వైసీపీకి డేంజర్ బెల్.. అక్కడా ప్రతిపక్ష హోదా గల్లంతేనా?
ఏపీలో వైసీపీకి ప్రతిపక్షమే గండంలా మారుతోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీలో వైసీపీకి ప్రతిపక్షమే గండంలా మారుతోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైన వైసీపీ మండలిలో మాత్రం మెజార్టీ సభ్యుల అండతో ప్రతిపక్షంలో కొనసాగుతోంది. మండలిలో వైసీపీ పక్ష నేతగా వ్యవహరిస్తున్న సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రతిపక్ష హోదాను అనుభవిస్తున్నారు. అయితే ఇటీవల చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలతో శాసనమండలిలోనూ వైసీపీ ప్రతిపక్ష హోదాకు డేంజర్ సిగ్నల్ కనపిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.
ఏపీ శాసన మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58. ఇందులో ప్రస్తుతం అధికార పక్షానికి 10 మంది సభ్యుల బలం ఉండగా, ప్రతిపక్ష వైసీపీకి 36 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇక ఐదు ఖాళీలు, ఐదుగురు ఇండిపెండెంట్లు మండలిలో ఉన్నారు. త్వరలో మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ మూడు స్థానాల్లో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీని మినహాయిస్తే మిగిలిన రెండు సీట్లు గెలుచుకుంటామని టీడీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. దీంతో త్వరలోనే తమ బలం 10 నుంచి 12కు పెరుగుతుందని అంచనా వేస్తోంది. మరోవైపు వైసీపీ సభ్యులుగా ప్రస్తుతం కొనసాగుతున్న వారిలో జయమంగళ వెంకటరమణ, ఇందుకూరి రఘురాజు వైసీపీకి రాజీనామా చేసి కూటమి పార్టీల్లో చేరిపోయారు. ప్రస్తుతం రఘురాజు టీడీపీతో సన్నిహితంగా ఉండగా, జయమంగళ స్థానానికి కొద్ది రోజుల్లో ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. దీంతో కూటమి బలం ప్రస్తుతానికి 14గా భావించొచ్చని అంటున్నారు.
ఇలా 2027 నాటికి మరో 18 స్థానాల్లో టీడీపీ కూటమి పాగా వేసే అవకాశం కనిపిస్తోంది. ప్రతి రెండేళ్లకు జరిగే శాసన మండలి ఎన్నికల్లో అసెంబ్లీలో బలం ఆధారంగా, టీడీపీ కూటమే అన్ని స్థానాలను కైవసం చేసుకునే వీలుంది. ఇక 2029లో ఖాళీ అయ్యే 1/3 స్థానాల్లో మాత్రమే వైసీపీకి ప్రాతినిధ్యం ఉంటుంది. అయితే ఇప్పుడు 2029 వరకు ఎమ్మెల్సీలుగా ఉండబోయేవారిపైనే టీడీపీ గురిపెట్టినట్లు తెలుస్తోంది. వారితో రాజీనామాలు చేయించి కూటమిలో ఏదో ఒక పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
ఒక వ్యూహం ప్రకారం పావులు కదుపుతున్న అధికార కూటమి 2027 ఎన్నికల నాటికి శాసన మండలిలో వైసీపీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలనే టార్గెట్ తో అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ పార్టీ నేతగా వ్యవహరిస్తున్న బొత్స పదవీ కాలం కూడా 2027లోనే ముగియనుంది. దీంతో ఎమ్మెల్సీలను కాపాడుకోవడం వైసీపీకి పెద్ద సవాలేనని అంటున్నారు. ఏదిఏమైనా వైసీపీ ప్రతిపక్ష హోదాకు డేంజర్ బెల్ మోగిస్తున్న అధికార కూటమి ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాల్సివుంది.