జైలు గోడల మధ్య రగులుతున్న వైసీపీ నేతలు!

విజయవాడ జైలు నుంచి కోర్టుకు వచ్చిన వల్లభనేని వంశీ అడుగులు నిశ్శబ్దంగా నిస్సహాయంగా కనిపించాయి.;

Update: 2025-03-26 07:42 GMT
జైలు గోడల మధ్య రగులుతున్న వైసీపీ నేతలు!

విజయవాడ జైలు నుంచి కోర్టుకు వచ్చిన వల్లభనేని వంశీ అడుగులు నిశ్శబ్దంగా నిస్సహాయంగా కనిపించాయి. నిన్నటి వరకు నియోజకవర్గంలో తన మాట వేదంగా చెల్లుబాటు అయ్యేది. ముఖ్యమంత్రి జగన్‌తో సన్నిహితంగా ఉండేవాడు. పార్టీ కోసం, జగన్ కోసం గొంతు చించుకుని మాట్లాడిన రోజులు గుర్తొచ్చాయి. ఇప్పుడు అదే పార్టీ, వైసీపీ నేతలు తనకు బెయిల్ విషయంలో న్యాయ సహాయం చేయడం లేదని.. విడిపించేలా బలమైన ప్రయత్నాలు చేయడం లేదని.. తనను పట్టించుకోవడం లేదన్న ఆవేదన, ఆక్రందన ఆయనలో వినిపిస్తోందని సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.

రిమాండ్ గడువు ముగిసిన ప్రతిసారీ ఏదో ఒక ఆశ. ఈసారైనా బెయిల్ వస్తుందేమోనని ఎదురుచూడటం. కానీ, కోర్టు మళ్లీ నిరాశపరచడంతో జైల్లో ఉన్న వైసీపీ నేతల్లో సహనం నశిస్తోంది. "ఇన్ని కష్టాల్లో ఉంటే కనీసం ఒక న్యాయవాదిని కూడా పెట్టలేరా?" తన అనుచరులతో ఆవేదనగా అన్నాడట వంశీ. ఈ మేరకు సోషల్ మీడియాలో వారి బాధ బయటకొచ్చింది.. ఒకప్పుడు తన చుట్టూ తిరిగిన నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని వంశీ బాధపడుతున్నాడట... జగన్ ఒక్కసారి వచ్చి వెళ్లారే తప్ప, ఆ తర్వాత కనీసం పార్టీ నేతలు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నాడట..

మరోవైపు రాజమండ్రి జైలులో ఉన్న బోరుగడ్డ అనిల్ కుమార్ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. సోషల్ మీడియాలో తన మాటలతో ప్రత్యర్థులను దుమ్మెత్తిపోసిన అనిల్ ఇప్పుడు తాను చిక్కుల్లో పడ్డాడు. కోర్టు ధిక్కరణ కేసు అతడిని మరింతగా భయపెడుతోంది. రాజమండ్రి జైలు అధికారులకు లొంగిపోవడంలో జరిగిన ఆలస్యాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. "ఇంత చేసింది ఎవరి కోసం? నా కోసమా?" అని తన సన్నిహితులతో వాపోయాడట అనిల్. బలమైన లాయర్లను ఏర్పాటు చేయమని పార్టీని వేడుకున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యారని ఆవేదన చెందుతున్నాడట..

వల్లభనేని వంశీ, అనిల్ మాత్రమే కాదు.. వారిలాగే పార్టీ కోసం పనిచేసి ఇప్పుడు కష్టాల్లో ఉన్న చాలామందిలో ఇదే ఆవేదన, ఆగ్రహం. ఒకప్పుడు పార్టీ కోసం ఎలుగెత్తిచాటిన వారే ఇప్పుడు తమకు న్యాయసహాయం సహా పార్టీ నుంచి సరైన మద్దతు దక్కడం లేదని నిప్పులు చెరుగుతున్నారట..తమను విడిపించే బలమైన ప్రయత్నాలు జరగడం లేదన్నది వారి బాధ. నానా బాధలు పడి బెయిల్ పై పోసాని మాత్రమే ఇప్పటివరకూ బయటకు రాగాలిగారు. మిగతా వారికి అసలు బెయిల్ దక్కడం లేదు. దీంతో జైలు గోడల చాటున వారి గుండెల్లో రగులుతున్న అసంతృప్తి ఎప్పటికి చల్లారుతుందో తెలియని పరిస్థితి. తమ భవిష్యత్తు అంధకారంలో ఉన్నందుకు వారు కుమిలిపోతున్నారు. పార్టీ నాయకత్వం తమను పూర్తిగా విస్మరించిందని వారు ఆవేదన చెందుతున్నారట.

గతంలో అధికారం వెలగబెట్టిన రోజులు, ఇప్పుడు జైలు జీవితం.. ఈ రెండింటి మధ్య వారంతా నలిగిపోతున్నారు. ఎవరి కోసం తాము పోరాడామో, వారే ఇప్పుడు తమను ఒంటరిని చేశారన్న భావన వారిని మరింతగా కుంగదీస్తోంది. రానున్న రోజుల్లో ఈ 'జైలు పక్షులు' తమ అసంతృప్తిని ఎలా వ్యక్తం చేస్తారో చూడాలి. కానీ, ప్రస్తుతానికైతే వారి హృదయాలు నిప్పుల కొలిమిలా మండుతున్నాయి.

Tags:    

Similar News