వైసీపీ మాజీ మంత్రుల విషయంలో షాకింగ్ రిజల్ట్!

వైసీపీ ప్రభుత్వంలో అయిదేళ్ల పాటు రెండు దఫాలుగా దాదాపుగా నలభై అయిదు మంది దాకా మంత్రి హోదాను అందుకున్నారు.

Update: 2025-01-23 03:30 GMT

వైసీపీ ప్రభుత్వంలో అయిదేళ్ల పాటు రెండు దఫాలుగా దాదాపుగా నలభై అయిదు మంది దాకా మంత్రి హోదాను అందుకున్నారు. వారందరినీ వైసీపీ అధినేత జగన్ స్వయంగా ఏరి కోరి ఎంపిక చేశారు. సామాజిక న్యాయం పేరుతో కొంతమందిని అలాగే దిగ్గజ నేతలు అని సీనియర్లు అని యువత అని మహిళలు విద్యాధికులు అని ఇలా చాలా మందిని ఆయన మంత్రులుగా చేశారు.

వైసీపీ ఓటమి తరువాత వీరిలో ఎంతమంది గొంతు విప్పుతున్నారు అని లెక్క తీస్తే షాకింగ్ రిజల్ట్ వస్తోందిట. పట్టుమని అరడజను మంది కూడా వైసీపీని వెనకేసుకుని మీడియా ముందుకు రావడం లేదని తేలిపోయింది అని అంటున్నారు. వీరిలో జగన్ ని అన్నగా భావించే చెల్లెమ్మలూ ఉన్నారు.

వీరంతా ఒక్కసారిగా స్విచాఫ్ చేసినట్లుగా మౌన రాగం ఆలపించడంతో వైసీపీ ఏపీలో పొలిటికల్ గా ఫుల్ సైలెంట్ అయిపోయింది. కూటమిలో మూడు పార్టీలు ఉన్నయి. మంత్రులు అంతా ఎక్కడికక్కడ గొంతు విప్పుతున్నారు. మాట్లాడితే చాలు ప్రతీ దానికీ ముందు గత వైసీపీ ప్రభుత్వంలో ఇలా జరిగింది అని అంటున్నారు.

మరి తమ శాఖల మీద చేసిన విమర్శలకు అయినా మాజీ మంత్రులు ముందుకు వచ్చి వివరణ ఇస్తే వైసీపీకి కొంత రాజకీయ న్యాయం జరిగేదని అంటున్నారు. అలా కాకుండా తమకేమి పట్టిందన్న తీరులో మాజీ మంత్రులు అంతా ఉన్నారు. వారిలో ఫైర్ బ్రాండ్ లీడర్లు కూడా ఉన్నారు. దీంతో వైసీపీ అధినాయకత్వానికి తత్వం పూర్తిగా బోధపడింది అని అంటున్నారు.

వైసీపీలో గొంతు విప్పుతున్న మాజీ మంత్రులు అయితే బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాధ్ వంటి వారే ఉన్నారని అంటున్నారు. అపుడపుడు రోజా విమర్శలు చేస్తున్నారు. ఇక చూస్తే ఆ మధ్య దాకా మీడియా ముందుకు వచ్చి వైసీపీ కొమ్ము కాసిన మాజీ మంత్రి పేర్ని నాని అయితే తమ కుటుంబం మీద కేసులు పడడంతో సైలెంట్ అయిపోయారు అని అంటున్నారు.

ఇది చూసిన మిగిలిన వారు కూడా ఎందుకొచ్చిన తంటా అనుకుంటున్నారు అని చెబుతున్నారు. ఇక వైసీపీ హయాంలో ఇద్దరు మహిళలను హోం మంత్రులుగా చేసింది. మొదటి మూడేళ్ళూ మేకతోటి సుచరిత ఇపుడు ఎక్కడా మాట్లాడడం లేదు అని అంటున్నారు. అసలు ఆమె పార్టీలో ఉన్నారా లేరా అన్నది కూడా ఒక చర్చగా మారుతోంది.

ఇంకోవైపు చూస్తే ఆమె తరువాత హోం మంత్రి అయిన తానేటి వనిత కూడా గమ్ముని ఉన్నారు అన్న చర్చ వస్తోంది. ఇక ఆమె ఓటమి పాలు అయ్యాక అసలు కనిపించడం లేదని పార్టీ క్యాడర్ అధినేత జగన్ కి ఫిర్యాదు చేసిందని అంటున్నారు. ఆమె పార్టీలో ఉంటారా లేక వేరే ఆలోచనలు చేస్తున్నారా అన్నది కూడా తెలియడం లేదని అంటున్నారు.

ఈ ఇద్దరు మహిళా నాయకురాళ్ళు మంచి ధాటీగా మాట్లాడుతారు అని పేరు ఉంది. ఏపీలో కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి ముందుకు వస్తే పార్టీకి మైలేజ్ పెరుగుతుందని అంటున్నారు. అయితే మూగ నోము పట్టడం వెనక వారిలో గూడు కట్టుకున్న అసంతృప్తి ఎంతో ఉందని కూడా అంటున్నారు.

ఇలా ఈ కీలక మహిళా నేతల తీరు మీద పార్టీలో చర్చ సాగుతోంది వీరితో పాటు వైసీపీలో పదవులు అనుభవించి ఇపుడు నోరు చేసుకోకుండా మౌనమే నా భాష అంటున్న చాలా మంది మాజీ మంత్రుల తీరు మీద హైకమాండ్ సీరియస్ గా ఉందని అంటున్నారు. మరి ఏమి చర్యలు తీసుకుంటారో చూడాల్సిందే.

Tags:    

Similar News