టీడీపీకి టచ్ లో వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలూ !

వైసీపీకి పదకొండు మంది ఎమ్మెల్యేలు నలుగురు ఎంపీలు 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలిచారు.

Update: 2024-12-18 18:30 GMT

వైసీపీకి పదకొండు మంది ఎమ్మెల్యేలు నలుగురు ఎంపీలు 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలిచారు. వీరు కాకుండా రాజ్యసభలో ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు. నిజానికి పదకొండు మంది ఎంపీలు రాజ్యసభలో వైసీపీకి ఉండగా అందులో నుంచి ముగ్గురు రాజీనామాలు చేసి పార్టీ నుంచి తప్పుకున్నారు.

ఇక ఇపుడు మిగిలిన ఎనిమిది మందిలో కూడా కొందరు పక్క చూపులు చూస్తున్నట్లుగా వార్తలు అయితే ప్రచారంలో ఉన్నాయి. మరో వైపు చూస్తే వైసీపీకి ఎమ్మెల్యేలు పదకొండు మంది ఉంటే అందులో కూడా కొంతమంది అధికార పార్టీ వైపు చూస్తున్నారు అని ప్రచారం సాగుతోంది.

ఆ మధ్యన కూడా కొందరి పేర్లు వినిపించినా వారు ఖండించారు. ఇక నలుగురు లోక్ సభ ఎంపీలలో కూడా ఎవరైనా పార్టీ ఫిరాయిస్తారా అన్న దాని మీద చర్చ అయితే సాగుతోంది. ఇవన్నీ ఇలా ఉండగానే టీడీపీ మంత్రి రాం ప్రసాద్ రెడ్డి ఒక బాంబు లాంటి వార్త వినిపించారు.

తొందరలో వైసీపీ ఖాళీ కావడం ఖాయమని కూడా ఆయన జోస్యం కూడా చెప్పారు. రాం ప్రసాద్ రెడ్డి రాయలసీమ జిల్లాలకు చెందిన వారు. అందునా జగన్ సొంత జిల్లా కడపకు చెందిన వారు. ఆయన చెప్పారూ అంటే అందులో మ్యాటర్ ఉంటుందనే అంతా అంటున్నారు.

వైసీపీ నుంచి ఇప్పటిదాకా మాజీ ఎమ్మెల్యేలు మాత్రమే వలస బాట పట్టారు ఇపుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా టీడీపీలోకి మారుతారు అన్న వార్తలు అయితే సంచలనంగానే మారాయి అని చెప్పాలి. పదకొండు మంది ఎమ్మెల్యేలలో చాలా మంది అసెంబ్లీ ముఖం చూడడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గెలిచి ఆరు నెలలు అయినా అధ్యక్షా అని అనలేకపోవడం పట్ల వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

జగన్ అసెంబ్లీకి వెళ్లకపోయినా తన ఎమ్మెల్యేలను అయినా సభకు పంపించి ఉంటే కొంతలో కొంత వారు సర్దుకునేవారు అని అంటున్నారు. అలా కాకుండా జగన్ అందరినీ ఆపించేశారు. అంతే కాదు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి అన్న పట్టు పడుతున్నారు. అది అయ్యేది కాదు అంటే ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్ళేది లేదు అన్నది క్లారిటీయే కదా అని అంటున్నారు.

దాంతోనే ఎమ్మెల్యేలలో కొందరు టీడీపీ వైపు చూస్తున్నారు అని అంటున్నారు. ఏకంగా టీడీపీ మంత్రి ఈ విషయాన్ని వెల్లడంచడంతో తెర వెనక ఏదో జరుగుతోంది అని అంటున్నారు. కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తూనే జగన్ కి భారీ షాక్ ఇచ్చేందుకు టీడీపీ చూస్తుందా అన్న చర్చ కూడా సాగుతోంది.

తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఆపరేషన్ వైసీపీని చేపట్టి బలమున్న నేతలను అందరికీ తీసుకుంటోంది. ఇపుడు ఎమ్మెల్యేలను కూడా తీసుకుంటే మాత్రం అది వైసీపీని మరింతగా డీమోరలైజ్ చేస్తుంది అని అంటున్నారు. ఇక రాజ్యసభలో కూడా కొందరి ఎంపీలు అధికార శిబిరంలోకి చేరాలని చూస్తున్నారు అని టాక్ అయితే ఉంది.

ఇప్పటికి ముగ్గురు రాజీనామాలు చేశారు. వారి విషయంలో ఇద్దరికి తిరిగి పదవులు ఇచ్చేశారు. అలా కనుక ఒప్పందం కుదిరితే వైసీపీ నుంచి ఎంపీలు కొందరు బయటకు వచ్చేందుకు సిద్ధమని చెబుతున్నారని అంటున్నారు. ఆ విధంగా క్రిష్ణయ్య బీద మస్తాన్ రావు పార్టీలు మారినా తమ ఎంపీ సీట్లను నిలబెట్టుకున్నారు. దాంతో ఇదే విధంగా కనుక హామీ దక్కితే మరింతమంది వైసీపీ గేటు దాటి బయటకు వచ్చే చాన్స్ ఉందని అంటున్నారు.

ఇదిలా ఉంటే వైసీపీ ఎమ్మెల్సీలు కూడా పార్టీని వీడి టీడీపీలో చేరేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వారి విషయంలో కూడా అధికార టీడీపీ చేయాల్సింది చేస్తోంది అని అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీని దెబ్బ తీయాలన్న ప్రయత్నంలో కూటమి ఉందని అంటున్నారు. వైసీపీలో కూడా చాలా మంది నాయకులు అసంతృప్తిగా ఉండడం వారికి ఊతమిచ్చే పరిణామంగా ఉంది. ఈ పరిణామాలు అన్నీ దృష్టిలో ఉంచుకుని మంత్రి రాం ప్రసాద్ రెడ్డి వైసీపీ ఖాళీ అవడం ఖాయమని జోస్యం చెప్పారని అంటున్నారు.

Tags:    

Similar News