పవన్ పై వైసీపీ ట్రోల్స్!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరద బాధితులకు భారీ ఎత్తున విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరద బాధితులకు భారీ ఎత్తున విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయల చొప్పున విరాళం ప్రకటించారు. అలాగే వరద ముంపులో చిక్కుకున్న పంచాయతీలకు లక్ష రూపాయల చొప్పున మరో నాలుగు కోట్ల రూపాయలు తన వ్యక్తిగత సంపద నుంచి ఇస్తానన్నారు. మొత్తం మీద అందరు హీరోల కంటే అత్యధికంగా రూ.6 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు.
వరద బాధితులను తాను పరామర్శించడం లేదని వైసీపీ చేస్తున్న ఆరోపణలపై పవన్ స్పందించారు. తాను వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తే సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందన్నారు. అభిమానులంతా తనను చుట్టుముడతారని.. దీంతో అసలు పనికి ఇబ్బంది ఏర్పడుతుందన్నారు. తాజాగా వరద సహాయక చర్యలపై పవన్ కళ్యాణ్, హోం శాఖ మంత్రి వంగలపూడి అనితతో కలిసి సమీక్షించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మీడియాకు వరద సహాయక చర్యలను వివరించారు. డ్రోన్ల ద్వారా వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులను, కూరగాయలను, మందులు, పాలను, ఆహారాన్ని సరఫరా చేస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో ఆయన మీడియాకు ఒక ఫొటోను చూపారు. డ్రోన్ల ద్వారా సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయనడానికి ఈ ఫొటోనే నిదర్శనమని ఒక ఫొటో చూపారు. ఆ ఫొటోలో ఒక వృద్ధురాలికి డ్రోన్ ద్వారా ఆహారం, ఇతర పదార్థాలు అందిస్తున్నట్టు ఉంది.
అయితే అది ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఫొటో అని వైసీపీ ట్రోల్స్ కు దిగింది. ఆ ఫొటోపైన ఏఐ మోడల్ చిత్రమని ఉందని వెల్లడించింది. అయినా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలకు, మీడియాకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని మండిపడింది. ఏఐ చిత్రానికి, సాధారణ చిత్రాలకు కూడా ఆయనకు తేడా తెలియదని ట్రోల్ చేసింది. కూటమి ప్రభుత్వం ఫేక్ ప్రచారాలు చేసుకుంటుందని ఎద్దేవా చేసింది. ఈ ఫొటో ద్వారా పవన్ కళ్యాణ్ తోపాటు ప్రభుత్వం కూడా అడ్డంగా బుక్కయిందని వైసీపీ విమర్శించింది.
ఆ డ్రోన్ ఫొటోను ముందు పోస్టు చేసిన పవన్ కళ్యాణ్ విమర్శలు రావడంతో ఆ చిత్రాన్ని డిలీట్ చేశారని వైసీపీ విమర్శలు గుప్పించింది. వరద బాధితుల్లో ప్రజలు ఉంటే సహాయం చేయకపోగా ప్యాకేజీ తీసుకుని చంద్రబాబు భజనలో పవన్ మునిగితేలుతున్నాడని ఆరోపించింది.