వైసీపీ నయా వ్యూహం : పెద్దల సభ దద్దరిల్లాల్సిందే !

ఎటూ అసెంబ్లీలో వైసీపీ డిమాండ్ నెరవేరదు. ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష స్థానం కల్పించేందుకు అధికార టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధంగా లేదు.

Update: 2025-02-27 18:30 GMT

ఎటూ అసెంబ్లీలో వైసీపీ డిమాండ్ నెరవేరదు. ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష స్థానం కల్పించేందుకు అధికార టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఏపీలో కూటమి వర్సెస్ వైసీపీ అని ఉపూ నిప్పూ మాదిరిగా రాజకీయం ఉన్న వేళ ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలించే అవకాశం వేయింతలు కూడా లేదనే చెప్పాల్సి ఉంటుంది.

అయినా సరే ఈ డిమాండ్ ని ముందు పెట్టి సభకు వెళ్ళకుండానే జనంలో చర్చను వైసీపీ పెట్టింది. సభలో జగన్ లేకపోయినా ఈ ఒక్క కారణంతో ఆయన మీద కూటమి సభ్యులు ఎప్పుడూ విరుచుకు పడుతూంటారు అలా జగన్ గురించి ఎంతో కొంత చర్చ సభలో సాగుతూనే ఉంటుంది. ఇది ఒక స్ట్రాటజీ అయితే ఇక శాసనమండలిలో వైసీపీ బలం ఈ రోజుకీ 38కి తక్కువ కాకుండా ఉంది.

దాంతో మండలిలో మెజారిటీ ఉన్న వైసీపీ అక్కడే ఇకమీదట తన సత్తా చాటాలని చూస్తోంది. మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద గట్టిగానే మాట్లాడారు. దాంతో పాటు సూపర్ సిక్స్ హామీలేవీ అని కూటమి ప్రభుత్వ పెద్దలను నిలదీస్తున్నారు. ఇలా అనేక రకాలుగా కూటమి సర్కార్ ని నిలదీస్తూ వైసీపీ ఒక వ్యూహం ప్రకారం ముందుకు సాగుతోంది.

అంతే కాదు బడ్జెట్ ప్రవేశపెట్టాక మరింతగా వాడి వేడి చూపించాలని వైసీపీ ఎమ్మెల్సీలు డిసైడ్ అయ్యారు. దీంతో అధికార కూటమికి మండలిలో చిక్కులు ఎదురవుతున్నాయని అంటున్నారు. ఒక వైపు శాసన సభ విపక్షం లేక చప్పగా సాగుతూంటే మండలి మాత్రం అటూ ఇటూ మాటల తూటాలతో మంటెక్కిపోతోంది.

ఇంకో వైపు చూస్తే మండలిలో ప్రతిపక్షాన్ని ఎదుర్కొనేందుకు మంత్రి నారా లోకేష్ సహా కీలక మంత్రులు అక్కడికే వస్తున్నారు. హోం మంత్రి వంగలపూడి అనిత, రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తో పాటు ఇతర మంత్రులు అంతా మండలిలోనే కనిపిస్తున్నారు. దాంతో ఆవేశ కావేశాలు అన్నీ మండలిలోనే కనిపిస్తున్నాయి.

అదే విధంగా సవాళ్ళొ ప్రతి సవాళ్ళూ అక్కడే అంతా చూస్తున్నారు. ఈసారి బడ్జెట్ సెషన్. మరో మూడు వారాల పాటు సమావేశాలు జరగనున్నాయి. దాంతో మండలిలో వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో తగ్గకూడదని నిర్ణయించింది. అక్కడ సీనియర్ నేతలు చాలా మంది ఉండడం కూడా ఆ పార్టీకి ఉపకరిస్తోంది.

మండలిలో వైసీపీ నుంచి కూటమికి మెజారిటీ రావాలంటే మరో రెండేళ్ళకు పైగా సమయం ఉంటుంది. అప్పటి దాకా పెద్దల సభను దద్దరిల్ల చేయాలని వైసీపీ కంకణం కట్టుకుంది. మండలి చైర్మన్ వైసీపీ వారే కావడం విశేషం. ఇక అక్కడ కూటమి జోరు కంటే వైసీపీ దూకుడే ఎక్కువగా కనిపిస్తోంది అని అంటున్నారు.

Tags:    

Similar News