కడప కాళ్ళ కిందకు నీళ్ళు...జగన్ ఏం చేయబోతున్నారు ?

ఏపీలో రాజకీయం టోటల్ గా తారుమారు అయింది. పూర్వకాలం రాజులు ఒక్కో దుర్గం జయించినట్లుగా ఏపీలో టీడీపీ కూటమి వైసీపీ ఆధీనంలో ఉన్న ఒక్కో మునిసిపాలిటీని జిల్లా పరిషత్తులను ఒక వ్యూహం ప్రకారం లాగేసుకుంటోంది.

Update: 2024-08-17 06:08 GMT

ఏపీలో రాజకీయం టోటల్ గా తారుమారు అయింది. పూర్వకాలం రాజులు ఒక్కో దుర్గం జయించినట్లుగా ఏపీలో టీడీపీ కూటమి వైసీపీ ఆధీనంలో ఉన్న ఒక్కో మునిసిపాలిటీని జిల్లా పరిషత్తులను ఒక వ్యూహం ప్రకారం లాగేసుకుంటోంది. అలాగే మునిసిపాలిటీలను కార్పోరేషన్లను కూడా గట్టిగానే టార్గెట్ చేస్తోంది. అవన్నీ తెచ్చి తన ఖాతాలో వేసుకుంటోంది.

ఏపీలో టాప్ టూ బాటమ్ కూటమి మాత్రమే కనిపించాలని వైసీపీని ఆనవాళ్ళు లేకుండా చేయాలని కూటమి పంతం పట్టినట్లుగా ఉంది. కూటమి చేతిలో అధికారం ఉండడంతో పాచికలు అన్నీ పారుతున్నాయి. అలా కూటమి పెద్దలు కడప మీద కన్నేశారు. కడప జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటే వైసీపీ అధినేత జగన్ కి గట్టి దెబ్బ పడుతుందని ఆలోచిస్తున్నారు.

ఈ పరిణామంతో వైసీపీ అధినాయకత్వం అలెర్ట్ అయింది. కడప జిల్లా పరిషత్తుకు చెందిన జెడ్పీటీసీలను మొత్తం రమ్మంటూ హై కమాండ్ నుంచి పిలుపు వెళ్ళింది వారిని అందరికీ ఈ నెల 21న జగన్ తాడేపల్లిలోని తమ పార్టీ ఆఫీసులో కలవబోతున్నారు. వారితో కీలక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు.

ఈ సమావేశం ద్వారా వారికి దిశానిర్దేశం చేయనున్నారు. కడప జెడ్పీ పీఠం చేజారకుండా జగన్ తమ పార్టీ వారిని కట్టడి చేయనున్నారు అని అంటున్నారు. కడప జెడీలో మొత్తం 50 జెడ్పీటీసీ పదవులు ఉన్నాయి. ఇందులో రెండు ఖాళీలు ఉంటే మిగిలిన 48 జెడ్పీటీసీలలో 47 మంది వైసీపీకి చెందినవారే ఉన్నారు.

ఇక సార్వత్రిక ఎన్నికలకు ముందు అయిదుగురు జడ్పీటీసీలు టీడీపీలో చేరారు. అలాగే ఒక జెడ్పీటీసీ బీజేపీలో చేరారు.అంటే ఇపుడు కడప జెడ్పీలో వైసీపీ బలం 41కి పడిపోయింది అన్న మాట. మెజారిటీ ఉండాలంటే 25 మంది ఉండాలి. కూటమికి ఏడుగురు ఉన్నారు. మిగిలిన వారి కోసం వల వేస్తున్నారు.

అలా ఆపరేషన్ ఆకర్ష్ ని స్టార్ట్ చేశారు. దాంతో ఉలిక్కిపడిన వైసీపీ హై కమాండ్ కడప కోటను నిలబెట్టుకునేందుకు ఈ కీలక మీటింగ్ ఏర్పాటు చేసింది. ఈ సమావేశం తరువాత వైసీపీ వ్యూహం ఏమిటి అన్నది బయటకు వస్తుంది.

ఇదిలా ఉంటే ఏపీలో గత రెండు నెలలుగా వైసీపీ నుంచి స్థానిక ప్రజా ప్రతినిధులు టీడీపీ కూటమిలో చేరుతున్నారు. వారిని అప్పట్లోనే పిలిచి ఇలాంటి మీటింగులు ఏర్పాటు చేసి హై కమాండ్ భరోసాగా నిలిస్తే కొందరు అయినా ఆగేవారు కదా అన్న మాట ఉంది. ఇపుడు ఏకంగా కడప కాళ్ళ కిందకే నీళ్ళు రావడంతో వైసీపీ హై కమాండ్ అలెర్ట్ అయింది అని అంటున్నారు. ఇక మీదట అయినా వైసీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో ఇదే తరహా మీటింగులు నిర్వహించి తమ వారిని కట్టడి చేసుకోకపోతే ఏపీలో వైసీపీ రాజకీయ ఉనికికే ముప్పు వచ్చేలా ఉంది అని అంటున్నారు.

కడపతో జగన్ మొదలెడుతున్నారు కాబట్టి ఏపీలో ఉన్న జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలోని వైసీపీ ప్రజా ప్రతినిధులతో మీటింగులు వరసగా పెట్టాలని కోరుతున్నారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జగన్ స్థానిక ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశాల వల్లనే కూటమి వ్యూహం విఫలం అయి పోటీకి దూరం జరిగింది. అధినాయకత్వం అన్నాక తమ పార్టీ వారికి కాపాడుకోవడంలో శ్రద్ధ చూపించకపోతే ఎలా అన్న చర్చ కూడా సాగుతోంది.

Tags:    

Similar News