సెగ్మెంట్ సంగతి: ఏపీలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే ..!
అయితే.. ఇప్పుడు మాత్రం ఎమ్మెల్యేలు.. ఎంపీలు ఒకరి వ్యవహారాల్లో ఒకరు వేలు పెడుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.;

వైసీపీ హయాంలో ఎమ్మెల్యే దారి ఎమ్మెల్యేది.. ఎంపీ దారి ఎంపీది అన్నట్టుగా రాజకీయాలు సాగాయి. ఎవరికి వారే.. తమ వ్యాపారాలు, వ్యవహారాలు చూసుకున్నారు. పైగా చిన్న ఫిర్యాదు వచ్చినా.. వెంటనే తాడేపల్లి నుంచి ఆదేశాలు వచ్చేవి. దీంతో నాయకులు సర్దుకునే వారు. అయితే.. ఇప్పుడు మాత్రం ఎమ్మెల్యేలు.. ఎంపీలు ఒకరి వ్యవహారాల్లో ఒకరు వేలు పెడుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఇది పార్టీలకు.. ప్రభుత్వానికి కూడా తలనొప్పిగా మారింది.
ప్రతి జిల్లాలోనూ.. ఈ సమస్య కనిపిస్తుండడం గమనార్హం. అనకాపల్లి జిల్లాలో ఎంపీ సీఎం రమేష్‌కు.. బీజేపీ నాయకులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఏక ఛత్రాధిపత్యంగా రమేష్ వ్యవహరిస్తు న్నారన్నది బీజేపీ నాయకులు చెబుతున్న మాట. సొంతగానే నిర్ణయాలు తీసుకోవడం.. కేంద్రం వద్ద కూడా చర్చించాల్సిన అంశాలపై ఎవరితోనూ సంప్రదించకుండానే నిర్ణయం అమలు చేయడం వంటివి ఇక్కడి బీజేపీ ఎమ్మెల్యే సహా.. ఇతర నాయకులను ఇబ్బంది పెడుతోంది.
బాపట్ల ఎమ్మెల్యేకు.. ఎంపీకి మధ్య కూడా ఇబ్బందికర పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్ర వర్మ.. ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు చేపడుతున్నా.. వాటి విషయంలో ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్.. తనకు ఏమీ సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నారన్నది టీడీపీ నాయకు లు చెబుతున్న మాట. ఇద్దరూ టీడీపీకి చెందిన నాయకులే అయినప్పటికీ.. ఒకరికి ఒకరికి పొసగక పోవడం గమనార్హం. ఇది అటు పార్టీలోనూ.. ఇటు ప్రభుత్వంలోనూ చర్చకు వస్తోంది.
గుంటూరు ఎంపీగా ఉన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యవహారంపైనా టీడీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహంతోనే ఉన్నారని ఒక టాక్. ఆయన ఎవరికి చెప్పకుండానే.. తన కార్యక్రమాలకు రావడం.. వచ్చిన తర్వాత ఆహ్వానాలు పంపిస్తుండడంతో ఇటీవల కాలంలో ఇద్దరు ఎమ్మెల్యేలు సదరు కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. అంతేకాదు.. కేంద్ర మంత్రిగా ఆయనను గౌరవిస్తామని.. కానీ, ఎంపీగా.. మాత్రం ఆయన వ్యవహార శైలి బాగోలేదని.. ఇటీవల కీలక నియోజకవర్గం ఎమ్మెల్యే ఒకరు చంద్రబాబు వద్దే వ్యాఖ్యానించారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కొందరు ఎమ్మెల్యేలు-ఎంపీలకు పొసగకపోవడం గమనార్హం.