రెడ్ బుక్ కి మించి కారుమూరి వార్నింగు.. టీడీపీ అంటే నరికేస్తారంట!
మంత్రిగా ఉండగా, రైతులను ఎర్రిపప్పల్లారా? అంటూ వ్యాఖ్యానించిన మాజీ మంత్రి కారుమూరి ఇప్పుడు కూడా అదే స్పీడు చూపడం చర్చనీయంశమవుతోంది.;

వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సహనం కోల్పోయారు. అధికారంలో ఉన్నప్పుడు నోటికొచ్చినట్లు మాట్లాడిన కారుమూరి.. ఇప్పుడు కూడా తన జోరు తగ్గలేదంటున్నారు. ఏలూరులో నిర్వహించిన వైసీపీ కార్యకర్తల సమ్మేళనంలో మాట్లాడిన మాజీ మంత్రి కారుమూరి టీడీపీ వాళ్లను నరికేస్తారంటూ హెచ్చరించారు. కార్యకర్తల్లో ధైర్యం నూరిపోయడానికి అలా మాట్లాడారో? లేక వైసీపీ నేతల వరుస అరెస్టులతో సహనం నసించిపోయిందో కానీ మాజీ మంత్రి రెచ్చగొట్టినట్లు మాట్లాడటం సంచలనం రేపుతోంది.
మంత్రిగా ఉండగా, రైతులను ఎర్రిపప్పల్లారా? అంటూ వ్యాఖ్యానించిన మాజీ మంత్రి కారుమూరి ఇప్పుడు కూడా అదే స్పీడు చూపడం చర్చనీయంశమవుతోంది. ఏలూరులో నిర్వహించిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కారుమూరి, అధికార పార్టీని రెచ్చగొడుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘నేను పెద్దిరెడ్డి దగ్గరకు వెళ్లాను. కూటమి ప్రభుత్వం ఏం చేసినా, వచ్చే ఎన్నికల్లో ప్రజలు మనే ఓటేస్తారని చెప్పాను. తెలుగుదేశం నాయకులు సైతం మాపై కక్ష పెట్టుకోవద్దు అంటూ వేడుకుంటున్నారు. అది మాత్రం జరగదు. గుంటూరు ఇవతల వాళ్లను ఇంట్లో నుంచి లాగి కొడతారు. గుంటూరు అవతలి నుంచి నరికిపారేస్తారు. మనింటికి వాళ్ల ఇల్లు ఎంత దూరమో వాళ్లింటికి మనిల్లు అంతే దూరం’ అంటూ బరితెగించినట్లు కారుమూరి వ్యాఖ్యలు చేశారు.
గత ఎన్నికల్లో తణుకు ఎమ్మెల్యేగా పోటీ చేసిన కారుమూరి ఘోరంగా ఓడిపోయారు. అదేసమయంలో గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆయనపై టీడీఆర్ బాండ్ల దుర్వినియోగం ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై విచారణకు ప్రభుత్వం సిద్ధమవుతోందని అంటున్నారు. దీంతో ఆయన ప్రస్టేషన్ కు లోనవుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఎక్కడ తన అవినీతి బయట పడుతుందోననే భయంతోనే కారుమూరి రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. మంత్రి నారా లోకేశ్ రెడ్ వార్నింగులకు మించినట్లు కారుమూరి మాటలు ఉండటంతో టీడీపీ రియాక్షన్ ఎలా ఉంటుందోనని పొలిటికల్ సర్కిల్స్ చర్చ జరుగుతోంది.