వైసీపీ స్లాట్ లోకి జనసేన ?
రాజకీయాల్లో శూన్యత అన్నది ఒక్కోసారి ఉంటుంది. మరి కొన్ని సార్లు చేసుకోవాల్సి వస్తుంది.
రాజకీయాల్లో శూన్యత అన్నది ఒక్కోసారి ఉంటుంది. మరి కొన్ని సార్లు చేసుకోవాల్సి వస్తుంది. ఇపుడు ఏపీలో అదే పని జరుగుతోందా అంటే జనసేన అధినాయకత్వం ఆలోచనలు చూసూంటే అదే అవును అనిపించేలా ఉంది. ఏపీలో వైసీపీ ఓటమి పాలు అయ్యాక బాగా వీక్ అవుతోంది. ఆ పార్టీలోని నేతలు అంతా కూటమి వైపుగా సాగుతున్నారు. కొందరు టీడీపీని ఎంచుకుంటే మరికొందరు జనసేన వైపు వస్తున్నారు. ఇక వైసీపీలో ఉన్న వారిలో అత్యధికులు పార్టీలో ఉన్నారా లేదా అన్నట్లుగా ఉన్నారు.
వైసీపీలో జగన్ కి పార్టీ నేతల నిర్లిప్తత కొంత ఇబ్బందిని పెడుతోంది. పార్టీని పుంజుకునేలా చేయాలని ఎంత చూసినా నేతల నుంచి తగినంత స్పందన రావడం లేదు. మరో వైపు చూస్తే టీడీపీ కూటమి ఎత్తుకు పై ఎత్తు వేస్తూ వైసీపీని చిత్తు చేస్తోంది
టీడీపీ జనసేన రెండూ వైసీపీని టార్గెట్ చేస్తున్నాయి. ఎక్కడ వీలైతే అక్కడ వైసీపీని దెబ్బ తీయడానికి కాచుకుని కూర్చున్నాయి. జనసేన అయితే కొత్తగా నాయకత్వాన్ని నిర్మించుకోవాలని మొదట భావించింది. కానీ ఇపుడు మాత్రం ఆలోచనలు మారాయని అంటున్నారు. అలాగే ఆట తీరు మార్చింది అని అంటున్నారు.
వైసీపీ నుంచి వచ్చే బిగ్ షాట్స్ కి ఘన స్వాగతం పలకడమే కాకుండా డోర్స్ ఓపెన్ చేసింది. ఎందుకంటే పార్టీ నాయకత్వాన్ని ఎక్కడికక్కడ బలోపేతం చేయడం మంచిదే కానీ అది లాంగ్ టెర్మ్ ప్రాసెస్. అదే టైం లో వైసీపీ ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉంది. ఒక విధంగా చెప్పాలీ అంటే సంక్షోభంలో ఉంది.
దానికి క్యాష్ చేసుకోవడమే రాజకీయంగా ఉత్తమం అని జనసేన భావిస్తోంది. వైసీపీకి ఏ మాత్రం చాన్స్ ఇచ్చినా మళ్ళీ బలంగా మారుతుందని అది జనసేన భవిష్యత్తు అలాగే పార్టీ విస్తరణకు అడ్డంకిగా మారుతుందని భావించే చాలా మందిని వరసబెట్టి చేర్చుకుంటున్నారు అని అంటున్నారు.
ఇప్పటికే కొందరు మాజీ ఎమ్మెల్యేలను మాజీ మంత్రులను జనసేన చేర్చుకుంది. నిజానికి అది జనసేన అధినాయకత్వం పాలసీయే కాదు, కానీ రాజకీయ అనివార్యతే అలా వ్యూహాలు మార్చేలా చేసింది అని అంటున్నారు.
ఇక మీదట కూడా మరింత మందిని వైసీపీ నుంచి ఆకర్షించే కార్యక్రమానికి జనసేన తెర తీస్తోందని అంటున్నారు. జనసేనలో చేరడం వల్ల ఆ పార్టీ నేతలకు కూడా లాభంగానే ఉంది అని అంటున్నారు. అక్కడ పోటీ నాయకత్వం లేకపోవడం ఒక రకమైన అడ్వాంటేజ్ అయితే రేపటి రోజున కూటమిలో అధికారం పంచుకునే చాన్స్ కూడా దక్కుతుంది అన్నది మరో అడ్వాంటేజ్.
ఇలా ఉభయకుశలోపరిగా ఈ చేరికలు ఉంటున్నాయి. ఏపీలో వైసీపీని బాగా తగ్గించాలన్నది నిన్నటి దాకా టీడీపీ ప్లాన్ అయితే దానికి జనసేన కూడా జత కలుస్తోంది. ఎందుకు అంటే వైసీపీ ఎంత బలహీనం అయితే అంతలా ఎదిగే పార్టీ ఏపీలో జనసేన మాత్రమే అని అంటున్నారు.
ఏపీలో ఎటూ టీడీపీ బలంగా ఉంది. దానితో ఢీ కొట్టే పార్టీగా వైసీపీ ఉండాల్సింది. అయితే రాజకీయంగా కొన్ని సమస్యలు ఆ పార్టీని వెంటాడుతున్నాయి. దాంతో వైసీపీని వీక్ చేస్తే ఆ పొలిటికల్ స్లాట్ లోకి సులువుగా వెళ్లవచ్చు అన్నదే జనసేన ఎత్తుగడగా చెబుతున్నారు. దాంతో రానున్న రోజులలో ఏపీలో అనేక సంచలన పరిణామాలు చోటు చేసుకునే వీలు ఉందని అంటున్నారు.