్నాయని భావించాలా అంటే ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్లుగా ఏదైనా జరగవచ్చు. రాజకీయాలు అంటే అలాగే ఉంటాయి. అలా వైసీపీ లో కూడా వినూత్న అలోచనలు పుడుతున్నాయని అని ప్రచారం అయితే సాగుతోంది. ఇందులో నిజమెంత అన్నది చూడాల్సి ఉంది.