చంద్రబాబూ డప్పు చాలూ, ఒక్కటైనా వచ్చిందా మేధావుల సూటి ప్రశ్న?
ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తదితరులు దావోసులో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనపై వైసీపీ విమర్శలు ఎక్కుపెట్టింది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ గతంలో దావోస్ వెళ్లి ఎన్ని పెట్టుబడులు తెచ్చారంటూ ప్రశ్నించిన వైసీపీ గతం గుర్తుందా? బాబూ అంటూ 2014-19 మధ్య దావోస్ పెట్టుబడుల ప్రకటనలను గుర్తు చేసింది.
ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తదితరులు దావోసులో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో పారిశ్రామిక పెట్టుబడుల కోసం పారిశ్రామిక వేత్తలతో చర్చలు జరుపుతారు. ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అయితే గతంలో ఎన్నోసార్లు దావోస్ వెళ్లిన చంద్రబాబు రాష్ట్రానికి ఎలాంటి పెట్టుబడులు తేలేదంటూ వైసీపీ ఆరోపిస్తోంది. అన్నీ ఉత్తుత్తి ప్రకటనలేనంటూ ఆ పార్టీ సోషల్ మీడియా ద్వారా ఆరోపణలు చేస్తోంది. ఇందులో భాగంగా చంద్రబాబు గత ప్రభుత్వంలో చేసిన ప్రకటనలను ఉటంకిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.
2014-19 మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగుసార్లు, మంత్రి లోకేశ్ ఒకసారి దావోసులో పర్యటించినట్లు వైసీపీ గుర్తు చేసింది. ఈ సందర్భంగా 2015లో విశాఖకు మైక్రోసాఫ్ట్, విప్రో, ఇన్ఫోసిస్ డేటా సెంటర్లు వస్తున్నాయని ప్రకటించారని తెలిపింది. అదేవిధంగా 2016లో మియర్ బర్గర్, ఫిస్లోం సోలార్ మాడ్యూల్ యూనిట్లు వస్తున్నాయని డప్పుకొట్టారని విమర్శించింది. 2017లో విశాఖలో యూకేకి చెందిన అంతర్జాతీయ హాస్పిటల్ నిర్మిస్తారని ప్రచారం చేశారని, 2018లో క్రిష్ణపట్నంలో సౌదీ ఆరామ్ చమురు శుద్ధి కర్మాగారం, 2019లో జేఎస్ డబ్ల్యూ రూ.3500 కోట్లు పెట్టుబడులు అంటూ చెప్పారని, ఇందులో ఒక్కటైనా వచ్చిందా? అంటూ ఆ పోస్టరులో నిలదీసింది.
కాగా, ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్లిన చంద్రబాబు పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ అవుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల వేట ఆడుతున్న చంద్రబాబు క్షణం కూడా తీరిక లేకుండా బిజీబిజీగా గడుపుతున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లో విశాఖకు రూ.4 లక్షల పెట్టుబడులు తెచ్చామని ప్రభుత్వం చెబుతోంది. ఇక దావోస్ సదస్సును సద్వినియోగం చేసుకుని రాష్ట్రాన్ని పెట్టబడుల గమ్యస్థానంగా మార్చుతామని చెబుతోంది. ప్రభుత్వం ఒకవైపు, టీడీపీ మరోవైపు దావోస్ సదస్సుపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుండగా, గతం గుర్తు చేస్తూ వైసీపీ పోస్టర్ రిలీజ్ చేయడం ఆసక్తికరంగా మారింది. వైసీపీ విమర్శలకు టీడీపీ ఎలాంటి కౌంటర్ ఇస్తుందా? అంటూ నెట్టింట అంతా ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు.