వైసీపీ తొమ్మిదో జాబితా.. మళ్లీ రివర్స్‌!

ఇప్పటివరకు 8 జాబితాలు వెలువడగా తాజాగా 9వ జాబితా వెలువడింది. ఈ జాబితాలో ఒక ఎంపీ సీటుకు, మరో రెండు అసెంబ్లీ సీట్లకు జగన్‌ అభ్యర్థులను ప్రకటించారు.

Update: 2024-03-02 06:14 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ కృతనిశ్చయంతో ఉన్నారు.175కి 175 స్థానాలు సాధించాలని తమ పార్టీ శ్రేణులకు నూరిపోస్తున్నారు. రీజియన్లవారీగా భారీ ఎత్తున సిద్ధం సభలను నిర్వహిస్తూ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.

ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్థులను జాబితాలవారీగా జగన్‌ వెల్లడిస్తున్నారు. ఇప్పటివరకు 8 జాబితాలు వెలువడగా తాజాగా 9వ జాబితా వెలువడింది. ఈ జాబితాలో ఒక ఎంపీ సీటుకు, మరో రెండు అసెంబ్లీ సీట్లకు జగన్‌ అభ్యర్థులను ప్రకటించారు.

తాజాగా ప్రకటించిన మూడు సీట్లలో రెండు సీట్లకు ఇంతకుముందు జాబితాల్లోనే జగన్‌ అభ్యర్థులను ప్రకటించడం విశేషం. మళ్లీ ఇప్పుడు తాజా జాబితాలో వారిని మార్చేశారు.

తాజా జాబితా ప్రకారం నెల్లూరు లోక్‌ సభా స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని ప్రకటించారు. ప్రస్తుతం విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అంతేకాకుండా ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా, జాతీయ ప్రధాన కార్యదర్శి, గుంటూరు, ప్రకాశం జిల్లాల పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ గా చక్రం తిప్పుతున్నారు.

రాజ్యసభ సభ్యుడిగా విజయసాయిరెడ్డి పదవీకాలం 2028 జూన్‌ వరకు ఉంది. ఆయనను ఇప్పుడు నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం హాట్‌ టాపిక్‌ గా మారింది. ఇంతకుముందు జాబితాలో నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో నిందితుడిగా ఉన్న శరత్‌ చంద్రారెడ్డిని జగన్‌ ప్రకటించారు. ఇప్పుడు మళ్లీ ఆయనను మార్చేసి విజయసాయిరెడ్డిని బరిలో దింపుతున్నారు.

ఇక మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి ఇంతకుముందు గంజి చిరంజీవిని అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ఆయనకు సహకరించబోమని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, వైసీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు మురుగుడు హనుమంతరావు, కాండ్రు కమల తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది. దీంతో మంగళగిరిలోనూ జగన్‌ అభ్యర్థిని మార్చేశారు. మంగళగిరి నుంచి తాజాగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె అయిన మురుగుడు లావణ్యను అభ్యర్థిగా ప్రకటించారు.

ఇక కర్నూలులో ప్రస్తుతం వైసీపీ తరఫున హఫీజ్‌ ఖాన్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు వచ్చే ఎన్నికల్లో సీటు నిరాకరించిన జగన్‌ ఆ స్థానాన్ని కొద్ది రోజుల క్రితం ఐఏఎస్‌ పదవికి రాజీనామా చేసిన ఇంతియాజ్‌ కు కేటాయించారు. వచ్చే ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ తరఫున ఇంతియాజ్‌ పోటీ చేయనున్నారు.

Tags:    

Similar News