యూసీసీ మంట.. వైసీపీ సర్కారు తేల్చేసిందా!
ఏపీ విషయానికి వస్తే.. రెండు కీలక పార్టీలకు ఇప్పుడు యూసీసీ తలనొప్పిగా మారింది.
దేశవ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్న చర్చ కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు తీసుకువస్తామని చెబుతున్న ఉమ్మడి పౌరస్మృ తి బిల్లు(యూసీసీ) గురించే. గురువారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే ఈ బిల్లు ప్రవేశ పెట్టే అవకాశం ఉందని పెద్ద ఎత్తున చర్చసాగుతోంది. దీంతో ఈ బిల్లుపై కొన్ని రాష్ట్రాలు ఒకే అన్నట్టుగా వ్యవహరిస్తుండగా.. మెజారిటీ రాష్ట్రాలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. సరే.. ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే.. రెండు కీలక పార్టీలకు ఇప్పుడు యూసీసీ తలనొప్పిగా మారింది.
ప్రధానంగా ఆది నుంచి కూడా మైనారిటీ ఓటు బ్యాంకును నమ్ముకుని ముందుకు సాగుతున్న వైసీపీకి మరింత ఇబ్బందిగానే మారిందని చెప్పాలి. తాజాగా ముస్లిం మైనారిటీ పెద్దలు, వైసీపీకి చెందిన మైనారిటీ ముస్లిం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా నేతృత్వంలో సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. యూసీసీకి మద్దతివ్వదని వారు కరాఖండీగా సీఎం జగన్‌కు తేల్చి చెప్పారు. అయితే.. అసలు మీ సమస్య ఏంటంటూ.. సీఎం జగన్ వారిని ప్రశ్నించి.. మూడు గంటల పాటు చర్చించారు.
ఈ క్రమంలో తమకు ఇప్పటికే `ముస్లిం పర్సనల్ లా బోర్డు` ఉందని, దీనివల్ల ముస్లిం మహిళలకుఎలాంటి అన్యాయం జరగడం లేదని.. వారు స్వేచ్ఛగానే ఉంటున్నారని వైసీపీ ప్రజాప్రతినిధులు సీఎం జగన్‌కు చెప్పినట్టు తెలిసింది. ప్రస్తుతం కేంద్రం తీసుకువస్తున్న యూసీసీ బిల్లుతోనే తమకు ఇబ్బందులు వస్తాయని, దీనివల్ల మత పరమైన సమస్యలు కూడా ఉంటాయని వారు వివరించారు. దీంతో ఈ బిల్లును వ్యతిరేకించాలని ఒకింత గట్టిగానే సీఎం జగన్‌కు సూచించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వారికి నిర్దిష్టంగా హామీ ఇవ్వకపోయినా.. ``యూసీసీ బిల్లు వల్ల మీకు ఇబ్బంది కలుతుందని భావిస్తే.. తప్పకుంటా వ్యతిరేకిస్తాం`` అని చెప్పినట్టు మీడియా ముందు ముస్లిం ప్రతినిధులు తెలిపారు.
అంటే.. ఒకరకంగా వైసీపీ ప్రభుత్వంపై ముస్లిం మైనారిటీలు ఒత్తిడి పెంచారనే చెప్పాలి. పైగా 50 మంది పెద్దలు.. 10 మంది ప్రజాప్రతినిధులు కూడా సీఎం జగన్‌ను కలిశారు. సో.. దీనిని బట్టి వైసీపీపై ఈ యూసీసీ ప్రభావం ఎక్కువగానే కనిపిస్తోంది. వచ్చే ఎన్నికలు కీలకం కావడం.. ఈ బిల్లును వ్యతిరేకించకపోతే.. వారి ఆగ్రహానికి గురికావం వైసీపీ నాణేనికి ఒకవైపు కనిపిస్తున్న విషయం. ఇక, మరోవైపు.. ఈ బిల్లును ఆమోదించుకుని తీరతామని చెబుతున్న మోడీ అండ్ కోకు సహకరించాలా వద్దా అన్నది తేల్చుకోవాల్సిన పరిస్థితి.