టీడీపీలోకి క్యూ కడుతున్న వైసీపీ సీనియర్లు ?
విశాఖ నగరానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎస్ఎ రెహమాన్ టీడీపీలోకి చేరేందుకు ఆసక్తిని చూపుతున్నారు.
విశాఖ నగరానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎస్ఎ రెహమాన్ టీడీపీలోకి చేరేందుకు ఆసక్తిని చూపుతున్నారు. ఆయన తాజాగా ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు ఇంటికి వెళ్ళి కలిశారు. ఈ భేటీ మామూలే అని చెబుతున్నారు. పల్లా ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అయిన సందర్భంగా అభినందించడానికి వచ్చామని కూడా పేర్కొంటున్నారు.
బయటకు మర్యాదపూర్వక భేటీ అని చెబుతున్నా అసలు విషయం వేరు అని అంటున్నారు. ఆయన సైకిలెక్కుతారని దాని గురించి చర్చించడానికే వచ్చారని అంటున్నారు. 1994లో తొలిసారి అప్పటి విశాఖ వన్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున గెలిచిన ఎస్ఏ రెహమాన్ ఉడా చైర్మన్ గా కూడా వ్యవహరించారు. విశాఖ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ గా సుదీర్ఘ కాలం పనిచేశారు.
ఆ తరువాత 2009లో ప్రజారాజ్యంలో చేరారు. అక్కడ నుంచి తిరిగి 2014లో టీడీపీ 2019 ఎన్నికల ముందు వైసీపీలోకి వచ్చారు. అయితే ఎక్కడ చేరినా పదవులు అయితే గడచిన కాలంలో దక్కలేదు. దాంతో 2024లో ఆయన ఎమ్మెల్యే టికెట్ లేదా ఎమ్మెల్సీ అయినా దక్కుతుందని వైసీపీ వైపు చూసినా అదీ లేదు. స్థానిక కోటాలో ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారనుకుంటే బొత్సకు ఇచ్చారు.
దాంతో పాటు విశాఖ జిల్లాలో వైసీపీ రోజు రోజుకూ బలహీనపడుతూండడం ఏపీలో కూడా వైసీపీకి విపక్షానికి సరిపడా సీట్లు రాకపోవడం ముందు ముందు ఇబ్బందులు ఎదురవుతాయని భావించడంతో చాలా మంది నేతల మాదిరిగానే ఆయన కూడా టీడీపీ వైపు చూస్తున్నారు అని అంటున్నారు.
చంద్రబాబుకు రెహమాన్ ఆప్తుడుగానే ఉండేవారు. ఆయనను బాగా చూసుకునేవారు. దాంతో పల్లా ద్వారా టీడీపీలో చేరి మళ్లీ అధికార పార్టీలో ఉంటూ తన వీలైతే ఏదైనా పొందవచ్చు అన్నదే ఆయన ఆలోచన అని అంటున్నారు.
ఇక రెహమాన్ తో పాటు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఒకనాడు అనుచరుడుగా ఉన్న రియల్టర్ కాశీ కూడా పల్లాను కలిసిన వారిలో ఉన్నారు. ఆయన మూడేళ్ళ క్రితం వైసీపీలో చేరారు. ఆయన రాక వల్ల కార్పోరేషన్ ఎన్నికల్లో వైసీపీ లాభపడింది. కానీ ఆయనకు మాత్రం ఏ పదవులూ దక్కలేదు. దాంతో ఆయన ఇటీవల ఎన్నికల్లో అనకాపల్లి ఎమ్మెల్యే సీటు కానీ ఎంపీ సీటు కానీ ఆశించారు.
అయితే అది కూడా దక్కకపోవడంతో ఆయన నిరాశలో ఉన్నారు. వైసీపీ కూడా ఘోరంగా ఓటమి పాలు కావడంతో ఆయన సైతం టీడీపీ వైపు రావాలని అనుకుంటున్నారు అని అంటున్నారు. మొత్తానికి ఈ ఇద్దరితో పాటు మరింత మంది నేతలు కూడా టీడీపీలోకి వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. విశాఖలో ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న వేళ కీలక నేతలు పార్టీ నుంచి బయటకు రావాలనుకోవడం మాత్రం ఫ్యాన్ పార్టీకి ఇబ్బందికరమే అని అంటున్నారు.